చిరు బాలీవుడ్‌ ఎంట్రీ చిత్రానికి 30 ఏళ్ళు

ABN , First Publish Date - 2020-09-29T04:36:06+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ తన ప్రతాపం చూపించారు. ఎన్టీఆర్ 'నయా ఆద్మీ'‌, ఏఎన్నార్‌ 'సువర్ణ సుందరి'

చిరు బాలీవుడ్‌ ఎంట్రీ చిత్రానికి 30 ఏళ్ళు

మెగాస్టార్‌ చిరంజీవి టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ తన ప్రతాపం చూపించారు. ఎన్టీఆర్ 'నయా ఆద్మీ'‌,  ఏఎన్నార్‌ 'సువర్ణ సుందరి' చిత్రాలతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. వారి బాటలోనే మెగాస్టార్‌ చిరంజీవి కూడా బాలీవుడ్‌లో తన స్టామినా చూపించాలని చూశారు కానీ.. రెండు మూడు చిత్రాల తర్వాత పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోయారు. ఆయన బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'ప్రతిబంధ్‌'. ఈ చిత్రం 1990లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. తెలుగు చిత్రం 'అంకుశం'కు ఇది రీమేక్. ఈ చిత్రం తర్వాత ఆజ్ కా గుండా రాజ్, ది జెంటిల్ మేన్ వంటి హిందీ చిత్రాలలో కూడా చిరంజీవి నటించారు. ఇక ప్రతిబంధ్‌ విషయానికి వస్తే.. ఈ చిత్రం సెప్టెంబర్‌ 28తో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. చిరంజీవి సరసన జూహీచావ్లా హీరోయిన్‌గా నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ నిర్మించారు. 
ఈ చిత్రంలో చిన్న పాత్ర చేసినట్లుగా అల్లు శిరీష్‌ పేర్కొన్నారు. ''ప్రతిబంధ్‌ నేను నటించిన మొదటి చిత్రం. ఆ టైమ్‌లో నేను ఏమిచేస్తున్నానో నాకస్సలు తెలియదు. వాళ్లు ఏమిచెబితే అది చేశాను. నాకసలు అవగాహనే లేదు.." అని శిరీష్ చెబుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

Updated Date - 2020-09-29T04:36:06+05:30 IST