ప్రపంచ సినిమాని ఆకర్షిస్తోన్న భాగ్యనగరం

ABN , First Publish Date - 2020-12-24T03:27:05+05:30 IST

భాగ్యనగరంలో కొత్త ఊర్లు వెలుస్తున్నాయి. పల్లె నుంచి పట్నం వరకు.. అడవి నుంచి అమెరికా వరకు.. దర్శకులు ఏది కావాలనుకుంటే అది.. హైదరాబాద్ లో కొలువుదీరుతోంది

ప్రపంచ సినిమాని ఆకర్షిస్తోన్న భాగ్యనగరం

భాగ్యనగరంలో కొత్త ఊర్లు వెలుస్తున్నాయి. పల్లె నుంచి పట్నం వరకు.. అడవి నుంచి అమెరికా వరకు.. దర్శకులు ఏది కావాలనుకుంటే అది.. హైదరాబాద్ లో కొలువుదీరుతోంది. ఆర్ట్ డైరెక్టర్లు ఆయా ప్రాంతాల సెట్స్ ను ట్విన్ సిటీస్ లో తీర్చిదిద్దుతున్నారు. కోవిడ్ ప్రభావంతో రియల్ లొకేషన్స్ లో షూటింగ్స్ కి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో.. ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమాలన్నింటికీ హైదరాబాద్ పెద్ద అడ్డాగా మారింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతీ ప్రాంతాన్నీ ఇక్కడే సెట్స్ రూపంలో తీర్చిదిద్దుతున్నారు. ఆయా కాలాలకు సంబంధించిన ఊర్లు, పట్టణాలు, నగరాలు.. సెట్స్ రూపంలో కొలువుదీరుతున్నాయి.


చిరంజీవి - కొరటాల శివ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఆచార్య'. దేవదాయ శాఖలోని అవినీతి నేపథ్యంలో ఉండే ఈ మూవీ ఆద్యంతం 'ధర్మస్థలి' అనే ఊరు చుట్టూ సాగుతోంది. ఈ సినిమాకోసం.. 16 ఎకరాల విస్తర్ణంలో 20 కోట్ల రూపాయలతో హైదరాబాద్ శివారులో 'ధర్మస్థలి' అని ఒక ఊరినే నిర్మించారు. ఇక.. సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ 'అన్నాత్తే' కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకోసం భాగ్యనగరంలోనే ఒక పల్లెటూరు సెట్ వేయడం విశేషం. తమిళనాడులోని ఒక గ్రామాన్ని ప్రతిబింబించేలా రజనీ సినిమాకోసం సెట్ వేశారట.


'రంగస్థలం' కోసం హైదరాబాద్ లోనే ఒక ఊరును సెట్ రూపంలో వేయించిన సుకుమార్.. ఇప్పుడు 'పుష్ప' కోసం ఏకంగా అడవినే భాగ్యనగరానికి తీసుకురాబోతున్నాడట. అల్లు అర్జున్ 'పుష్ప' ఆద్యంతం నల్లమల అడవుల్లో ఎర్రచందనం నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమాకోసం తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో కొంతభాగం షూటింగ్ చేశారు. ఇక.. మ్యాచింగ్ షాట్స్ కోసం హైదరాబాద్ లోనే ఫారెస్ట్ సెట్స్ వేస్తున్నారట. నాని 'శ్యామ్ సింగ రాయ్' కోసం కోల్‌కత్తాని ట్విన్ సిటీస్ కి తీసుకొచ్చాడట డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్. పీరియడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాకోసం భారీగా వెచ్చించి.. కలకత్తాను ప్రతిబింబించే సెట్స్ ను నిర్మించారట. ఇక.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కథాంశం అయిన 'కె.జి.ఎఫ్-2' కోసం హైదరాబాద్ లోనే బంగారు గనుల సెట్స్ ను నిర్మించి షూటింగ్ పూర్తిచేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ సినిమా ఆద్యంతం 1970ల కాలం నాటి యూరప్ నేపథ్యంలో ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమాకోసం ఇటలీలో చాలాభాగం షూటింగ్ పూర్తయ్యింది. ఇక.. కోవిడ్ నేపథ్యంలో యూనిట్ మళ్లీ ఇటలీకి వెళ్లడం సాధ్యం కాదు. అందుకే.. ఇటలీనే ఇండియాకి తీసుకొచ్చారు. ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్.. యూరప్ సెట్స్ ను హైదరాబాద్ లో తీర్చిదిద్దాడు.


మెగా ఫ్యామిలీ హీరోలు సాయిధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్ లు తమ అప్ కమింగ్ మూవీస్ కోసం ఏలూరు, మదనపల్లె... హైదరాబాద్ కి తీసుకొస్తే.. అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ ఏకంగా అమెరికానే హైదరాబాద్‌లో ఆవిష్కరించాడట. కోవిడ్‌కి ముందు అమెరికాలో కొంత భాగం షూటింగ్ పూర్తిచేసుకుంది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఇక.. అమెరికాలో చేయాల్సిన బ్యాలెన్స్ సీన్స్ కోసం.. హైదరాబాద్‌కే అగ్ర రాజ్యం నమూనాని తీసుకొచ్చారట. 


మొత్తంమీద.. కోవిడ్ ప్రభావంతో ఒరిజినల్ లొకేషన్స్ కి వెళ్లలేక.. టెక్నాలజీని ఉపయోగించి.. పలు ప్రాంతాలను భాగ్యనగరంలో ఆవిష్కస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. మరి ఈ సరికొత్త ప్రయత్నాలు ఈ సినిమాలకు ఎంతవరకూ కలిసొస్తాయో చూడాలి.

Updated Date - 2020-12-24T03:27:05+05:30 IST