కంగన పిటిషన్‌పై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన బోంబే హైకోర్టు..

ABN , First Publish Date - 2020-10-05T20:04:38+05:30 IST

ముంబై మున్సిపల్ అధికారులు తన ఇంటిని కూల్చివేయడంపై ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా...

కంగన పిటిషన్‌పై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన బోంబే హైకోర్టు..

ముంబై: ముంబై మున్సిపల్ అధికారులు తన ఇంటిని కూల్చివేయడంపై ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బోంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎస్‌జే కతావాలా, జస్టిస్ ఆర్ఐ చగ్లా ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ముంబైలోని పాలి హిల్ ప్రాతంలోని తన బంగ్లాలో కొంత భాగాన్ని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు కూల్చివేయడంపై కంగన గత నెల 9న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కూల్చివేత అక్రమమని ప్రకటించాలనీ, ఇంటిని కూలగొట్టినందుకు గానూ రూ. 2 కోట్లు పరిహారం చెల్లించాలని కంగన తన పిటిషన్‌లో కోరారు. కంగన తరపున న్యాయవాది డాక్టర్ బీరేంద్ర సరాఫ్ వాదనలు వినిపించారు. ముంబై పోలీసుపై తాను చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వానికి గిట్టకపోవడం వల్లే బీఎంసీ అధికారులు తన ఇంటిని కూల్చివేశారని కంగన తన పిటిషన్‌లో ఆరోపించారు. తనను బెదిరిస్తూ శివసేన నేత సంజయ్ రావత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని కూడా ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ ఆరోపణలను బీఎంసీ ఖండించింది.  అక్రమ నిర్మాణం అయినందువల్లే ఆమె ఇంటిని కూల్చివేసినట్టు బీఎంసీ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-05T20:04:38+05:30 IST