నాగచైతన్య ఆ గుర్తింపు దక్కించుకుంటున్నాడా?

ABN , First Publish Date - 2020-02-18T23:58:42+05:30 IST

తెలుగు సినీ పరిశ్రమలో సినీ వారసులకు కొదవే లేదు. ముఖ్యంగా ఇప్పుడు పెద్ద ఫ్యామిలీల నుండి వచ్చిన హీరోలు జోరు చూపిస్తున్నారు. కానీ,..

నాగచైతన్య ఆ గుర్తింపు దక్కించుకుంటున్నాడా?

తెలుగు సినీ పరిశ్రమలో సినీ వారసులకు కొదవే లేదు. ముఖ్యంగా ఇప్పుడు పెద్ద ఫ్యామిలీల నుండి వచ్చిన హీరోలు జోరు చూపిస్తున్నారు. కానీ, వీరిలో వారసత్వ ముద్రని తొలగించుకొని.. సొంతగా  గుర్తింపు దక్కించుకున్న కథానాయకులను వేళ్ళ మీద లెక్కకట్టవచ్చు. అయితే అక్కినేని మూడో తరం వారసుడు నాగచైతన్య..,  ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకునే దశగా అడుగులు వేస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 


2009లో 'జోష్'‌తో  కెరీర్‌ని స్టార్ట్ చేసిన నాగచైతన్య.. ఆ తరువాత ఎన్నో ఎత్తు ఫల్లాలను చవి చూశాడు. అయితే నిన్న మొన్నటి వరకు చైకి అక్కినేని హీరోగానే గుర్తింపు దక్కింది. మధ్యలో కొన్ని విజయాలతో  'తడాఖా' చూపినా.. అవేవి చైతూని నటుడిగా మరో స్థాయిలో నిలబెట్టలేకపోయాయి. కానీ, ఈ మధ్య కాలంలో నాగచైతన్య నటుడిగా ఎదుగుతున్నాడు. 'మజిలీ, వెంకీ మామ' చిత్రాలలో ఈ హీరో నటన చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది. 


నిజానికి ఈ మధ్య కాలంలో చైతూ ఎంచుకుంటున్న కథలు కూడా కొత్తగా ఉంటున్నాయి. వీటికి తోడు ఎమోషనల్ యాక్టింగ్‌తో ఈ హీరో .. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తున్నాడు.  నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని 'ఏయ్ పిల్లా' మ్యూజికల్ ప్రివ్యూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ వీడియో చివరిలో నాగచైతన్యకి  సాయి పల్లవి ముద్దు పెడుతోంది. ఆ సమయంలో చైతన్య నటన..  ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తోంది. ఏదేమైనా..  సరికొత్త 'మజిలీ'‌లో దూసుకుపోతున్న ఈ అక్కినేని వారసుడు.. కాదు, కాదు.. నాగచైత్యన్య  రానున్న కాలంలో ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటాడో చూడాలి. 

Updated Date - 2020-02-18T23:58:42+05:30 IST