ప్రారంభానికి ముందే ప్రకంపనలు

ABN , First Publish Date - 2020-10-18T06:49:45+05:30 IST

ఒక వ్యక్తి జీవితకథ ఆధారంగా రూపుదిద్దుకొనే చిత్రాలు వివాదాస్పదం కావడం సర్వసాధారణమే. ఎందుకంటే ఆ సినిమా వాస్తవాలను వక్రీకరించిందనో, లేక ఆ వ్యక్తిలోని గొప్పతనాన్ని...

ప్రారంభానికి ముందే ప్రకంపనలు

ఒక వ్యక్తి జీవితకథ ఆధారంగా రూపుదిద్దుకొనే చిత్రాలు వివాదాస్పదం కావడం సర్వసాధారణమే. ఎందుకంటే ఆ సినిమా వాస్తవాలను వక్రీకరించిందనో, లేక ఆ వ్యక్తిలోని గొప్పతనాన్ని చెప్పడంలో విఫలమైందనే విమర్శలు వస్తుంటాయి. సినిమా అన్న తర్వాత కొంత కల్పన, డ్రామాకు అవకాశం ఉంటుంది కనుక బయోపిక్స్‌ ఎప్పుడూ ఎవర్నీ పూర్తిగా సంతృప్తి పరచలేవు. అయితే సినిమా విడుదలకు ముందో, విడుదలయ్యాకో సాధారణంగా ఈ వివాదాలు, విమర్శలు మొదలవుతుంటాయి. అయితే తమిళంలో రూపుదిద్దుకోనున్న ‘‘800’ చిత్రం ప్రారంభానికి ముందునుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. శ్రీలంక్‌ క్రికెటర్‌, స్పిన్నింగ్‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ కావడమే ఈ విమర్శలకు కారణం. 800 టెస్ట్‌ వికెట్స్‌ పట్టుకొన్న వ్యక్తి  బయెపిక్‌ కావడంతో ఈ చిత్రానికి ‘800’ అని పేరు పెట్టారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. మురళీధరన్‌ పాత్రను విజయ్‌ సేతుపతి పోషిస్తారని తెలిపారు. అంతే అప్పటినుంచీ ఈ సినిమా గురించి విమర్శలు మొదలయ్యాయి. 


విజయ్‌ సేతుపతి మీద సోషల్‌ మీడియాలో దాడి మొదలైంది. తమిళ ఈలమ్‌కు వ్యతిరేకంగా మురళీధరన్‌ పని చేశారనీ, శ్రీలంక మరణకాండకు మద్దతు పలికిన ఆ వ్యక్తి గురించి సినిమా తీయడం ఏమిటని నెటిజన్లు నిలదీస్తున్నారు. తమిళ సంఘాలు, రాజకీయ పార్టీల గురించి కూడా విజయ్‌ సేతుపతి విమర్శలు ఎదుర్కొంటున్నారు.


వివాదం ఎలా మొదలైంది?  

ముత్తయ్య మురళీధరన్‌ శ్రీలంకలో పుట్టి పెరిగిన తమిళుడు. ద లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలమ్‌’(ఎల్‌టీటీఈ)ను ఆయన విమర్శించారనీ, శ్రీలంక ప్రభుత్వానికి బాసటగా నిలిచారనీ అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి. 26 ఏళ్ల పాటు తమిళులకు, శ్రీలంక సైనికులకు మధ్య జరిగిన భీకరమైన పోరు  2009లో అంతమైంది.  ఎల్‌టీటీఈని తుడిచిపెట్టేసిన సంవత్సరం అది. తన  జీవితంలో అత్యంత ఆనందరకమైన సంవత్సరం 2009 అని గత సంవత్సరం మురళీధరన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.  ఎంతో మంది తమిళులను పొట్టన పెట్టుకున్న 2009 సంవత్సరం తనకు ఆనందకరమైన సంవత్సరం అని మురళీధరన్‌ చెప్పడంలోనే ఆయన తమిళులకు వ్యతిరేకి అని అర్థం అవుతోందని ఆయన్ని విమర్శిస్తున్న వారు అంటున్నారు. అయితే తన మాటలను తప్పుగా అర్దం చేసుకొన్నారనీ, 26 ఏళ్ల పాటు జరిగిన యుద్ధం 2009లో ముగియడం, అప్పటినుంచీ ఇరువర్గాల్లో మరణాలు లేకపోవడం వల్లే తను అలా అన్నానని మురళీధరన్‌ వివరణ ఇచ్చినా జరగాల్సిన డామేజ్‌ జరిగిపోయింది. తమిళులను అణిచివేయడానికి జరిగిన మారణకాండకు అనుకూలంగా వ్యవహరించిన  మురళీధరన్‌  బయోపిక్‌ తీయడానికి వీల్లేదనీ, అందులో విజయ్‌ సేతుపతి నటిస్తే ఒప్పుకోమని అంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. 


అయోమయంలో విజయ్‌

మంచి నటుడిగా గుర్తింపు పొంది ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకొంటున్న విజయ్‌ సేతుపతి ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన అభిమానులు సైతం ‘800’ చిత్రనిర్మాణాన్ని వ్యతిరేకిస్తుండడమే దీనికి కారణం. మరో పక్క ఈ చిత్రంలో నటించమని కొందరు, నటించవద్దని కొందరు చెబుతుండడంతో ఎటువైపు అడుగు వెయ్యాలో తేల్చుకోలేని అయోమయ  పరిస్థితిలో ఆయన ఉన్నారు.  మరో పక్క ఈ వివాదం రాజకీయరంగు కూడా  పులుముకుంటోంది. ఇది  కేవలం సినిమా కాదనీ, తమిళుల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అనీ కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే రంగప్రవేశం చేసి, సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

భారతీరాజా, వైరముత్తు, సీమాన్‌, శీను రంగస్వామి వంటి పెద్దలు ‘800’ సినిమా నుంచి తప్పుకోమనీ, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని విజయ్‌ సేతుపతిని  హెచ్చరించారు. తమిళుల మనోభావాలను దెబ్బతీసే సినిమా ఇదని వారు అంటున్నారు. 


అయితే నటి రాధిక, ఆమె భర్త శరత్‌కుమార్‌ విజయ్‌ సేతుపతికి మద్దతు పలికారు. ‘నటులకు రాజకీయాలు అంటగట్టవద్దు. విజయ్‌ సేతుపతి ఒక నటుడు. ఆ చిత్రంలో నటిస్తున్నాడు. అంతవరకే చూడండి. ఆయనని నటించవద్దని అంటున్న వారికి  తమిళులకు సంబంధించిన క్రికెట్‌ టీమ్‌కు మురళీధరన్‌ కోచ్‌గా ఉన్నా పరవాలేదా? ’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ టీమ్‌కు మురళీధరన్‌ కోచ్‌గా ఉన్న సంగతిని వారు గుర్తు చేశారు. 


దర్శకనిర్మాతలు ఏమంటున్నారు? 

ఇలాంటి వివాదాల మధ్య చిత్రనిర్మాణం కొనసాగించడం ఓ సంస్థకైనా తలనొప్పి వ్యవహారమే. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ‘800’ చిత్రాన్ని నిర్మిస్తున్న దార్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ వివాదంపై స్పందిస్తూ ‘స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే బయోపిక్‌ ఇది. ఇందులో ఎటువంటి రాజకీయ అంశాలు ఉండవు. ఏ రాజకీయ వర్గానికి కానీ, వ్యవస్థకు కానీ అనుకూలంగా ఈ సినిమా ఉండదు’ అని ప్రకటించింది. శ్రీపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


మురళీధరన్‌ స్టేట్‌మెంట్‌తో తమిళ సంఘాలు చల్లబడతాయోలేదో చూడాలి? 

మూడు పేజీల వివరణ

‘800’ చిత్ర నిర్మాణం వివాదాస్పదం కావడంతో ముత్తయ్య  మురళీధరన్‌ ఎట్టకేలకు  నోరు విప్పారు. భావోద్వేగాలు కలిగిన మూడు పీజీల లేఖను తమిళంలో  రాసి పత్రికలకు విడుదల చేశారు. ‘జీవితంలో నేను చాలా వివాదాల్లో చిక్కుకున్నాను. అవి నాకు కొత్త కాదు. ఏడేళ్ల వయసులో ఉండగానే నా తండ్రి చనిపోయారు. మా కుటుంబ కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు  పడాల్సి వచ్చింది. యుద్ధం జరిగే ప్రాంతంలో మనుగడ  సాగించడానికి అనేక  కష్టాలు పడ్డాం. ఆ ఇబ్బందుల్ని నేను ఎలా ఎదుర్కొన్నాను, క్రికెట్‌లో నిలదొక్కుని ఎలా ఎదిగాన్నది మాత్రమే ఈ  సినిమాలో చూపిస్తారు.  ఇతర అంశాలు ఏమీ ఉండవు. శ్రీలంకలో తమిళుడిగా జన్మించడం నా తప్పా?  నేను శ్రీలంకలో పుట్టడం వల్ల ఆ దేశ జట్టులో ఉన్నాను. నాకు తమిళం రాదనీ, సింహళం, ఆంగ్ల భాషల్లో మాట్లాడతానని అనడం కరెక్ట్‌ కాదు. అమాయకుల్ని చంపడాన్ని నేను ఎప్పుడూ సమర్ధించలేదు, సమర్ధించబోను కూడా. తమిళుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి నా కథను వెండితెరపై చెప్పాలనుకుంటున్నాను’ అంటూ ఆ లేఖలో వివరించారు మురళీధరన్‌. 

Updated Date - 2020-10-18T06:49:45+05:30 IST