రెండు దశాబ్దాల తర్వాత ‘ఖుషి’ కాంబో..?

ABN , First Publish Date - 2020-02-18T17:40:30+05:30 IST

'ఆజ్ఞాతవాసి'తో వెండితెరపై నుంచీ రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు తిరిగి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

రెండు దశాబ్దాల తర్వాత ‘ఖుషి’ కాంబో..?

'ఆజ్ఞాతవాసి'తో వెండితెరపై నుంచీ రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు తిరిగి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇంతకంటే హాట్ టాపిక్ మరొకటి లేదు. రోజుకో కారణంగా పవన్ చేస్తోన్న మూవీస్ చర్చలోకి వస్తున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న ‘వకీల్ సాబ్’(విన‌ప‌డుతున్న టైటిల్‌) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ హిందీ సినిమా 'పింక్' మూవీ రీమేక్ తో పాటూ క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాకి సై అన్న సంగతి మనకు తెలిసిందే! అయితే, మన 'గౌతమీపుత్ర శాతకర్ణి' డైరెక్టర్ పవర్ స్టార్‌తో డిఫరెంట్ మూవీ చేయబోతున్నాడు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో తొలిసారి పవన్ కనిపిస్తాడు. ఇక దీంట్లో హీరోయిన్ ఎవరన్న దానిపై రోజుకొక పేరు వినిపిస్తోంది. క్రిష్‌ దర్శకత్వం వహించిన 'కంచె' మూవీలో తళుక్కుమన్న ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ మధ్య పవన్ సినిమా కారణంగా వార్తల్లో నిలిచింది. 


పవన్ కళ్యాణ్, క్రిష్ మూవీలో ప్రగ్యా జైస్వాల్ ఉంటుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఆమె ఉన్నా హీరోయినా లేక కీలక పాత్రలో కనిపిస్తుందా తెలియదు. అయితే, ఇంతలోనే మరో సీనియర్ బ్యూటీ తెర మీదకొచ్చింది. ‘ఖుషి’ సినిమాలో పవర్ స్టార్ సరసన రొమాన్స్ చేసిన భూమిక ఇప్పుడు హెడ్ లైన్స్‌లో నిలుస్తోంది. బోలెడంత గ్యాప్ తరువాత ఆమె మళ్లీ పవన్ సినిమాలో కనిపిస్తుందని అంటున్నారు. ఇప్పటికే భూమిక జిమ్‌లో కసరత్తులు చేస్తూ పర్ఫెక్ట్ షేప్ కోసం కష్టపడుతోందట. దీంట్లో నిజం ఎంతోగానీ, పవన్, భూమిక జోడీ మాత్రం జనం ఎప్పుడూ కోరుకునేదే! వారిద్దరూ చూడముచ్చటగానే ఉంటారు. క్రిష్ తన సినిమాలో ఎలా ప్రెజెంట్ చేస్తాడో!
Updated Date - 2020-02-18T17:40:30+05:30 IST