వర్కవుట్‌ ఒంటికి మంచిదేగా!

ABN , First Publish Date - 2020-10-14T06:40:50+05:30 IST

కరోనా కాలంలోనూ కథానాయికలు విశ్రాంతి తీసుకోలేదు. కసరత్తులు మానలేదు. లాక్‌డౌన్‌లో అందుబాటులో ఉన్న వస్తువులతో, ఎవరింట్లో వారే వ్యాయామాలు చేశారు...

వర్కవుట్‌ ఒంటికి మంచిదేగా!

కరోనా కాలంలోనూ కథానాయికలు విశ్రాంతి తీసుకోలేదు. కసరత్తులు మానలేదు. లాక్‌డౌన్‌లో అందుబాటులో ఉన్న వస్తువులతో, ఎవరింట్లో వారే వ్యాయామాలు చేశారు. ఇప్పుడు అన్‌లాక్‌లో జిమ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. కథానాయికలు జిమ్స్‌కి వెళ్లడం ప్రారంభించారు. ప్రతి రోజూ వ్యాయమం చేయడం కొనసాగిస్తున్నారు. ప్రజలకు ‘వర్కవుట్‌ ఒంటికి మంచిదేగా’ అనే సందేశాన్ని ఇస్తున్నారు.


సమంత, రకుల్‌, లక్ష్మీ మంచు, రాశీ ఖన్నా, రష్మికా మందన్నా, త్రిష, తమన్నా, లావణ్యా త్రిపాఠీ, నిహారికా కొణిదెల, ఇలియానా, అమైరా దస్తూర్‌, ఈషా రెబ్బా... వీళ్లతో పాటు మిగతా కథానాయికలూ లాక్‌డౌన్‌లో వ్యాయామాలు చేయడం మానలేదు. జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితో ఏ విధంగా వర్కవుట్లు చేయవచ్చో చూపించారు. ఒంటరిగా కసరత్తులు చేశారు. ఇప్పుడు జిమ్‌లు ఓపెన్‌ అయ్యాక జంటగా కలసి మెలసి చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ గురించి ప్రజల్లో పరోక్షంగా అవగాహన కల్పించడంతో పాటు ఓ మోటివేషన్‌ ఇస్తున్నారు.


రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, లక్ష్మీ మంచు... ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకవేళ ఇద్దరూ హైదరాబాద్‌ నగరంలో గనుక ఉంటే కలిసే వ్యాయామం చేస్తారు. ఒకే తరహా వర్కవుట్‌కి పరిమితం కాకుండా వినూత్నంగా ప్రయత్నిస్తారు. వెయిట్‌ ట్రయినింగ్‌, యోగా, క్రాస్‌ ఫిట్‌ చేస్తుంటారు. మొన్నామధ్య వర్షంలో సైక్లింగ్‌ చేశారు. మనసుకు ఉల్లాసంతో పాటు శరీరానికి వ్యాయమం అన్నమాట. ఒక్కోసారి లక్ష్మీ మంచు డాబా మీదా వ్యాయామాలు చేస్తారు. అప్పుడప్పుడూ అలసి సొలసిన విశ్రాంతి తీసుకుంటున్న ఒకరిపై మరొకరు సరదాగా చిలిపి వ్యాఖ్యలు చేస్తుంటారు. లాక్‌డౌన్‌లో తండ్రి మోహన్‌బాబు చేసిన కసరత్తులనూ నెటిజన్లకు చూపించారామె.


సమంతకు జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆమెతో పాటు భర్త అక్కినేని నాగచైతన్య సైతం ఫిట్‌నెస్‌ అంటే ప్రాణమిస్తారు. అందుకని, ఇంట్లో సొంతంగా జిమ్‌ ఏర్పాటు చేసుకున్నారు. బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా! భార్యాభర్తలు ఇద్దరూ కలిసే వ్యాయామాలు చేస్తారు. సమంత ఎక్కువగా ఇష్టమైన వర్కవుట్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ అట! బరువులు ఎత్తడంతో పాటు అప్పుడప్పుడూ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటారు. స్నేహితురాలు, ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డితో సోమవారం సమంత వర్కవుట్లు చేశారు. వెయిట్‌ లిఫ్టింగ్‌తో పాటు బాక్సింగ్‌ గట్రా చేశారు.


తెలుగునాట అగ్ర కథానాయికలలో చోటు దక్కించుకున్న రాశీ ఖన్నా, రష్మికా మందన్నా వెళ్లేది ఒకే జిమ్‌కి! వాళ్లిద్దరి ట్రయినర్‌ ఒక్కరే. అందువల్ల, అప్పుడప్పుడూ ఒకే సమయానికి జిమ్‌కి వెళితే కలిసే వర్కవుట్లు  చేస్తారు. లేదంటే విడి విడిగా చేస్తారు. మొన్నా మధ్య ఒకే సమయానికి, ఒకే జిమ్‌కి వెళ్లడం మాత్రమే కాదు... ఒకే తరహా దుస్తులు వేసుకుని వెళ్లారు. అంతా యాదృశ్ఛికంగా జరిగింది. అప్పుడు సరదాగా ఫొటో తీసుకుని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు రాశీ ఖన్నా. సాధారణంగా ఉదయం లేదా సాయంత్రం వేళలో ఎవరైనా జిమ్‌కి వెళతారు. కానీ, రష్మికా మందన్నా మాత్రం మఽధ్యాహ్న వేళలో వెళుతుంటారు. ‘‘నాలాగా ఎవరైనా అసాధారణ వేళలో వర్కవుట్‌ చేస్తున్నారా?’’ అని మంగళవారం ఇన్‌స్టా స్టోరీలో నెటిజన్లను రష్మిక అడిగారు. 


కథానాయిక లావణ్యా త్రిపాఠీ సైతం ఫిట్‌నెస్‌కి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. క్రమం తప్పకుండా జిమ్‌కి వెళతారు. ‘‘ఓ విషయం గుర్తుపెట్టుకోండి... నిదానంగా, నిలకడగా చేస్తుంటే మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు’’ అని లావణ్యా త్రిపాఠీ చెబుతారు.  అన్నట్టు... నిహారికా కొణిదెల ఆమెకు మంచి స్నేహితురాలు. వీళ్లిద్దరూ ఒకే జిమ్‌కి వెళతారు. మధ్యలో వర్కవుట్లు మాని, కాసేపు కబుర్లతో కాలక్షేపం చేస్తూ విశ్రాంతి తీసుకుంటారట. ‘‘స్నేహితులు స్నేహితులుగా మాత్రమే ఉండరు. ఎక్సర్‌సైజ్‌ చేయరు’’ అని ట్రయినర్‌ కులదీప్‌ సేథితో కలిసి దిగిన ఫొటోకి క్యాప్షన్‌ ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బా, రాజేశఖర్‌ కుమార్తెలు శివానీ, శివాత్మిక సైతం కలిసి మెలసి వర్కవుట్లు చేస్తుంటారు. ఇలియానా కూడా  కొన్నాళ్లుగా క్రమం తప్పకుండా వర్కవుట్‌ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.


వయసులో ఉన్నవారు నాజూకుగా ఉండటం కోసమే వ్యాయామాలు చేస్తారని అనుకుంటే పొరపాటే. ఆరోగ్యం కోసం నాలుగు పదుల వయసు దాటిన మహిళలు కూడా చేయవచ్చనేది ప్రగతి చెప్పే మాట. యువతులకు  ఏమాత్రం తగ్గకుండా, వాళ్లకు దీటుగా ప్రగతి వర్కవుట్లు చేసి సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. ఇటీవల పూజా హెగ్డే సైతం తన తల్లి యోగా చేస్తున్న ఫొటో విడుదల చేశారు. ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో కాసేపైనా వర్కవుట్లు చేయాలనేది తారలు చెబుతున్న మాట, ఇస్తున్న సందేశం.  మరి మనమూ మొదలుపెట్టేద్దామా!

Updated Date - 2020-10-14T06:40:50+05:30 IST