రజనీ మళ్లీ ఆ సినిమా చేస్తారా?

ABN , First Publish Date - 2020-09-24T07:04:13+05:30 IST

తొమ్మిదేళ్ల క్రితం అంటే 2011 ఏప్రిల్‌ 29న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన కొత్త చిత్రం ‘రానా’ షూటింగ్‌ ప్రారంభించారు. కథానాయిక దీపిక పడుకోన్‌ కూడా ఈ...

రజనీ మళ్లీ ఆ సినిమా చేస్తారా?

తొమ్మిదేళ్ల క్రితం అంటే 2011 ఏప్రిల్‌ 29న  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన కొత్త చిత్రం ‘రానా’ షూటింగ్‌ ప్రారంభించారు. కథానాయిక దీపిక పడుకోన్‌ కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.  17 వ శతాబ్దానికి చెందిన ఓ యోధుడి కథను  దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ చెప్పగా, ఆ కథ నచ్చి  ఆ సినిమా చేయడానికి అంగీకరించారు రజనీ. ఈ సినిమాలో రజనీ మూడు పాత్రలు పోషిస్తారనీ, అమితాబ్‌ బచ్చన్‌ కూడా కీలక పాత్ర పోషిస్తారనీ,  భారీ వ్యయంతో రూపుదిద్దుకొంటుందనీ ఆ రోజు ప్రకటించారు. అయితే షూటింగ్‌ ప్రారంభించిన రోజే రజనీకాంత్‌ అస్వస్థతకు గురవడంతో రెగ్యులర్‌ షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం రజనీకాంత్‌ను సింగపూర్‌ తీసుకెళ్లారు. ఆయన కోలుకున్నా హెవీ సీన్స్‌ షూటింగ్‌లో పాల్గొనకూడదని డాక్టర్లు చెప్పడంతో, అలాంటి సన్నివేశాలు అధికంగా ఉన్న ‘రానా’ చేయడం కష్టమని పక్కకు పెట్టేశారు. అనంతరం  రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో  ‘కొచ్చెడియాన్‌’ (తెలుగులో ‘విక్రమసింహా) పేరుతో ఓ యానిమేషన్‌ ఫిల్మ్‌ తీశారు. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ‘రానా’ చిత్రం స్ర్కిప్ట్‌ ఫైలు ఎక్కడో ఉంటే  బూజు దులిపి ఇప్పుడు  బయటకు తీశారు. కారణం..  ‘రానా’ కథను మళ్లీ చెప్పమని ఆరు నెలల క్రితం రజనీకాంత్‌  దర్శకుడు రవికుమార్‌ని అడగడమే. కథంతా విన్నాక  ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా చేయగలమా?’అని రజనీకాంత్‌ అడిగారట. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే  శాసనసభ ఎన్నికల్లో రజనీకాంత్‌ పోటీ చేయాలనుకుంటున్న నేపథ్యంలో  ‘రానా’ వంటి బిగ్‌ బడ్జెట్‌ సినిమా కోసం ఎక్కువ రోజులు కేటాయించగలనా లేదా అన్నది ఆయన సందేహం. ప్యాన్‌ ఇండియన్‌ ఫిల్మ్స్‌ పెద్ద సంఖ్యలో రూపుదిద్దుకొంటున్న ప్రస్తుత తరుణంలో ‘రానా  సినిమా  రజనీకాంత్‌ చేస్తే బాగుంటుందని అభిమానుల కోరిక.

Updated Date - 2020-09-24T07:04:13+05:30 IST