సంసార సాగరం ఈదలేవురా... మ్యారేజు బ్యాగేజి మోయలేవురా!

ABN , First Publish Date - 2020-05-26T04:29:03+05:30 IST

‘‘మ్యారేజు అంటే ఓ బ్యాగేజు సోదరా... నువ్వు మోయలేవురా! సంసార సాగరం నువ్వు ఈదలేవురా... నట్టేట్లో మునుగుతావురా!’’ అని సాయితేజ్‌ అంటున్నారు. అసలు, ఆయన చెప్పేది ఏంటంటే...

సంసార సాగరం ఈదలేవురా... మ్యారేజు బ్యాగేజి మోయలేవురా!

‘‘మ్యారేజు అంటే ఓ బ్యాగేజు సోదరా... నువ్వు మోయలేవురా! సంసార సాగరం నువ్వు ఈదలేవురా... నట్టేట్లో మునుగుతావురా!’’ అని సాయితేజ్‌ అంటున్నారు. అసలు, ఆయన చెప్పేది ఏంటంటే... పెళ్లి వద్దని! సాయితేజ్‌ కథానాయకుడిగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘సోలో బతుకే సో బెటర్‌’. నభా నటేశ్‌ కథానాయిక. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ‘నో పెళ్లి...’ పాటను సోమవారం ట్విట్టర్‌లో హీరో నితిన్‌ విడుదల చేశారు. ఎస్‌ఎస్‌ తమన్‌ స్వరకల్పనలో, రఘురామ్‌ సాహిత్యం అందించిన గీతమిది. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. ఇందులో రానా దగ్గుబాటి, వరుణ్‌తేజ్‌ సందడి చేశారు. త్వరలో సినిమా విడుదలపై నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారని చిత్రబృందం తెలిపింది.


ఎన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చూస్తా! 

‘నో పెళ్లి’ పాటను విడుదల చేసిన నితిన్‌, ‘‘డార్లింగ్‌ సాయితేజ్‌! నువ్వు ఇచ్చిన బహుమతి బావుంది. ‘సోలో బతుకే సో బెటర్‌’లో పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. కానీ, నువ్వు ఎన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చూస్తా! కొన్నిసార్లు చేసుకోవడంలో టైమ్‌ గ్యాప్‌ ఉండొచ్చు ఏమో గానీ, చేసుకోవడం మాత్రం పక్కా’’ అన్నారు. ‘‘నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను డార్లింగ్‌! సెట్‌ చేస్తా. పెళ్లికి సిద్ధమైనా... మాలాంటి సింగిల్స్‌ కోసం సాంగ్‌ లాంచ్‌ చేసినందుకు థ్యాంక్స్‌’’ అని సాయితేజ్‌ అన్నారు. పాటలో సందడి చేసిన వరుణ్‌తేజ్‌, రానా దగ్గుబాటికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల తన ప్రేమ విషయం ప్రేక్షకులందరికీ చెప్పిన రానా దగ్గుబాటి, ఈ పాటలో ‘నో పెళ్లి... ఈ తప్పే చేయకురా వెళ్లి’ అనడం గురించి ‘‘నా యూత్‌లో టంగ్‌ స్లిప్‌ అవ్వడం అనొచ్చు’’ అని అన్నారు.Updated Date - 2020-05-26T04:29:03+05:30 IST