ఆ పాట లేకపోతే `మురారి` నుంచి తప్పుకుంటానన్నారట!

ABN , First Publish Date - 2020-02-18T19:40:09+05:30 IST

సూపర్‌స్టార్ మహేష్‌బాబును అమ్మాయిల కలల రాకుమారుడిలా మార్చిన చిత్రం `మురారి`.

ఆ పాట లేకపోతే `మురారి` నుంచి తప్పుకుంటానన్నారట!

సూపర్‌స్టార్ మహేష్‌బాబును అమ్మాయిల కలల రాకుమారుడిలా మార్చిన చిత్రం `మురారి`. ఒక మంచి ప్రేమకథకు ఓ ఫాంటసీ పాయింట్‌ను జోడించి కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. టాలీవుడ్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచింది. 2001 ఫిబ్రవరి 17వ తేదీన విడుదలైన ఈ చిత్రం సోమవారంతో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ బుల్లితెర మీద మంచి ఆదరణ దక్కించుకుంటున్న ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.. 


మహేష్ నటన

`మహేష్‌కు స్వతహాగా సిగ్గెక్కువ. పట్నంలో పెరిగాడు. నలుగురిలో తొందరగా కలవలేడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పల్లెటూళ్లో, బోలెడంత మంది ఆర్టిస్టుల మధ్య పడేసి నటించమన్నాం. ఒకసారి పాత్రలోకి ప్రవేశించాక మహేష్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి తడబాటూ లేకుండా తన పాత్రను చక్కగా పండించాడ`ని గతంలో ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ చెప్పారు. అప్పటికి వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న మహేష్‌కు కృష్ణవంశీ చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. మురారి పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్లనూ మహేష్ అద్భుతంగా పండించాడు. అలాగే హీరోయిన్ సోనాలీ బింద్రే కూడా మహేష్‌తో పోటీపడి నటించింది. అటు నటనపరంగానూ, ఇటు గ్లామర్‌పరంగానూ ఆకట్టుకుంది. మహేష్, సోనాలి మధ్య కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరింది. కృష్ణవంశీ టేకింగ్..

గాఢమైన ప్రేమకథను, కుటుంబ బంధాలను, పల్లెటూరి నేపథ్యాన్ని, ఓ ఫాంటసీ పాయింట్‌ను కలగలిపి కృష్ణవంశీ రూపొందించిన `మురారి` ఆయన కెరీర్‌లోనే మరపురాని చిత్రంగా నిలిచింది. అప్పటివరకు ఉన్న ఫార్ములాను కాదని కథను కొత్తపుంతలు తొక్కించి కృష్ణవంశీ రూపొందించిన ఈ చిత్రం ఆ తర్వాత ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది. సునిశితమైన హాస్యం, కుటుంబ బంధాలను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 
అలనాటి రామచంద్రుడు..

సాధారణంగా పెద్ద హీరోల సినిమాల చివర్లో మాస్ సాంగ్ రావడం ఎప్పట్నుంచో ఉన్న ఆనవాయితీ. అయితే ఈ సినిమాలో మాత్రం `అలనాటి రామచంద్రుడు` వంటి క్లాస్ సాంగ్‌ను చివరి పాటగా పెట్టాలని దర్శకుడు నిర్ణయించుకున్నారు. ఈ పాట క్లైమాక్స్ ముందు వద్దని కృష్ణవంశీకి చాలా మంది చెప్పారట. అయినా ఆయన వినలేదు. చివరికి ఈ గొడవ కృష్ణవద్దకు వెళ్లిందట. ఆయన కూడా మాస్ సాంగ్ పెట్టమని సూచించారట. `ఈ పాట అక్కడ లేకపోతే నేను సినిమా నుంచి తప్పుకుంటాన`ని కృష్ణవంశీ తేల్చిచెప్పారట. చివరకు కృష్ణ ఒప్పుకున్నారట. ఆ పాట, చిత్రీకరణ ఎంత ఆదరణ దక్కించుకున్నాయో తెలిసిందే. ఇప్పటికీ ఆ పాట పెళ్లి వేడుకల్లో మార్మోగుతూనే ఉంటుంది. ఇక, ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటలన్నీ ఎవర్‌గ్రీన్. 


 

Updated Date - 2020-02-18T19:40:09+05:30 IST