అందుకే ఆ యాడ్ చేయలేదు: సాయిపల్లవి

ABN , First Publish Date - 2020-12-24T16:16:32+05:30 IST

తొలి సినిమా `ప్రేమమ్‌`తోనే నేచురల్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకుంది సాయిపల్లవి.

అందుకే ఆ యాడ్ చేయలేదు: సాయిపల్లవి

తొలి సినిమా `ప్రేమమ్‌`తోనే నేచురల్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకుంది సాయిపల్లవి. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలు కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసేందుకే ఇష్టపడుతుంటుంది. సినిమాల్లో పెద్దగా మేకప్ లేకుండా సహజంగానే కనిపించే సాయిపల్లవి గతంలో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. రూ.2 కోట్లు ఇస్తానన్నా ఆ యాడ్ చేయడానికి సాయిపల్లవి ఇష్టపడలేదు. 


ఆ యాడ్ గురించి తాజాగా సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. `ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్‌కు నో చెప్పడం అనేది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. అందం, శరీర ఛాయ అనే వాటికి మన సమాజంలో చాలా విలువ ఉంటుంది. నా మొహం మీద మొటిమలు పోగొట్టుకోవడానికి నేను కూడా చాలా ఫెయిర్ నెస్ క్రీమ్‌లు వాడేదాన్ని. ఇంటి నుంచి బయటకు వెళ్లేదాన్ని కూడా కాదు. `ఎదుటివారు కేవలం నా మొహం మీద మొటిమలు మాత్రమే చూసి ఎందుకు మాట్లాడుతున్నారు. నా కళ్లలోకి ఎందుకు చూడడం లేదు` అనుకునేదాన్ని. `ప్రేమమ్` తర్వాత ప్రజలు నన్ను నన్నుగానే ఇష్టపడ్డారు. నేను ఎంతో మందికి ప్రేరణగా నిలిచాను. తెల్లగా మారడం కోసం నా సోదరి తనకు ఇష్టం లేని ఆహార పదార్థాలు తినేది. తనలో ప్రేరణ నింపడానికైనా నేను నాలాగే ఉండాలని నిశ్చాయించుకున్నా. అందుకే ఆ యాడ్ చేయలేద`ని సాయిపల్లవి పేర్కొంది. 

Updated Date - 2020-12-24T16:16:32+05:30 IST