‘ఐఐటీ కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ
ABN , First Publish Date - 2020-12-14T13:48:33+05:30 IST
‘ఐఐటీ కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

చిత్రం: ఐఐటీ కృష్ణమూర్తి
విడుదల: అమెజాన్ ప్రైమ్
వ్యవథి: 110 నిమిషాలు
బ్యానర్స్: క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్, అక్కి అర్ట్స్
సమర్పణ: మ్యాంగో మాస్ మీడియా
నటీనటులు: పృథ్వీ, మైరా దోషి, వినయ్ వర్మ, బెనర్జీ, సత్య తదితరులు
సంగీతం: నరేశ్ కుమరన్
కెమెరా: ఏసు
ఎడిటింగ్: అనిల్ కుమార్.పి
నిర్మాత: ప్రసాద్ నేకూరి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీవర్ధన్
సమాజంలో మంచి తగ్గిపోతుంది. మంచి చేసే మనుషులు కరువైపోతున్నారు. మనం మంచి చేయకపోయినా పరావాలేదు కానీ.. మంచి పనిచేసే మనుషులకు గౌరవం ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం `ఐఐటీ కృష్ణమూర్తి`. దర్శకుడు శ్రీవర్ధన్ పైన చెప్పినట్లు మంచి చేసే వారిని కాపాడుకోవాలనే ఓ పాయింట్‌ను అనుకుని దాని చుట్టూ కథను అల్లుకున్నాడు. హీరో, హీరోయిన్స్ కొత్తవారు అయినప్పటికీ.. సినిమా టీజర్ మాత్రం సినిమాలో ఏదో ఉందే అనే భావనను క్రియేట్ చేసింది. కోవిడ్ ప్రభావంతో ఈ సినిమాను మేకర్స్ ఓటీటీ మాధ్యమమైన అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. మరి సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అని తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
ముంబై ఐఐటీలో చదివే కృష్ణమూర్తి(పృథ్వీ) హైదరాబాద్ వచ్చి తన బాబాయ్ కనిపించడం లేదని పోలీస్ కంప్లయింట్ ఇస్తాడు. పేపర్‌లోనూ యాడ్ వేస్తాడు. ఆ యాడ్ చూసిన ఏసీపీ వినయ్(వినయ్ వర్మ) కృష్ణమూర్తిని స్టేషన్‌కు పిలిపించి కేసు గురించిన వివరాలను తెలుసుకుంటాడు. కృష్ణమూర్తి బాబాయ్ చనిపోయాడని పోలీసులు నిర్ధారిస్తారు. అదే సమయంలో ఓ అన్ నోన్ నెంబర్ నుండి కృష్ణమూర్తికి బెదిరింపు కాల్ వస్తుంది. ఎవరో కృష్ణమూర్తిని చంపడానికి కూడా ప్రయత్నిస్తారు. కృష్ణమూర్తి బాబాయ్ కేసుని డీల్ చేసిన ఏసీపీని కూడా బెదిరిస్తారు. ఇంతకీ బెదిరించిన వ్యక్తులు ఎవరు? అసలు కృష్ణమూర్తి బాబాయ్ ఎందుకు చనిపోతాడు? చివరికి తెలిసే నిజమేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
ఓ పాయింట్‌ను అనుకుని దాని చుట్టూ కొన్ని సన్నివేశాలను క్రియేట్ చేసుకుంటూ, వాటి మధ్య అనుసంధానం చేస్తూ దర్శకుడు శ్రీవర్ధన్ సినిమాను తెరకెక్కించాడు. హీరో ముంబై నుండి హైదరాబాద్ రావడం, పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం.. పోలీసులు వెతకడం, హీరోపై ఎటాక్ చేయడం ఈ సన్నివేశాలన్నీ ప్రథమార్థంలో చూస్తాం. సినిమాలో హీరో ఏదో చేయాలని చూస్తున్నాడనే విషయం అయితే అర్థమవుతుంది. కానీ అదేంటనే విషయాన్ని దాచిపెడుతూ కథను ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలు కథనం చాలా ఆసక్తికరంగా ఉంది. అప్పటి వరకు సినిమా చూసిన కోణం మారిపోతుంది. మంచి, చిన్నపాటి మెసేజ్‌ను ఆడియెన్స్‌కు ఇస్తూ దర్శకుడు సినిమాను తనదైన శైలిలో ముగించాడు. హీరో, ఏసీపీ పాత్రలే సినిమాకు ఆయువు పట్టు. ఈ పాత్రలను శ్రీవర్ధన్ డిజైన్ చేసిన తీరు చాలా బావుంది. ఇక హీరోయిన్ మైరా దోషి.. చూడటానికి బావుంది కానీ.. పెర్ఫామెన్స్‌కు స్కోప్ లేని పాత్రనే చెప్పాలి. ఆమె పాటలకే పరిమితమైంది. కథలో హీరోయిన్ వచ్చినప్పుడల్లా సినిమా స్పీడు బ్రేకులేసినట్లు అనిపిస్తాయి. సినిమా వ్యవథిని 110 నిమిషాలకు అటు ఇటుగా ఉండేలా చూసుకున్నారు. అంటే సినిమాను ఎక్కువ సేపు లాగడానికి ప్రయత్నించలేదు. కానీ.. సినిమా కొన్ని సందర్భాల్లో స్లోగా లాగినట్లు అనిపిస్తుంది ముఖ్యంగా ప్రథమార్థం. ప్రీక్లైమాక్స్ నుండి సినిమాకి, అంతకుముందున్న సినిమాకు స్పీడులో వ్యత్యాసం కనిపిస్తుంది. కెమెరామెన్ ఏసు పనితనం బావుంది. నరేశ్ కుమరన్ సంగీతం ఓకే.. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో పృథ్వీ తొలి సినిమానే అయినా, కృష్ణమూర్తి పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఇక చాలా సినిమాల్లో నటించిన వినయ్ వర్మ.. ఈ సినిమాలో చాలా మంచి పాత్ర దొరికిందనే చెప్పాలి. ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన చేసిన నటన ప్రేక్షకులను ఆక్టటుకుంటుందనడంలో సందేహం లేదు. సత్య కామెడీ పెద్దగా నవ్వించలేదు. బెనర్జీ, ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. లాజిక్స్ వెతుక్కోకుండా సినిమా చూస్తే బాగానే అనిపిస్తుంది.