‘మా వింత గాధ వినుమా’ మూవీ రివ్యూ
ABN , First Publish Date - 2020-11-14T14:47:54+05:30 IST
కొన్ని సినిమాలు ఎప్పుడు షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటాయో తెలియవు కానీ..

చిత్రం: మావింతగాధ వినుమా
విడుదల: ఆహా
నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, శీరత్‌కపూర్, శిశిర్ శర్మ, జయప్రకాశ్, ప్రగతి, కమల్‌కామరాజు, కల్పికా గణేశ్, తనికెళ్లభరణి, ఫిష్ వెంకట్ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల, రోహిత్, జాయ్
కెమెరా: సాయిప్రకాశ్ ఉమ్మడిసింగు
నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, సునీత, కిర్తీ చిలుకూరి
దర్శకత్వం: ఆదిత్య మండల
కొన్ని సినిమాలు ఎప్పుడు షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటాయో తెలియవు కానీ.. విడుదలకు సిద్ధమంటూ రెడీ అయిపోతాయి. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రీసెంట్ మూవీ ‘మావింతగాధ వినుమా’. ఆహాలో కృష్ణ అండ్ హిజ్ లీల వంటి న్యూ ఏజ్ యూత్‌ఫుల్ లవ్‌స్టోరితో మెప్పించే ప్రయత్నం చేసిన సిద్ధు జొన్నలగడ్డ మరోసారి అలాంటి యూత్‌ఫుల్ లవ్‌స్టోరితో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. వ్యక్తి పెరిగే కొద్ది ఆలోచనల్లో పరిణితి ఉండాలని చెప్పే కాన్సెప్ట్‌తో పాటు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలనే చిన్నపాటి సూచనను ఇచ్చే ఉద్దేశంతో ఈ సినిమా తీశారనిపించింది. ఇంతకూ అసలు‘మావింతగాధ వినుమా’లో ఏముంది అని తెలుసుకునే ముందు కథలోకి వెళదాం...
కథ:
అమ్మాయిల హాస్టల్ ముందు నిలబడి వాచ్‌మెన్‌తో గొడవపడుతున్న సిద్ధు(సిద్ధు జొన్నలగడ్డ)ని పోలీస్ ఆఫీసర్(తనికెళ్ల భరణి) అరెస్ట్ చేస్తాడు. పోలీస్ స్టేషన్‌లో సిద్ధు లవ్ బ్రేకప్ అయ్యిందని తెలుసుకున్న సదరు పోలీస్.. అసలు కథేంటో చెప్పమంటాడు. ఇంజనీరింగ్ కుర్రాడైన సిద్ధు వినీత(శీరత్ కపూర్)ని రెండేన్నరేళ్లు ప్రేమించి ఓ రోజు ఐ లవ్‌యు చెబుతాడు. ఆమె రెస్పాన్స్ ఇవ్వదు. ఆమెకు సహాయం చేస్తాడు. కానీ ఆ సాయాన్ని రూల్స్ మీరి చేసినందుకు వినీత, సిద్ధుని తప్పు పడుతుంది. చివరకు ఆమెకు ఫ్రెండ్‌గా మారి ట్రావెల్ చేసే క్రమంలో ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఏర్పడుతుంది. వినీత అన్నయ్య రాజేశ్(కమల్ కామరాజు) ఫొటో షూట్ కోసం వినీతతో కలిసి గోవా వెళతాడు. అక్కడ జరిగే చిన్న తప్పు వల్ల వినీత డిస్ట్రబ్ అవుతుంది. ఆ సమయంలో తన ప్రేమను నిరూపించుకోవడానికి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి వీడియోను ఓ ఫ్రెండ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తాడు. అది కాస్త వివాదంగా మారుతుంది. రెండు కుంటుంబాలకు సమస్యలు వస్తాయి. అసలు పెళ్లి వీడియో వివాదం ఎందుకు అయ్యింది? చివరకు సిద్ధు తన వల్ల వచ్చిన సమస్యను ఎలా క్లియర్ చేసుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
రొటీన్ లవ్‌స్టోరి.. దీనికి కాస్త సోషల్ మీడియా వల్ల వచ్చే ఇబ్బందులను ముడిపెడుతూ తయారుచేసుకున్న కథ. నిజానికి సోషల్ మీడియా వల్ల కొన్ని ఇబ్బందులున్నాయి. తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ ఆ స్వేచ్ఛ వల్ల సమస్యలు రాకూడదు. పరిధులు దాటనంత వరకు ఏదైనా మంచిదే.. దాటితేనే అసలు సమస్య వస్తుంది అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చేశారు. తొలి నలబై నిమిషాలు కాలేజ్, లవ్‌ట్రాక్ అనే అంశాలతో సాగుతుంది. సినిమా అసలు పార్ట్ సెకండాప్‌లో సార్ట్ అయినప్పటికీ దర్శకుడు ఆదిత్య కంటెంట్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయించడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడని స్పష్టంగా తెలుస్తుంది. లవ్‌స్టోరీలు, ఫ్యామిలీకి వచ్చే సమస్యలు ఆడియెన్స్‌కు కనెక్ట్ కావాలంటే ఎమోషనల్ పార్ట్ చక్కగా ఉండాలి. కానీ ఈ సినిమాలో అదే మిస్ అయ్యింది. ఏదో వర్కవుట్ అవుతుందని సినిమా తీశారు. కానీ వారు చేసిన ఎమోషన్స్ అస్సలు కనెక్ట్ కాలేదు. చిల్ బ్రో.. అనుకునే హీరో మనస్తత్వాన్ని హీరో సిద్ధు జొన్నలగడ్డ చక్కగా చూపించాడు. శీరత్ కపూర్ తన నటన పరంగా ఓకే అనిపించినా .. ఆమె రోల్‌లో ఏదో మిస్ అయ్యిందనే భావన ప్రేక్షకుడికి వస్తుంది. తనికెళ్లభరణి, ఫిష్ వెంకట్ పాత్రలు చిన్నవే అయినా బాగున్నాయి. మిగతా నటీనటులందరూ వారి వారి పరిధుల మేర నటించారు. పాటలు సందర్భానుసారం ఓకే అనిపిస్తాయి. ఇక నేపథ్య సంగీతం బాగుంది. సాయిప్రకాశ్ విజువల్స్ ఓకే. ఏదో టైంపాస్‌కి చూస్తే చాలు అనుకుంటేనే చూడండి...