‘విటమిన్ షి’ మూవీ రివ్యూ
ABN , First Publish Date - 2020-12-30T22:04:30+05:30 IST
సాంకేతికత అనేది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అదే సమయంలో దాని వల్ల నష్టం ఉంటుంది. టెక్నాలజీ వల్ల నష్టాలా? ఎందుకు అని కూడా ఆలోచన రావచ్చు. అయితే టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలే తప్ప..

చిత్రం: విటమిన్ షి
బ్యానర్: ఫుల్ మూన్ ప్రొడక్షన్స్
నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రాచి థాకర్, వికాస్, రంజిత్ రెడ్డి తదితరులు
ఎడిటర్: నాని లుక్క
సినిమాటోగ్రఫీ: శివ శంకర్ వర ప్రసాద్
సంగీతం: పీవీఆర్ రాజా
నిర్మాత: రవి పొలిశెట్టి
దర్శకత్వం: జయ శంకర్
సాంకేతికత అనేది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అదే సమయంలో దాని వల్ల నష్టం ఉంటుంది. టెక్నాలజీ వల్ల నష్టాలా? ఎందుకు అని కూడా ఆలోచన రావచ్చు. అయితే టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలే తప్ప.. టెక్నాలజీ కంట్రోల్‌లోకి మనం వెళితేనే అసలు సమస్య ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఉదాహరణకు సోషల్ మీడియా.. సెల్ ఫోన్స్ ఏదైనా సరే.. సమాచారం చేరవేతకు ఉపయోగపడాలే తప్ప.. మనుషుల మధ్య అగాథాన్ని పెంచడానికి కాదు. కానీ మనుషుల మధ్య ఇవి దూరాన్ని పెంచుతున్నాయంతే. ఈ విషయాన్ని తెలియజేస్తూ మానవ సంబంధాలపై చాలా సినిమాలే వచ్చాయి. అలాంటి మెసేజ్‌తో రూపొందిన చిత్రమే ‘విటమిన్ షి’. దర్శకుడు జయశంకర్ ఈ సినిమా ద్వారా సాంకేతికత ఆవశ్యకతను ఎలా వివరించాడు. సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉందా? అనే విషయాలు తెలియాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లింగబాబు యోగానందం అలియాస్ లియో(శ్రీకాంత్) స్మార్ట్ ఫోన్‌కి బానిస. ఎక్కువ సమయాన్ని ఫోన్‌కే కేటాయిస్తుంటాడు. మిగిలిన సమయాన్ని తన కంపెనీలో పని చేసే అమ్మాయి వైదేహి(ప్రాచీ టక్కర్)ను ప్రేమించడానికి కేటాయిస్తాడు. ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమను ఎలా చెప్పాలా? అని ఆలోచిస్తున్న తరుణంలో అతని ఫోన్ పోతుంది. కొత్త ఫోన్ కొంటాడు. కొత్త ఫోన్ వచ్చిన తర్వాత జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.
కొత్త ఫోన్‌లో విటమిన్ షి అనే మోడ్రన్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. దాని ముద్దు పేరు లైలా(యాపిల్ ఫోన్‌లో సిరి స్టైల్లో అన్నమాట). ఈ మోడ్రన్ వాయిస్ అసిస్టెంట్ లియోకు చాలా రకాలుగా సపోర్ట్ చేస్తుంది. స్నేహితులు చేయలేని సపోర్ట్‌ను అందించడమే కాకుండా, లవ్‌ను సక్సెస్ కావడంలోనూ హెల్ప్ చేస్తుంది. క్రమంగా లియో మోడ్రన్ వాయిస్ అసిస్టెంట్ లేకుండా పనిచేయలేని స్థితికి చేరుకుంటాడు. అప్పుడు సదరు ఫోన్ వాయిస్ అసిస్టెంట్ మన లియోను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తుంది. క్రమంగా లియో చుట్టు అప్పటి వరకు బాగా ఉన్న పరిస్థితులు మారిపోతాయి. అసలు ఫోన్‌లోని వాయిస్ అసిస్టెంట్ అన్ని పనులను ఎలా చేయగలిగింది? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
అది తెలివైనా, తినే తిండి అయినా అవసరానికి మించితే చాలా ప్రమాదం. ఇదే విషయం సాంకేతిక విషయంలోనూ వర్తిస్తుంది. టెక్నాలజీ వల్ల మనిషికి మంచి జరుగుతుందా? లేక మనిషి తెలియని మానసిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడా? అనే విషయాలను దర్శకుడు జయశంకర్ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు ఫోన్ లేకపోతే మనం ఏదో కోల్పోయామనే భావనకు వచ్చేస్తాం. అలాగే ఇంట్లో టీవీ పని చేయకపోతేనో.. ఇలా ప్రతి విషయంలో సాంకేతికత వల్ల ఉన్న ప్రమాదాలేంటి? అనే విషయాన్ని దర్శకుడు వివరించే ప్రయత్నం చేశాడు. అలెక్సా, సిరి అనే తరహాలో లైలా అనే వాయిస్ అసిస్టెంట్‌నే ఓ పాత్రలా క్రియేట్ చేసి దర్శకుడు సినిమాను నడిపించాడు. ఇవన్నీ దర్శకుడు ఆలోచనా శైలిని వివరించేవే. సెకండాఫ్‌లో కథ స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. సంభాషణలు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. కొత్త పాయింటే అని చెప్పాలి.
నటీనటులు వారి పాత్రల పరిధులు మేరకు చక్కగా నటించారు. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్‌ను ఓవర్ మెలో డ్రామాగా చూపించకుండా సాఫ్ట్‌గా డీల్ చేసుకుంటూ వచ్చాడు. లైలా అనే వాయిస్ అసిస్టెంట్ కనిపించకపోయినా, ఓ పాత్రలా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. వరప్రసాద్ సినిమాటోగ్రఫీ బావుంది. అయితే బడ్జెట్ పరిమితులా మరేదైనా కారణమో ఏమో కానీ.. సినిమాను మరింత ప్రభావితంగా చెప్పి ఉండొచ్చుననిపించింది.