అమ్మ పాత్రతో ఇబ్బందేకదా అన్నారు

ABN , First Publish Date - 2020-06-16T06:17:53+05:30 IST

‘‘దర్శకుడికి మొదటి సినిమా, నేను పదిహేనుకు పైగా సినిమాల్లో నటించిన నాయికను అన్న ఫీలింగ్‌ నాకు ఉండదు. ఆ భావన నాలో ఉంటే ‘మహానటి’ కథ నా దగ్గరికి వచ్చేది కాదు’’ అని కీర్తీ సురేశ్‌ అన్నారు...

అమ్మ పాత్రతో ఇబ్బందేకదా అన్నారు

‘‘దర్శకుడికి మొదటి సినిమా, నేను పదిహేనుకు పైగా సినిమాల్లో నటించిన నాయికను అన్న ఫీలింగ్‌ నాకు ఉండదు. ఆ భావన నాలో ఉంటే ‘మహానటి’ కథ నా దగ్గరికి వచ్చేది కాదు’’ అని కీర్తీ సురేశ్‌ అన్నారు. ఆమె కీలక పాత్ర పోషించిన చిత్రం ‘పెంగ్విన్‌’. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో కార్తీక్‌ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా విడుదలకానుంది. ఈ సందర్భంగా కీర్తీ సురేశ్‌ ‘చిత్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే...


‘మహానటి’ తర్వాత నటిగా నా బాధ్యత మరింత పెరిగింది. మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలతోపాటు, కమర్షియల్‌ చిత్రాలు చేయాలనుకుంటున్నా. దీటైన కథల కోసం చూస్తున్న సమయంలో ‘పెంగ్విన్‌’ కథ విన్నా. దర్శకుడు ఈశ్వర్‌ కార్తిక్‌ నాలుగు గంటలపాటు నెరేషన్‌ ఇచ్చారు. అందులో నా పాత్ర వింటున్నంత సేపు తెలియని యాంగ్జైటీ, ఎమోషన్స్‌ నన్ను చుట్టుముట్టాయి. కథలో లీనమైపోయానంతే! తన కొడుకు కోసం తల్లి సాగించే అన్వేషణ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. చక్కని భావోద్వేగాలు, ఉత్కంఠ కలగలిపిన సినిమా ఇది. ముసుగు మనిషి ఎవరనే ఉత్కంఠ చివరి వరకూ కొనసాగుతుంది. నాలో నటికి సవాల్‌ విసిరే పాత్ర ఇది.  ‘మహానటి’ ఎంతగా గుర్తింపు తెచ్చిందో ‘పెంగ్విన్‌’ కూడా అంతే పేరు తీసుకొస్తుంది. వాళ్లను గుర్తుంచుకునేవారు కాదు దర్శకుడికిది మొదటి సినిమా అయినా నాకు ఆ భావన కలగలేదు. అతనిలో క్లారిటీ నాకు బాగా నచ్చింది. నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు. ‘అమ్మ పాత్రలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి కదా’ అని చాలామంది అన్నారు. నేను అవేమీ ఆలోచించలేదు. ఇది రిస్క్‌ అనిపించలేదు. నటి అన్నాక అన్ని పాత్రలు చేయాలి. ఆ రోజుల్లో మా అమ్మ మేనక, ఆమె తోటి నటులు అలా అనుకుని ఉంటే ఈరోజు వాళ్ల గురించి మాట్లాడుకునేవాళ్లం కాదు. ఇందులో తల్లి పాత్ర కోసం మా అమ్మ చాలా సలహాలు ఇచ్చింది. థియేటర్‌లో కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతున్న నా మొదటి సినిమా ఇది. కాస్త ఎగ్జైటింగ్‌గా ఉన్నా.. థియేటర్‌ ఆడియన్స్‌ను మిస్‌ అవుతానేమో అన్న బాధ కూడా ఉంది. కరోనా ప్రపంచం మొత్తాన్ని తారుమారు చేసింది. నా సినిమాతో ప్రేక్షకుల్ని అలరించడానికి ఓటీటీ మంచి వేదిక అయింది.


బరువు తగ్గా...

ఏడాది గ్యాప్‌ రావడంతో ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెట్టా. బరువు తగ్గి నాజూగ్గా ఉండాలని రెగ్యులర్‌గా వర్కవుట్స్‌ చేస్తున్నా. అందుకే సన్నబడ్డా. ప్రస్తుతం ‘గుడ్‌లఖ్‌ సఖి’, ‘మిస్‌ ఇండియా’, ‘రంగ్‌దే’ సినిమాలు చేస్తున్నా. తమిళంలో రజనీకాంత్‌గారి ‘అన్నాత్తే’లో అవకాశం దక్కడం ఆనందంగా ఉంది.


Updated Date - 2020-06-16T06:17:53+05:30 IST