‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ రివ్యూ
ABN , First Publish Date - 2020-12-25T19:45:20+05:30 IST
పెళ్లి అయినవాడు.. పెళ్లి కానివాడిని చూసి పెళ్లి చేసుకోకురా బాబూ అని అంటుండే సీన్‌ను మనం చాలా సందర్భాల్లో చూసుంటాం.

చిత్రం: సోలో బ్రతుకే సో బెటర్
విడుదల: 25-12-2020
సమర్పణ: బాపినీడు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి
విడుదల: జీ స్టూడియో
నటీనటులు: సాయితేజ్, నభానటేశ్, రావు రమేశ్, రాజేంద్ర ప్రసాద్, వీకే నరేష్, సత్య, సుదర్శన్, వెన్నెలకిషోర్ తదితరులు
దర్శకత్వం: సుబ్బు
నిర్మాత: బీవీఎస్‌ఎన్ ప్రసాద్
సంగీతం: ఎస్.తమన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి.దిలీప్
ఆర్ట్: అవినాష్ కొల్ల
పెళ్లి అయినవాడు.. పెళ్లి కానివాడిని చూసి పెళ్లి చేసుకోకురా బాబూ అని అంటుండే సీన్‌ను మనం చాలా సందర్భాల్లో చూసుంటాం. విని ఉంటాం.. అంతెందుకు మనకే పెళ్లెందుకు చేసుకుంటున్నావ్ అంటూ ఎవరైనా సలహా కూడా ఇచ్చి ఉంటారు. ఇప్పటి వరకు మనం చూసిన సినిమాల్లో పెళ్లి వద్దనే హీరోనే చివరకు పెళ్లి చేసుకుంటాడు. ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని కామెడీ కోణంలో సినిమాలు తెరకెక్కాయి. మరి పెళ్లి వద్దు అనే ఓ బ్యాచిలర్ కథతో దర్శకుడు సుబ్బు చేసిన సినిమానే 'సోలో బ్రతుకే సో బెటర్'. సాయితేజ్ హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరో పెళ్లి కంటే సోలో బ్రతుకే సో బెటర్ అంటూ చెప్పడాన్ని గమనించవచ్చు. మరి సినిమాలో హీరో చివరి వరకు సోలోగా ఉంటాడా? పాత చిత్రాల్లో హీరోల్లా పెళ్లి చేసుకుని బ్యాచిలర్స్‌కి ఝలక్ ఇస్తాడా? అనే వివరాలు తెలియాలంటే సినిమా కథేంటో చూద్దాం...
కథ:
వైజాగ్‌లో ఇంజనీరింగ్ చదివే కుర్రాడు విరాట్.. మామయ్య (రావు రమేశ్) ప్రభావంతో పెళ్లిపై వ్యతిరేక భావాన్ని ఏర్పరుచుకుంటాడు. తన అభిప్రాయాన్ని ఇతర విద్యార్థులకు హితబోధలా చేస్తూ కాలేజ్‌లో ఓ గ్రూపునే క్రియేట్ చేస్తాడు. సోలోబ్రతుకే సోబెటర్ అనే కూటమిని ఫౌండర్‌లా స్టార్ట్ చేసి.. పెళ్లికి వ్యతిరేకంగా 108 శ్లోకాలు ఉన్న పుస్తకాన్ని రాస్తాడు. అతనికి నలుగురైదుగురు స్నేహితులు తోడుగా ఉంటారు. అందరూ కలిసి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాల వేటలో హైదరాబాద్ వస్తారు. విరాట్‌కు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలోజాబ్ వస్తుంది. కొన్నాళ్లకు స్నేహితులందరూ పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి విరాట్‌కు దూరమవుతారు. విరాట్ ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంటాడు. అదే సమయంలో ఓ రోజు హైదరాబాద్‌లో స్నేహితుడిని కలవడానికి వచ్చిన మామయ్యను చూస్తాడు. అతనితో మాట్లాడిన తర్వాత షాకింగ్ నిజం తెలుస్తుంది. దాంతో పెళ్లిపై తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అనుకోకుండా తన స్నేహితుడి పెళ్లికి వెళ్తాడు. అక్కడ పెళ్లి కూతురు అమృత(నభా నటేశ్) విరాట్‌ను చూసి, తనను పెళ్లి చేసుకుంటానని తనకు జరుగుతున్న పెళ్లిని ఆపేస్తుంది. విరాట్ కూడా అమృతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు అమృత.. విరాట్‌కు అనుకోని షాక్ ఇస్తుంది? ఆ షాక్ ఏంటి? విరాట్‌కు మామయ్య చెప్పే నిజం ఏంటి? విరాట్, అమృత ఒకటవుతారా? లేక విరాట్ సోలో బ్రతుకే సో బెటర్ అంటాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
అసలు సినిమా కథేంటి అనే పాయింట్‌ను టైటిల్‌తో పాటు టీజర్, ట్రైలర్‌లోనే దర్శకుడు చెప్పేశాడు. ఒకే బావుంది. సినిమాను ఆ పాయింట్‌తో స్టార్ట్ చేసినా.. సినిమా కాబట్టి ఎలాంటి ముగింపు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్ ప్లాట్ చుట్టూ సబ్ ప్లాట్స్ ఉంటాయి. దానికి తగ్గట్లు సన్నివేశాలను రాసుకోవడం దర్శకులు చేసే పని. అయితే మెయిన్ ప్లాట్‌ను చాలా బలంగా చూపించినప్పుడే ప్రేక్షకుడు సినిమాకు కనెక్ట్ అవుతాడు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను పెళ్లి చేసుకోకూడదు. దాని వల్ల వ్యక్తి స్వేచ్చ పోతుంది అనే పాయింట్‌తోస్టార్ట్ చేసినా సినిమాలో హీరో పాత్ర.. పెళ్లికి వ్యతిరేకంగా అంత బలమైన నిర్ణయం తీసుకోవడానికి గల బలమైన కారణాన్ని ఎక్కడా ఎలివేట్ చేయలేదు. సరే! హీరో తీసుకున్న నిర్ణయం పక్కన పెడితే చివరకు వరకు .. కనీసం ప్రీ క్లైమాక్స్ వరకు అలా కంటిన్యూ అయ్యిందా? అది ఉండదు. సినిమా స్టార్ట్ అయిన ముప్పావు గంటలోనే మెయిన్ ప్లాట్ డ్రాప్ అయిపోతుంది. హీరో నిర్ణయాన్ని పెళ్లికి అనుకూలంగా మార్చుకుంటాడు. ఈ క్రమంలో హీరో క్యారక్టర్ ఎలివేషన్, అతని చుట్టూ ఉన్న స్నేహితులతో పెళ్లి కారణంగా గొడవలు పడటం.. మామయ్యతో మాట్లాడిన తర్వాత నిర్ణయం మార్చుకోవడం దీంతో ఫస్టాఫ్ అయిపోతుంది. ఇక ఇంటర్వెల్ కార్డ్ పడుతుందనే సమయంలో హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. అప్పటి వరకు హీరో నిర్ణయాన్ని హీరోయిన్ క్యారీ చేయడానికి దర్శకుడు ప్రాధాన్యత ఇచ్చాడు. హీరోయిన్‌ను ప్రేమించిన హీరో.. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే.. పెళ్లిపై ఆమెకున్న అభిప్రాయాన్ని మార్చడం చూడాలి. కానీ హీరో అలాంటి ప్రయత్నాలేమీ చేయడు. అందుకు కారణం... హీరోయిన్ తనకు ఎక్కడ దూరమైపోతుందోనని భయపడుతుంటాడు. చివరకు తీరా చెబుదామనుకునే సరికి, ఓ చిన్న ఫైట్ తో హీరోయిన్ నిర్ణయాన్ని మార్చేసుకుంటుంది. అంటే అటు హీరో.. ఇటు హీరోయిన్ రెండు పాత్రలను దర్శకుడు తన మెయిన్ పాయింట్ చుట్టూ మౌల్డ్ చేయలేకపోయాడు. ఇక ఫస్టాఫ్‌లో రెండు, మూడు వెన్నెలకిషోర్ కామెడీ సీన్స్ తప్ప ఏమీ లేఉద. ఇక సెకండాఫ్ అంతా హీరోయిన్ వెనుక హీరో పడి తన ప్రేమను చెప్పాలనుకునే ప్రయత్నాలు మాత్రమే కనపడతాయి. కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు.ఇక ఎమోషన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వెంకట్ సి.దిలీప్ ఫోటోగ్రఫీ బావుంది. తమన్ పాటలు వినడానికి బావున్నా.. కథ మధ్యలో ఇరికించినట్లు అనిపిస్తాయి. ఇక సినిమాలో ఇతర పాత్ర ధారుల విషయానికి వస్తే.. వెన్నెలకిషోర్ రెండు, కన్నడీగుడు తెలుగు మాట్లాడే సీన్స్ ఆక్టటుకుంటాయి. రావు రమేశ్ పాత్రకు కాస్త వెయిటేజ్ కనిపిస్తుంది. కానీ రాజేంద్రప్రసాద్, వీకే నరేశ్ వంటి సీనియర్ ఆర్టిస్టులను, మా సినిమాలో పెద్ద ఆర్టిస్టులున్నారనడానికి తీసుకున్నట్లు ఉంది.
బోటమ్ లైన్: సోలో బ్రతుకే సో బెటర్.. సోల్ మిస్ అయ్యింది
Read more