అత్యాచారం కేసులో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను ప్రశ్నించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-10-01T21:08:32+05:30 IST

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్‌ను ఈ రోజు ముంబై పోలీసులు ప్రశ్నించారు. కశ్యప్‌పై గతవారం

అత్యాచారం కేసులో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను ప్రశ్నించిన పోలీసులు

ముంబై: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్‌ను ఈ రోజు ముంబై పోలీసులు ప్రశ్నించారు. కశ్యప్‌పై గతవారం అత్యాచారం కేసు నమోదు కాగా, విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నిన్న సమన్లు జారీ చేశారు.


దీంతో ఈ ఉదయం తన న్యాయవాది ప్రియాంక ఖిమానితో కలిసి వెర్సోవా పోలీస్ స్టేషన్‌‌కు వచ్చి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కశ్యప్ మాట్లాడుతూ.. 2013లో తన ఇంట్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

 

రాజ్యసభ సభ్యుడు, కేంద్రమంత్రి రాందాస్ అథవాలేతో కలిసి మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీని కలిసిన నటి కశ్యప్‌ను అరెస్ట్ చేయాలని కోరింది. ఆ తర్వాత కశ్యప్‌కు సమన్లు జారీ అయ్యాయి. కశ్యప్‌ను ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నటి అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోకుంటే నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించింది.


సోమవారం మీడియాతో మాట్లాడిన అథవాలే.. నటి ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెకు వై-ప్లస్ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కశ్యప్‌ను అరెస్ట్ చేసి, నటికి భద్రత కల్పించాలని కోరారు. బాధిత నటికి తమ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.    


Updated Date - 2020-10-01T21:08:32+05:30 IST