ఇదొక్కటీ చాలు.. రహ్మాన్ ఏంటో చెప్పడానికి!

ABN , First Publish Date - 2020-02-03T00:37:07+05:30 IST

ఎ.ఆర్‌. రహ్మాన్. 1992లో తమిళ సినిమా రోజా‌ తో‌ సంగీత దర్శకులుగా పరిచయమై అంతర్జాతీయ‌‌‌‌ సంగీత దర్శకులుగా‌ నిలిచారు. ఆస్కర్ పొందిన తొలి

ఇదొక్కటీ చాలు.. రహ్మాన్ ఏంటో చెప్పడానికి!

ఎ.ఆర్‌. రహ్మాన్. 1992లో తమిళ సినిమా రోజా‌ తో‌ సంగీత దర్శకులుగా పరిచయమై అంతర్జాతీయ‌‌‌‌ సంగీత దర్శకులుగా‌ నిలిచారు. ఆస్కర్ పొందిన తొలి భారతీయ సంగీత‌ దర్శకులు, ఒకే ఏడాది 2‌‌‌ ఆస్కర్ అవార్డులను పొందిన తొలి ఆసియా దేశస్థులు, గ్రామి అకాడమి‌‌ అవార్డ్‌ అందుకున్న‌ తొలి‌ భారతీయ‌‌‌ సంగీత‌ దర్శకులు రహ్మాన్.

 

1992 రోజా సినిమా నుంచి 2018 బిగిల్ సినిమా వఱకూ వేఱువేఱు భాషల్లో దాదాపుగా‌ 70‌ సినిమాలకు వారు సంగీతం‌ చేశారు. రహ్మాన్ వల్ల మనదేశ సినిమా‌ సంగీతం అంతర్జాతీయ స్థాయిని‌ అందుకోగలిగింది. ఇవాళ వారి 53వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎ.ఆర్.‌ రహ్మాన్ గుఱించి ముచ్చటించుకుందాం రండి.

 

ఎ.ఆర్. రెహ్మాన్ ఒక దార్శనిక (visionary) సంగీతదర్శకులు. ఎంతో మంది‌ సంగీత‌ దర్శకుల్లో‌‌ కొందఱు మాత్రమే గొప్ప సంగీతదర్శకులుంటారు. ఆ స్థాయివారిలో కొందఱు ట్రెండ్ సెట్టింగ్ సంగీత దర్శకులు, కొందఱు విషనరి సంగీత దర్శకులు ఉంటారు. పంకజ్ మల్లిక్, శంకర్-జయకిషన్,‌ ఆర్. డి. బర్మన్, ఎస్. రాజేశ్వరరావు, ఎం.ఎస్.‌ విశ్వనాథన్ వంటివారు విషనరి సంగీత దర్శకులు. ఆ కోవలో ఎ.ఆర్. రహ్మాన్ ఒక విషనరీ సంగీతదర్శకులు.

 

1992లో రోజా సినిమాతో‌ రహ్మాన్ భారతదేశ‌ం సినిమా సంగీతంలో ఒక‌ విప్లవాన్ని తీసుకొచ్చారు. బాణి (tune), వాద్య సంగీతం‌ (orchestration) శబ్దీకరణ‌ం (sounding)లలో ఒక అపూర్వమైన ప్రత్యేకతను తీసుకొచ్చారు ఎ.ఆర్. రహ్మా‌న్. రోజా‌ సినిమాతో అంతర్జాతీయ‌స్థాయి సంగీతాన్ని భారతదేశంలో ధ్వనింపజేశారు రహ్మాన్. రోజా‌‌ సినిమాలోని ప్రతిపాటా‌ ఓ కొత్తదైన‌ ఛాయతో ఉంటుంది. "పరువం వానగా ఇట ‌కురిసేనులే" పాట‌ మొత్తం భారతదేశంలోనే‌ ఒక అపూర్వమైన పాట.‌ ఒక సరికొత్త ధోరణిలో రూపొందిన బహు‌ గొప్ప పాట. ఒక‌ దార్శనికమైన‌ పాట.‌ ఆ సినిమాలో‌ని "చిన్ని చిన్ని ఆశ" పాట‌ విపరీతంగా ప్రబలమైన పాట. జపాన్ వంటి‌ విదేశాల్లోనూ‌ ఈ‌ పాట‌ ఎంతో జనరంజకమైపోయింది. రోజా సినిమా పాటలు హిందీలోకి డబ్ కాబడి‌ దేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ధ్వనించాయి. రోజా‌ సినిమా సంగీతాన్ని‌ ప్రపంచపు 10 ఉత్తమ సంగీత కూర్పులలో ఒకటిగా టైంస్‌ ప్రకటించింది.

 

11 ఏళ్ల‌ వయసులో ఇళయరాజా‌ దగ్గఱ కీ బోడ్ వాద్య వాదకునిగా‌‌‌ దిలీప్ కుమార్ అన్న‌ అబ్బాయి పనిచెయ్యడం మొదలు‌పెట్టాడు. ఆ అబ్బాయి 25‌ఏళ్ల‌ ప్రాయంలో ఎ.అర్. రహ్మాన్ అయ్యారు. వీరి తండ్రి శేఖర్‌‌ కూడా ఒక చలనచిత్ర సంగీత‌ దర్శకులే. కొన్ని మలయాళ‌ సినిమాలకు సంగీతదర్శకులుగా చేశారు. 9వ ఏట‌ తండ్రిని కోల్పోయిన రహ్మాన్ 11వ ఏట సంగీత ప్రపంచంలోకి వచ్చారు. వ్యాపార ప్రకటనల లఘు చిత్రాలకు సంగీతం ఇవ్వడం మొదలుపెట్టి ఇవాళ‌ అంతర్జాతీయ సంగీతదర్శకులుగా విలసిల్లుతున్నారు.

 

భారతదేశ‌‌ చలనచిత్ర సంగీతాన్ని‌ శంకర్-జయకిషన్ తరువాత అంతగా ప్రభావితం చేసిన‌ వారు రహ్మాన్. శంకర్-జయకిషన్‌లా contrasting phrases and melodies రహ్మాన్ పాటల్లో ఉంటాయి. అవి జనాల్ని ఆపి, పట్టుకుని పాటను వినేలా చేస్తాయి. స్వరాల‌ కాలప్రమాణం విషయంలో కూడా శంకర్-జయకిషన్ ధోరణి రహ్మాన్‌లో ఉంటుంది. శంకర్-జైకిషన్ బాణిల్లోలాగా రహ్మాన్ బాణిల్లోనూ స్వరాలు దగ్గఱ దగ్గఱగా ఉంటాయి. శంకర్-జయకిషన్ పాటలలా రహ్మాన్ పాటలూ outlandish and outstanding గా ఉంటాయి.‌‌ ఎలా‌ శంకర్-జయకిషన్‌ సంగీతం విదేశాల్లో సైతం మారుమోగుతూండేదో అలా రహ్మాన్ సంగీతమూ విదేశాల్లో మారుమోగుతోంది.

 

రహ్మాన్ jazz , blues వంటి‌ సంగీత పోకడలలోని‌ పోహళింపులను‌ ఆకళింపుచేసుకుని మన కర్ణాటక‌, హిందూస్థానీ సంగీతాన్ని అర్థం చేసుకుని ఆపై ఆరబీ సంగీతాన్ని, కవ్వాలీ ఛాయల్నీ సొంతం చేసుకుని పరిపుష్టమైన సృజనాత్మకతతో‌ ఉన్నతమైన సంగీతాన్ని ఇచ్చారు. రహ్మాన్ చేసిన‌ సంగీతానికి ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆసియా‌‌ నుంచీ, అదీ‌ భారతదేశం నుంచీ రహ్మా‌న్ ద్వారా అంతర్జాతీయ‌స్థాయి‌‌‌ సంగీతం‌ వస్తుందని ఊహించలేదని కొందఱు‌ విశ్వసంగీత‌ పరిశోధకులూ,‌‌ విశ్లేషకులూ‌ ప్రశంసించారు. ఎన్నో విదేశీ‌ సంగీత‌‌ బృందాలు వెతుక్కుంటూ వచ్చి రహ్మాన్ తో పనిచేశాయి.

 

రహ్మాన్ తమ‌ తొలి హిందీ‌ సినిమా రంగీలాలో చేసిన "హాయ్ రామ‌ యే క్యాహువా" పాట విశేషమైన కల్పనా చాతుర్యానికి ఒక మచ్చుతునక. గొప్ప పాట అది. రహ్మా‌న్ చేసిన హిందీ సినిమా లగాన్ సంగీతం‌ ప్రపంచపు 100 ఉత్తమ‌ సంగీత కూర్పుల్లో ఒకటిగా నిలిచింది. రహ్మాన్ ఒక special flair and flavor తో తాల్ సినిమా సంగీతం చేశారు.

 

దిల్ సే‌ సినిమాలో‌ రహ్మా‌న్ చేసిన‌ "దిల్ సేరే‌..." పాట‌ వారిని ఇంగ్లిష్ సినిమా‌ దర్శకుల‌ దృష్టికి తీసుకెళ్లి‌ ఇంగ్లిష్‌‌ చిత్రాలకు‌ సంగీత దర్శకత్వం చేయించింది. జాపనీస్, చైనీస్ సంగీత మూలాల మేళవింపుతో రహ్మాన్ Warriors of Heaven కోసం ప్రత్యేకమైన సంగీతాన్ని సృష్టించారు.

 

మనదేశ సినిమాల్లో మొదటి‌‌ శబ్దీకరణ విప్లవం (sounding revolution) శంకర్-జయకిషన్ వల్ల వచ్చింది. అటు తరువాత ఆర్.డి. బర్మన్ ఈ విప్లవాన్ని తెచ్చారు. 1980లో కుర్బానీ సినిమాలో చేసిన "ఆప్ జెసా కోయి..." sounding లో పెను మార్పును తెచ్చారు బిడ్డు. అటు తరువాత ఎ.ఆర్. రహ్మాన్ రోజాతో మనదేశ సినిమాల్లో అత్యవసరమైన శబ్దీకరణ విప్లవాన్ని తెచ్చారు. ఎ.ఆర్. రహ్మాన్ రాకపోయి ఉన్నట్టయితే మనదేశ‌ సినిమా సంగీతం సాంకేతికంగా ఇంకా వెనకబడే ఉండేదేమో?

 

పాశ్చాత్య పోకడలే కాదు. కర్ణాటక,‌ హిందూస్థానీ సంగీతం ఆధారంగా రహ్మాన్ గొప్ప‌ పాటలు చేశారు. జీన్స్ సినిమాలో "కన్నుల్లో..." డ్యూయట్‌‌ సినిమాలో "అంజలీ,‌‌అంజలీ...-వంటి‌‌ పాటలూ, హిందీ‌ జోదాఅక్బర్ సినిమాలో‌ చేసిన పాటలూ అలాంటి వాటికి మచ్చుతునకలు. బొంబాయి సినిమా‌లో చేసిన " కన్నానులే...."‌ పాట కవ్వాలీ లోని కొత్త పోకడలను రంగరించి చేసిన గొప్ప పాట.‌ బర్సాత్ కి రాత్ సినిమాలో రోషన్ చేసిన‌ కవ్వాలీలు గొప్ప సినిమా కవ్వాలీలుగా చెబుతారు. చాలా ఏళ్ల విరామం తరువాత ఎ.ఆర్. రహ్మాన్ ఫిజా సినిమాలో "పియా హాజి అలీ..." అన్న గొప్ప కవ్వాలీ చేశారు.

 

Airtel కు రహ్మాన్ చేసిన‌ signature music ప్రపంచంలో ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకోబడ్డ సంగీతం.

రహ్మాన్ మంచి గాయకులు కూడా. బొంబాయి సినిమాలో "అది‌ అరబి కడలందం" ‌పాట‌ హిందీ, తెలుగుల్లో పాడిన గాయకులకన్నా తమిళ్లో వారు‌ పాడిందే గొప్పగా ఉంటుంది. ఇంకా కొన్ని పాటలు చాలా బాగా పాడారు‌ రహ్మాన్. రహ్మాన్ స్క్రిప్ట్ రచయిత‌ కూడా. వారి రచనలో 99 సాంగ్స్ అనే హిందీ సినిమా రూపొందింది. త్వరలో విడుదల కానుంది.

 

మంచి లేదా గొప్ప (idiomised English) ఇంగ్లిష్‌‌ మాట్లాడతారు రహ్మాన్. ప్రపంచంలోని చాలా విషయాలపై వారికి మంచి అవగాహన ఉంది. సంఘసేవకులు రహ్మాన్. తమ ట్రస్ట్‌ద్వారా‌ అవసరమయ్యే వాళ్లకు కావాల్సిన వైద్య, విద్య సహాయాలు చేస్తూ‌ వస్తున్నారు. మనిషిగా‌ ఉత్తమ ప్రవర్తన కలిగిన వారు రహ్మాన్. సంగీతంలో‌ తాము చేరిన ఎత్తులకు గాను‌ పద్మభూషణ్ అయ్యారు రహ్మాన్.

 

"సంగీతం కన్నా ముందు ఇంగితం కావాలి" అంటారు రహ్మాన్. ఇదొక్కటి చాలు వారు ఎలాంటి వారో తెలుసుకోవడానికి. "నేను తెల్ల కాగితాన్ని, భగవంతుడు‌‌ రాస్తున్నాడు అంతే" అన్నారు రహ్మాన్. ఇది వారు ఒక‌ పరిణతి చెందిన కళాకారులు అన్నదాన్ని తెలియజేస్తోంది.

 

సంగీత దర్శకులుగా 6 జాతీయ‌ అవార్డ్స్‌నూ, 31 ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌నూ అందుకున్నారు రహ్మాన్. కెనడా దేశంలో Ontario లో ఒక‌ వీధికి ఎ.ఆర్. రహ్మాన్ పేరు‌ పెట్టారు.

 

రహ్మాన్ విశ్వస్థాయి సంగీతాన్ని ఆవిష్కరించారు. ఒక‌ విశ్వస్థాయి సంగీత ఆవిష్కరణగా నిలిచారు రహ్మాన్.

 

-రోచిష్మాన్

9444012279

rochishmon@gmail.com

Updated Date - 2020-02-03T00:37:07+05:30 IST