‘లక్ష్మి’ మూవీ రివ్యూ
ABN , First Publish Date - 2020-11-10T13:20:23+05:30 IST
డాన్సర్‌గా దక్షిణాది సినీ పరిశ్రమలో కెరీర్‌నుస్టార్ట్ చేసిన రాఘవ లారెన్స్ తర్వాత నటుడిగా ఆ తర్వాత దర్శకుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.

బ్యానర్స్: షబీనా ఎంటర్టైన్మెంట్, తుషార్ ఎంటర్టైన్మెంట్ హౌస్
నటీనటులు: అక్షయ్ కుమార్, కియారా అద్వాని, శరద్ కేలకర్, రాజేశ్ శర్మ, తరుణ్ అరోరా, అయేషా మిశ్రా తదితరులు
కెమెరా: వెట్రి పళని స్వామి, కుష్ చాబ్రియా
ఎడిటింగ్: రాజేశ్ జి.పాండే
నిర్మాతలు: ఫాక్స్ స్టార్ స్టూడియో, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, సబీనా ఎంటర్టైన్మెంట్, తుషార్ ఎంటర్టైన్మెంట్ హౌస్
దర్శకత్వం: రాఘవ లారెన్స్
డాన్సర్‌గా దక్షిణాది సినీ పరిశ్రమలో కెరీర్‌నుస్టార్ట్ చేసిన రాఘవ లారెన్స్ తర్వాత నటుడిగా ఆ తర్వాత దర్శకుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన దర్శకత్వం విషయానికి వస్తే.. హారర్ కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. వరుస విజయాలను దక్కించుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టాడు. కాంచన సినిమాను అక్షయ్‌కుమార్ హీరోగా తెరకెక్కించాడు. బాలీవుడ్లో లక్ష్మి పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం దక్షిణాదిలోలాగా అక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా కథంటే చూద్దాం
కథ:
ఆసిఫ్(అక్షయ్ కుమార్)కి దెయ్యాలు, భూతాలంటే నమ్మకాలుండవు. ఓ హిందూ అమ్మాయి రష్మి(కియరా అద్వాని)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. దాంతో రష్మి కుటుంబానికి దూరం అవుతుంది. కొన్ని రోజుల తర్వాత రష్మి తల్లిదండ్రుల పాతికేళ్ల పెళ్లిరోజు సెలబ్రేషన్స్ కోసం వారింటికి వెళతారు అసిఫ్, రష్మి. వారింటికి దగ్గరలో ఉండే ఓ ఖాళీ ప్రాంతాన్ని చూసి అందరూ భయపడుతుంటారు. అక్కడ దెయ్యాలున్నాయని అక్కడివారి నమ్మకం. అయితే ఆసిఫ్ అవేమీ పట్టించుకోడు. అక్కడే వెళ్లి క్రికెట్ ఆడతాడు. ఆసిఫ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరో ఏడుస్తుండటం, ఎవరో తిరుగుతున్నట్లు అనిపించడం వంటి విచిత్రమైన పరిస్థితులు జరుగుతుంటాయి. అసలు అలా ఎందుకు జరుగుతాయి? లక్ష్మి ఎవరు? లక్ష్మికి అన్యాయం చేసిందెవరు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
ముందు దెయ్యాలంటే భయపడని కుర్రాడిగా, తర్వాత దెయ్యం ఒంట్లో ప్రవేశించినప్పుడు చేసిన నటన, ట్రాన్స్ జెండర్ లుక్‌లో అక్షయ్ కుమార్ తనదైన నటనతో సినిమా అంతా తానై నడిపించాడు. ఓ స్టార్ హీరోగా ఉండి ట్రాన్స్ జెండర్ సబ్జెక్ట్‌లో నటించడానికి ఒప్పుకున్నందుకు ఆయన్ని అభినందించాలి. నడక, లుక్స్ ఇలా డిఫరెంట్ నటనతో అక్షయ్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కియరా అద్వాని అందంగా కనిపించింది. ఒక వైపు భర్తకు సపోర్ట్ చేస్తూనే, మరో వైపు తన కుటుంబంతో దగ్గరవ్వాలనుకునే అమ్మాయిగా పరిమితమైన పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బుర్జు ఖలీఫా పాటలో గ్లామర్‌గా కనిపించింది. ఇక సినిమాలో మరో ప్రధానమైన పాత్ర.. ట్రాన్స్ జెండర్ లక్ష్మి. ఈ పాత్రను శరద్ కేల్కర్ చక్కగా చేశాడు. కియరా తండ్రి పాత్ర చేసిన రాజేశ్ శర్మ, దీపక్ పాత్రలో మను రిషి చాధా, అతని భార్యగా అశ్విని కల్సేకర్, రష్మీ తల్లిగా అయేషా తదితరులు వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. అక్కడక్కడా అతిగా అనిపించినా కామెడీలో భాగంగానే అనిపిస్తుంది.
నేపథ్య సంగీతం బావుంది. ఇక పాటలు కథకు సంబంధం లేకుండా వస్తాయి. ఇది కమర్షియల్ ఫార్మేట్‌ను ఆశించే ప్రేక్షకుల కోసమనే భావించాలంతే. దర్శకుడు రాఘవ లారెన్స్ అలానే కాపీ కొట్టేయాలనుకోకుండా, నెటివిటీ ప్రకారం చాలా మార్పులు, చేర్పులు చేశాడు. సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ సమస్యను ప్రస్తావిస్తూ చేసిన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్. సినిమాలో లాజిక్స్ లేకపోవడం, నటీనటులు అతిగా చేసినట్లు అనిపించినా.. ఇవేమీ పట్టించుకోకుంటే సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
చివరగా.. లక్ష్మి.. దీపావళి ఎంటర్టైనర్
రేటింగ్: 2.5/5