చిరంజీవికి అక్కగా.. రాములమ్మ అంగీకరిస్తుందా?

ABN , First Publish Date - 2020-05-25T02:34:27+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు వీరిద్దరిది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో సినిమా

చిరంజీవికి అక్కగా.. రాములమ్మ అంగీకరిస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు వీరిద్దరిది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందంటే ఖచ్చితంగా విజయం సాధిస్తుందనేలా ప్రేక్షకులలో ఈ జంట ముద్రను వేశారు. అయితే వీరిద్దరూ రాజకీయాల బాట పట్టడం.. మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెట్టడం వంటివి ఇటీవలే చూశాం. చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. సినిమాలు చేసుకుంటుంటే.., విజయశాంతి మాత్రం మంచి పాత్ర వస్తేనే సినిమాలు లేదంటే ప్రజాసేవే అని ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.


ఇక విషయంలోకి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ‘ఆచార్య’ తర్వాత మలయాళంలో మంచి విజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించనున్నారు. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం సుజీత్ ఈ చిత్రాన్ని తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా (లూసిఫర్ ఒరిజినల్‌లో మోహన్‌లాల్ సోదరిగా మంజు వారియర్ నటించారు) విజయశాంతిని అనుకుంటున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే చిరంజీవి పక్కన హీరోయిన్‌గా నటించిన విజయశాంతి.. ఇప్పుడు అక్కగా చేసేందుకు అంగీకరిస్తుందా? అనే అనుమానాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. 


ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో మంజు వారియర్ పాత్ర చాలా టిపికల్‌గా ఉంటుంది. రెండో పెళ్లి చేసుకోవడం, తమ్ముడైన హీరోని అసహ్యించుకోవడం, మొదటి భర్తకు పుట్టిన అమ్మాయి తీరుకి ఆమె రియాక్షన్, చివరిలో పోలీస్ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, పోలీస్ పెట్టే బాధ నుంచి విముక్తి కోసం తమ్ముడు సహాయం కోరడం వంటి వైవిధ్యమైన కోణాలు ఈ పాత్రలో ఉన్నాయి. నిజంగా విజయశాంతి ఈ పాత్ర చేస్తే.. పాత్రకే నిండుతనం వస్తుంది. తెలుగులో ఆమె పాత్రకు ఇంకా ఇంపార్టెన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయం కూడా ఆమె పాత్రకు ముడిపడి ఉంటుంది. మరి ఇన్ని కోణాలున్న ఈ పాత్రకు రాములమ్మ ‘యస్’ అంటారో ‘నో’ అంటారో చూద్దాం. 

Updated Date - 2020-05-25T02:34:27+05:30 IST

Read more