యు ట్యూబ్‌ టు 70ఎంఎం అదే నా కోరిక

ABN , First Publish Date - 2020-12-02T08:17:37+05:30 IST

మాది రాజమండ్రి సమీపంలోని వేమగిరి. నాన్న చిన్నస్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. చిన్నతనంలో నాకు చదువు పెద్దగా అబ్బలేదు...

యు ట్యూబ్‌ టు 70ఎంఎం అదే నా కోరిక

పక్కింటి కుర్రాడి ఇమేజ్‌ని పట్టుకోవడం కష్టం..

మనలాంటి వాడే అనిపించుకోవడం మరీ కష్టం.

ఈ రెండు కష్టాలను ఇష్టాలుగా మలుచుకొని డిజిటల్‌ మీడియాలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్నారు చందు సాయి. 

అతని  డైలాగ్స్‌కు ఫిదా అయ్యే  ఫ్యాన్స్‌ ఎందరో! 

అతని  కథల్లో మనల్ని కూడా  చూసుకోవచ్చు..  ఎందుకంటే .. మనలోంచి పుట్టుకొచ్చిన కథలు కాబట్టి..

భవిష్యత్‌ గురించి పెద్దగా ఆశలు, అంచనాలు లేకుండా ఆరేళ్ల క్రితం  మొదలు పెట్టిన ప్రయాణంలోని అనుభవాలు, అనుభూతులు మన పక్కింటి కుర్రాడు చందు సాయి మాటల్లోనే...


మాది రాజమండ్రి సమీపంలోని వేమగిరి. నాన్న చిన్నస్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. చిన్నతనంలో నాకు చదువు పెద్దగా అబ్బలేదు. చిరంజీవిగారికి పెద్ద అభిమానిని కావడంతో నటన మీద ఆసక్తి పెరిగింది. ఇంటర్‌ పూర్తయ్యాక ఈ చదువులు మన వల్ల కాదని డిఎఫ్‌టీ కోర్స్‌లో చేరా. అది పూర్తయ్యాక దేవదాసు కనకాల గారి దగ్గర రెండేళ్లు శిక్షణ తీసుకున్నా. ప్రతి దర్శకుడిలోనూ ఓ నటుడు ఉండాలని ఆయన మొదట యాక్టింగ్‌ నేర్పించారు. ‘‘నీ అభినయం నీ కళ్లలోనే కనిపిస్తుంది. నటన వైపే దృష్టిపెట్టు’ కనకాల గారు ఇచ్చిన సలహాతో పూర్తిగా నటన వైపు వచ్చేశా. 


తొలి  అవకాశం ఇలా...

నటుడిగా అవకాశాలు వెతుక్కుంటూ 2014లో హైదరాబాద్‌ అడుగుపెట్టా. ఎన్నో ప్రయత్నాలు చేశా. ఫలించలేదు. నిరాశతో మళ్లీ ఇంటికి వెళ్లి నాన్నతోపాటు కాంట్రాక్ట్‌ పనులు చూసుకునేవాణ్ణి. కొన్నాళ్లకు మా స్నేహితుడు హర్ష  బసవా వల్ల ‘తమడ’ మీడియాలో ఓ వీడియో చేసే అవకాశం వచ్చింది. పాతిక వేల బడ్జెట్‌లో ఓ కాన్సెప్ట్‌ అనుకుని తీశా. అందరి కన్నా చివర నా ఎపిసోడ్‌ ప్రదర్శించారు. అక్కడున్న 150 మందిలో సగానికి పైగా నచ్చడంతో నాతో ‘పక్కింటి కుర్రాడు’ ఛానల్‌ ప్రారంభించారు. కథను నమ్మి తక్కువ బడ్జెట్‌తో  వీడియోలు తీసి 1600 మంది సబ్‌స్ర్కైబర్స్‌ను సంపాదించా. ఆ తర్వాత ‘నాన్నతో అర్జున్‌రెడ్డి’ తీసి అప్‌లోడ్‌ చేశాం. ఓవర్‌ నైట్‌ 34000 సబ్‌స్ర్కైబర్స్‌ పెరిగారు. అక్కడి నుంచి ‘తమడ’ సపోర్ట్‌తో వేగం పెంచా. కామెడీ, లవ్‌, యాక్షన్‌, ఎమోషన్స్‌, సందేశం ఇలా వారానికో జానర్‌ ఎపిసోడ్స్‌ చేశా. ప్రతివారం ‘తమడ’లో నాకు, బబ్లూకి, హారికకు  మధ్య  పోటీ ఉండేది. అతి తక్కువ సమయంలో నా ఛానల్‌ పాపులర్‌ అయింది. నా పనితో ‘తమడ’ మీడియా హ్యాపీగా ఉందని నమ్ముతున్నా. ఈ జర్నీలో నా టీమ్‌లో శశిహాస్‌, ఆనంద్‌సాయి నాకు అండగా ఉన్నారు. ఇప్పటి వరకూ 190కి పైగా వీడియోలు  చేశా. 1.8 మిలియన్స్‌ సబ్‌స్ర్కైబర్స్‌ మెప్పు పొందా. 


పబ్లిక్‌ వాంట్స్‌ దట్‌ అతి...

నా ఎపిసోడ్స్‌ మొత్తం నేనే రాసుకుంటా. ఒక్కోసారి నా యాక్టింగ్‌ ఓవర్‌గా ఉందని కామెంట్స్‌ ట్రోల్‌, మీమ్స్‌ వస్తుంటాయి. ‘నేను కష్టపడి రాసుకుంటున్నా, అనుకున్న దాన్ని నిజాయతీగా చెబుతున్నా’ అయినా తిడుతున్నారేంటి ఒక్కోసారి అనుకుంటా. ఆ కామెంట్స్‌ని కూడా పాజిటివ్‌గా తీసుకుని కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తా.  ‘నేనింతే’ సినిమాలో ‘పబ్లిక్‌ వాంట్స్‌ దట్‌ అతి’ అని చెప్పినట్లుగా నా పని ఉంటుంది. సంభాషణలతో ఆడియన్స్‌ను కూర్చొబెట్టొచ్చని బలంగా నమ్ముతా. నా కథలకు చక్కని నేపథ్య సంగీతం సెలెక్ట్‌ చేసుకుంటా. ఇప్పటి వరకూ కథల్ని నమ్మి తక్కువ బడ్జెట్‌లోనే క్వాలిటీ కంటెంట్‌ తీసుకొచ్చాం. రాబోయేవి మంచి బడ్జెట్‌తో ఇంకా గొప్పగా ఉండబోతున్నాయి. నా వీడియోలు చూసి నా అభిమాన హీరో పవన్‌కల్యాణ్‌ గారు మెచ్చుకున్నారని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యా. 


చూసిన కథలతోనే...

నా కథల్లో నాన్న ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మాకు కారు, ఏసీ వంటి సౌకర్యాలు ఇచ్చి ఆయన ఎండల్లో తిరిగేవారు. చిన్నప్పటి నుంచీ నేను చూసి, ఎదుర్కొన్న ఎన్నో అంశాలు నా కథల్లో కనిపిస్తాయి. తెలియని డ్రామాను నేనెప్పుడూ ట్రై చేయలేదు. నేను అనుభవించిన విషయాలను కథగా తీసుకుంటున్నా కాబట్టే పది, పదిహేను నిమిషాల నిడివిలో మంచి ఎపిసోడ్‌ ఇవ్వగలుగుతున్నా. నా విజయాల్లో  మా నాన్న పాత్రే ప్రముఖం.  


ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే పోటీ

ఏ రంగంలోనైనా పోటీ తప్పనిసరి. అలా ఉంటేనే ఎంచుకున్న రంగంలో ముందుకెళ్తాం. యుట్యూబ్‌ మేకర్స్‌ మధ్య కూడా  గట్టి పోటీ ఉంది. షణ్ముక్‌, శ్రీవిద్య, హర్ష, సుహాస్‌ ఐదేళ్ల క్రితమే యూట్యూబ్‌లో స్టార్స్‌గా ఎదిగారు. ఆ తర్వాత నేను, హారిక, బబ్లూ ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేశాం. ఇటీవల షన్ను క్లాసిక్‌ హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు నా వంతు వచ్చింది. ఈసారి రియలిస్టిక్‌ స్టోరీతో వెబ్‌ సిరీస్‌  తీస్తున్నా.  దానికోసం ఓ మంచి కథ తయారు చేశా. జనవరిలో ప్రారంభిస్తా. మేం ఎంత పోటీ పడినా అది వీక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికే! వ్యక్తిగతంగా మా మధ్య ఎలాంటి పోటీ ఉండదు.


నన్ను నేనే  ప్రశ్నించుకున్నా..

మంచైనా, చెడు అయినా దేని గురించి పెద్దగా ఆలోచించను. నెక్ట్స్‌ ఏంటి అన్నదే ఆలోచిస్తా. 2014లో నేనెవరికీ తెలియదు. ఇప్పుడు డిజిటల్‌ మీడియా ద్వారా లక్షల మందికి పరిచయమయ్యా.  అయితే ఈ మధ్య నేనేమిటని నన్ను నేను  ప్రశ్నించుకున్నా! నాతో వచ్చిన చాలామంది పై స్థాయిలో ఉన్నారు. అలాగని నేనేమీ తక్కువ కాదు. యుట్యూబ్‌లో నాకూ మంచి గుర్తింపు ఉంది. అయినా  ఇంకేదో చేయాలన్న  తపన మొదలైంది. అందుకే యూట్యూబ్‌ని బ్యాలెన్స్‌ చేస్తూనే 70ఎంఎం స్ర్కీన్‌కి ఎదగాలని టార్గెట్‌ పెట్టుకున్నా. నా అల్టీమేట్‌ గోల్‌ అదే. సినిమాలో ఓ క్యారెక్టర్‌ చేశామంటే అది నా కెరీర్‌కు   ఉపయోగపడేలా ఉండాలి. అలాంటి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. 


టాప్‌టెన్‌ ఎపిసోడ్స్‌

నాన్నతో అర్జున్‌రెడ్డి

జిగేల్‌ రాణి

పల్లెటూరి బావ

తెలంగాణ దోస్తులు

నీ క్యాస్ట్‌ ఏంటి? 

లిన్‌లాక్‌ 

అమ్మా నేను

నిన్ను నువ్వు నమ్ముకో

నాన్న ఎందుకో వెనకపడ్డాడు 

ఫ్రెండ్‌షిప్‌

Updated Date - 2020-12-02T08:17:37+05:30 IST