ఎవరి బ్రాండ్‌ వేల్యూ ఏంటి!?

ABN , First Publish Date - 2020-11-03T10:25:48+05:30 IST

బ్రాండ్‌... తారల ముఖచిత్రమే ఓ బ్రాండ్‌! అందుకని... వాళ్ళను ప్రచార కర్తలు (బ్రాండ్‌ అంబాసిడర్లు)గా బహుళజాతి సంస్థలు...

ఎవరి బ్రాండ్‌ వేల్యూ ఏంటి!?

బ్రాండ్‌... తారల ముఖచిత్రమే ఓ బ్రాండ్‌! అందుకని... వాళ్ళను ప్రచార కర్తలు (బ్రాండ్‌ అంబాసిడర్లు)గా బహుళజాతి సంస్థలు నియమించుకుంటాయి. తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తాయి. వాణిజ్య ప్రకటనలకు తారలే ఎందుకు? అంటే... ప్రజల్లో వాళ్ళకు గుర్తింపు, గౌరవం, ఆకర్షణ ఉండటమే కారణం.  తారలు చెబితే... విజ్ఞప్తి చేస్తే... ప్రజలు వింటారనే బలమైన నమ్మకం! ఆ నమ్మకమే తారలకు కోట్లకు కోట్ల రూపాయలు తెచ్చిపెడుతోంది.


అసలు, ప్రజల్లో ఎవరి బ్రాండ్‌ వేల్యూ ఎంత? అని ‘నమ్మకం, గుర్తింపు, ఆకర్షణ, గౌరవం, విజ్ఞప్తి’ అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఇటీవల ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బ్రాండ్స్‌ (ఐఐహెచ్‌బి) సంస్థ సర్వే చేసింది. ‘సెలబ్రిటీలు హ్యూమన్‌ బ్రాండ్స్‌ అయితే?’ అనేది సర్వే కాన్సెప్ట్‌, ఐడియా!  ఆ బ్రాండ్‌కి ఓ క్యాప్షన్‌ ఇవ్వాలి. సర్వేలో సుమారు 60 వేలమంది పాల్గొన్నారు. హిందీ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులకు ప్రజలు క్యాప్షన్లు ఇచ్చారు. ఎవరి బ్రాండ్‌ వేల్యూ ఏంటనేది నిర్ణయించారు. ఎవరికి ఏ క్యాప్షన్‌ ఇచ్చారో తెలుసా?


ఎనిమిది పదుల వయసుకు దగ్గర పడుతున్నా... ప్రేక్షకుల్లో అమితాబ్‌ బచ్చన్‌కి ఏమాత్రం ఫాలోయింగ్‌ తగ్గలేదు. సినీ రంగంలోనే కాదు... వాణిజ్య ప్రకటనల రంగంలోనూ ఆయన దూసుకువెళుతున్నారు. దేశంలో అత్యంత విశ్వసనీయమైన, గౌరవప్రదమైన బ్రాండ్‌గా ఐఐహెచ్‌బి సర్వేలో బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ నిలిచారు. విశ్వసనీయత, గౌరవం ఆయన బ్రాండ్‌ వేల్యూ అన్నమాట. ఆయనతో పాటు బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ సైతం అత్యంత విశ్వసనీయమైన సెలబ్రిటీగా చోటు సంపాదించుకున్నారు. మహిళల విషయానికి వస్తే విశ్వసనీయత విభాగంలో దీపికా పడుకోన్‌ మిగతా కథానాయికల కంటే ముందు వరుసలో ఉన్నారు. అలాగే, అత్యంత అందమైన మహిళగానూ నిలిచారామె. దీన్నిబట్టి డ్రగ్స్‌ కేసులో దీపిక పేరు వచ్చినప్పటికీ... అదేమంత ప్రభావం చూపలేదని చెప్పాలి. భార్యభర్తల విషయానికి వస్తే... అత్యంత విశ్వసనీయమైన సెలబ్రిటీ కపుల్‌గా, ఆకర్షణీయమైన జంటగా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్కా శర్మ దంపతులు నిలిచారు.


యువ కథానాయిక ఆలియా భట్‌ను అత్యంత ఆకర్షణీయమైన సెలబ్రిటీగా ప్రజలు పేర్కొన్నారు. ఆమెతో ప్రేమలో ఉన్న రణ్‌బీర్‌ కపూర్‌ను కలల రాకుమారుడు అని తేల్చారు. జంట విభాగం వచ్చేసరికి... వీళ్ళిద్దర్నీ ‘వివాదాస్పద జంట’గా  కూడా  పేర్కొనడం గమనార్హం. సల్మాన్‌ ఖాన్‌, కంగనా రనౌత్‌ వివాదాస్పద సెలబ్రిటీల విభాగంలోకి వచ్చారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే... ఆయుష్మాన్‌ ఖురానాను ఎక్కువమంది గుర్తుపట్టడం! పెళ్లైన కథానాయికలకు ప్రజల్లో ఏమాత్రం ఆరాధన తగ్గదని ఈ సర్వే ద్వారా ప్రియాంకా చోప్రా, రాధికా ఆప్టే మరోసారి నిరూపించారు. సెక్సీ సెలబ్రిటీగా ప్రియాంక, సెడక్టివ్‌ సెలబ్రిటిగా రాధిక నిలిచారు. ఇదీ వీళ్ళ బ్రాండ్‌ వేల్యూ!

Updated Date - 2020-11-03T10:25:48+05:30 IST