నిర్మాత‌ల ప్లాన్ రివ‌ర్స్‌?

ABN , First Publish Date - 2020-02-03T20:02:46+05:30 IST

సాయిధరమ్ తేజ్‌ తమ్ముడైన వైష్ణవ్ 'ఉప్పెన' చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా 'ఉప్పెన' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

నిర్మాత‌ల ప్లాన్ రివ‌ర్స్‌?

మెగా ఫ్యామిలీలో హీరోలకు ఏమాత్రం కొదవ లేదు. ఈ కుటుంబంలో ఎంతమంది కథానాయకులున్నా.. అందరూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నారు. ఆ కోవలోనే.. ఈ ఫ్యామిలీ నుంచి రాబోతున్న మరో హీరో వైష్ణవ్‌ తేజ్. సాయిధరమ్ తేజ్‌ తమ్ముడైన వైష్ణవ్ 'ఉప్పెన' చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా 'ఉప్పెన' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి.. సుకుమార్ రైటింగ్స్‌ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తోంది. ఆద్యంతం సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కోలీవుడ్‌ స్టార్ విజయ్‌ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడు. ఇక.. ఈ సినిమాకోసం విజయ్‌సేతుపతి 4 కోట్లు డిమాండ్ చేశాడట. అయితే.. రోజుకి 20 లక్షలు చొప్పున పారితోషికాన్ని ఇస్తామని చెప్పి.. అగ్రిమెంట్ చేయించుకుందట నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. చిత్రంలో విజయ్‌ సేతుపతి పాత్రను 15 రోజుల్లోనే పూర్తిచేసి.. కోటి రూపాయలు మిగిల్చుకోవాలనేది మైత్రీ ప్లాన్. కానీ.. ఆ ప్లానంతా టోటల్‌గా రివర్సైందట.

 విజయ్‌ సేతుపతి పాత్ర చిత్రీకరణను 15 రోజుల్లో పూర్తి చేయాలనేది చిత్రబృందం ప్రణాళిక. కానీ.. అది కాస్తా 30 రోజులు అయ్యిందట. దాంతో.. విజయ్‌ సేతుపతికి రోజుకి 20 లక్షలు చొప్పున 30 రోజులకి.. 6 కోట్లు పారితోషికంగా చెల్లించాల్సి వచ్చిందట. అలా.. వర్కింగ్ డేస్ పెరగడం వలన.. 'ఉప్పెన' బడ్జెట్ కూడా దాదాపు 25 కోట్ల వరకూ పెరిగినట్టు ఫిల్మ్‌ నగర్ టాక్. మొత్తంమీద.. ఒక కొత్త హీరో సినిమాకి అంత భారీ మొత్తంలో బడ్జెట్‌ పెట్టడం.. ఏమాత్రం శ్రేయస్కరం కాదంటూ సలహాలిస్తున్నారు సినీ పెద్దలు. ఏప్రిల్ 2న ఈ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. మరి.. తొలి చిత్రం 'ఉప్పెన'తో వైష్ణవ్‌ తేజ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Updated Date - 2020-02-03T20:02:46+05:30 IST