‘డర్టీ హరి’ మూవీ రివ్యూ
ABN , First Publish Date - 2020-12-20T04:46:44+05:30 IST
నిర్మాత ఎం.ఎస్.రాజు పేరు చెబితే ‘దేవి, వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి నిర్మాత .. ఆసక్తి కొద్ది దర్శకుడిగా మారి తెరకెక్కించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినవే....

బ్యానర్స్: ఎస్.పి.జె క్రియేషన్స్, హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ: గూడూరు శివరామకృష్ణ,
నటీనటులు: శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్, అజయ్, మహేశ్, అప్పాజీ అంబరీష, సురేఖా వాణి తదితరులు
సంగీతం: మార్క్ కె.రాబిన్
సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్.బాల్‌రెడ్డి
నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి,
రచన - దర్శకత్వం: ఎం.ఎస్.రాజు
నిర్మాత ఎం.ఎస్.రాజు పేరు చెబితే ‘దేవి, వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి నిర్మాత .. ఆసక్తి కొద్ది దర్శకుడిగా మారి తెరకెక్కించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినవే. అయినా ఈయనకు దర్శకుడిగా హిట్ కొట్టాలనే ఆలోచన మాత్రం అలాగే ఉంది. ఆ ప్రయత్నాన్ని సఫలం చేసుకోవడానికి ఎం.ఎస్.రాజు తెరకెక్కించిన మరో సినిమానే ‘డర్టీ హరి’. మనుషుల మధ్య ప్రేమ, కామం అనే రెండు అంశాలతో బంధాలు ఎలా ప్రారంభమవుతాయి. ఎలా ముగస్తాయి? అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ‘డర్టీ హరి’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
కథ:
జీవితంలో ఏదో సాధించాలని టౌన్ నుండి సిటీ వచ్చిన కుర్రాడు హరి(శ్రవణ్ రెడ్డి). స్టేట్ చెస్ ప్లేయర్ కావడంతో సిటీలో ఓ క్లబ్లో ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు. అదే క్లబ్లో చెస్ ఆడటానికి వచ్చే ఆకాశ్‌తో మంచి పరిచయం కాస్త.. ఆకాశ్ కుటుంబంతో పరిచయం వరకు వెళుతుంది. ఆకాశ్ చెల్లెలు వసుధ(రుహానీ శర్మ)తో హరి పరిచయం పెంచుకుని, ఆమెను ప్రేమలో పడేలా చేసుకుంటాడు. వసుధ ఇంట్లో వారిని ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు హరి. అయితే అంతకు ముందే జాస్మిన్(సిమ్రత్ కౌర్)ను చూసి ఆమెపై ఇష్టం పెంచుకుంటాడు. కానీ ఆమె ఆకాశ్ లవర్ అని తెలిసినా, ఆమెను ముగ్గులోకి దింపే ప్రయత్నాలు మానుకోడు. చివరకు జాస్మిన్‌తో సంబంధం పెట్టుకుంటాడు. ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. వసుధ నుండి విడిపొమ్మని జాస్మిన్క్ష హరిని ఇబ్బంది పెడుతుంటుంది. అప్పుడు హరి ఏ నిర్ణయం తీసుకుంటాడు. అదే సమయంలో జాస్మిన్, ఆమె స్నేహితురాలు చనిపోతారు. అసలు వారిని చంపిందెవరు? వారి హత్యలకు హరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు హరి వాటి నుండి ఎలా బయటపడ్డాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
ఓటీటీ హవా ప్రారంభమైన తర్వాత.. సినిమాల్లోనూ బోల్డ్ కంటెంట్ జొప్పించడం సర్వసాధారణంగా మారింది. అందరూ అలాగే ఆలోచిస్తే నేను కూడా ఎందుకు డిఫరెంట్‌గా ఆలోచించాలని అనుకున్నాడేమో కానీ ప్రొడ్యూసర్ నుండి దర్శకుడిగా మారిన ఎం.ఎస్.రాజు తెరకెక్కించిన చిత్రం ‘డర్టీ హరి’. బోల్డ్ మూవీగా తెరకెక్కిన డర్టీహరి సినిమా గురించి సింపుల్‌గా చెప్పాలంటే.. ఆక్రమ సంబంధాలు రహస్యంగా ఉన్నంత కాలం బాగానే ఉంటాయి. బయట పడితే మాత్రం చాలా సమస్యలు వస్తాయనే పాయింట్‌ను బేస్ చేసుకుని తెరకెక్కిన మూవీ. అన్ఫెయిత్ఫుల్ మూవీ ఆధారంగా చేసుకుని కాస్త నెటివిటీని మార్చి చేసిన ప్రయత్నమిది. ఈ సినిమా మేకింగ్ పరంగా ఎం.ఎస్.రాజుకి కొత్తగా ఉండి ఉండొచ్చు ఏమో కానీ.. ప్రేక్షకులకు మాత్రం తప్పకుండా కాదు.
కోవిడ్ టైమ్‌లో ఓటీటీ కంటెంట్‌కు అలవాటు పడ్డ ప్రేక్షకుడికి డర్టీ హరిలో ఏముంది ఇందులో అనిపిస్తుందనడంలో సందేహం లేదు. ఫస్టాఫ్ విషయానికి వస్తే ఇటు రుహనీ శర్మను అయినా, మరో హీరోయిన్ సిమ్రత్ కౌర్‌ను కలిసినప్పుడల్లా హీరో వారితో ఎప్పుడెప్పుడు రొమాన్స్ చేద్దామా అనే యాంగిల్లోనే సాగుతుంది. ఇక సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా అలాగే రన్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ మూవీలను ఇమ్రాన్ హష్మీ మర్డర్ వంటి సినిమాల్లో ఎప్పుడో చూపించేశాడు కూడా. ఇక చివరి పదిహేను నిమిషాలు మాత్రం అసలు సినిమా ఉంటుంది. అప్పటి వరకు ప్రాధాన్యత లేని రుహానీ శర్మ పాత్రకు చివరి పదిహేను నిమిషాల్లోనే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. మార్క్ కె.రాబిన్ నేపథ్య సంగీతం బాగానే ఉంది. ఇక ఉన్న ఒక పాట ప్రేక్షకుడి ఆలోచన ఎక్కడో ఉండేలా ఉంది. హీరో శ్రవణ్ రెడ్డి, రుహానీశర్మ, సిమ్రత్ కౌర్ వారి వారి పాత్రల ప్రాధాన్యత మేర చక్కగా నటించారు. సినిమా ఏదో కాలక్షేపం కోసం చూస్తే చూడొచ్చు ఏమో కానీ.. చెప్పుకోదగ్గ సినిమా మాత్రం కాదు..