వస్తారోచ్‌.... పండక్కి!!

ABN , First Publish Date - 2020-10-01T06:39:32+05:30 IST

పరిస్థితులు అన్నీ అనుకూలించి థియేటర్లు తెరచుకుంటే అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సూర్యవంశీ’ ఈ ఏడాది దీపావళికి థియేటర్లలోకి వస్తుంది...

వస్తారోచ్‌.... పండక్కి!!

పరిస్థితులు అన్నీ అనుకూలించి థియేటర్లు తెరచుకుంటే అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సూర్యవంశీ’ ఈ ఏడాది దీపావళికి థియేటర్లలోకి వస్తుంది. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని టీమిండియా 1983 క్రికెట్‌ ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన ప్రయాణం నేపథ్యంలో రూపొందిన ‘83’ క్రిస్మస్‌కి విడుదల కానున్నది. ఇందులో కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ నటించారు.


అక్షయ్‌... ఫోర్‌ గ్యారెంటీ!

ప్రతి ఏడాదీ కనీసం నాలుగైదు చిత్రాలను విడుదల చేయడం అక్షయ్‌కుమార్‌కి అలవాటు. కరోనా వల్ల ఈ ఏడాది ఆయన నుండి ఒక్క చిత్రమూ విడుదల కాలేదు. దీపావళి సందర్భంగా ‘లక్ష్మీబాంబ్‌’ నవంబర్‌ 9న ఓటీటీలో విడుదల కానుంది. అయితే, వచ్చే ఏడాదీ అక్షయ్‌కుమార్‌ కనీసం నాలుగు, ఐదు చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నారు. అగ్ర కథానాయకుల్లో ముందుగా బాక్సాఫీస్‌ బ్యాటింగ్‌కి వస్తున్నది ఆయనే. గణతంత్ర దినోత్సవానికి నాలుగు రోజుల ముందు జనవరి 22న ‘బచ్చన్‌ పాండే’ను విడుదల చేయనున్నారు. అక్షయ్‌కుమార్‌ ప్రత్యేక అతిథి పాత్రలో నటిస్తున్న మరో చిత్రం ‘అత్రంగి రే’ని ప్రేమికుల దినోత్సవం కానుకగా థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ నటుడు ధనుశ్‌, సారా అలీ ఖాన్‌ జంటగా నటిస్తున్నారు. కరోనా తర్వాత విదేశాల్లో చిత్రీకరణ ప్రారంభించిన అక్షయ్‌ చిత్రం ‘బెల్‌ బాటమ్‌’. గుడ్‌ ఫ్రైడే రోజున... ఏప్రిల్‌ 2న ఆ చిత్రాన్ని విడుదల చేయాలనేది ప్రస్తుతానికి ఉన్న ప్రణాళిక. అక్షయ్‌తో ‘అత్రంగి రే’ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ చేస్తున్న మరో చిత్రం ‘రక్షాబంధన్‌’. దీన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయనున్నారు.


కభీ ఈద్‌...  కభీ దివాలీ!

సల్మాన్‌ ఖాన్‌కు, రంజాన్‌ పండక్కి విడదీయరాని సంబంధం ఉంది. ‘వాటెండ్‌’, ‘దబాంగ్‌’, ‘బాడీగార్డ్‌’, ‘ఏక్‌ థా టైగర్‌’, ‘కిక్‌’, ‘భజరంగీ భాయిజాన్‌’, ‘సుల్తాన్‌’, ‘భారత్‌’... ఈద్‌కి వచ్చిన సల్లూ భాయ్‌ చిత్రాల్లో చాలావరకూ ఘన విజయాలు సాధించాయి. వచ్చే ఏడాదీ ఫర్హాద్‌ సామ్‌జి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘కభీ ఈద్‌ కభీ దివాలీ’ని రంజాన్‌ పండగ సందర్భంగా మే 13న విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రభుదేవా దర్శకత్వంలో చేస్తున్న ‘రాధే’ను సైతం ఏదో పండక్కి తీసుకొచ్చే ఆలోచనలో సల్మాన్‌ ఉన్నారట. ఇదిలా ఉండగా... రంజాన్‌ సందర్భంగా తన ‘సత్యమేవ జయతే’ చిత్రాన్ని విడుదల చేస్తానని జాన్‌ అబ్రహం ప్రకటించారు.


పంద్రాగస్టుకి ‘మైదాన్‌’... 

క్రిస్మస్‌కి ‘లాల్‌ సింగ్‌ చద్దా’

బాలీవుడ్‌లో మరో ఇద్దరు హీరోలు అజయ్‌ దేవగణ్‌, ఆమిర్‌ఖాన్‌ సైతం వచ్చే ఏడాదీ పండగల సీజన్‌ మీద కన్నేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 13న ‘మైదాన్‌’తో అజయ్‌ దేవగణ్‌ థియేటర్లలో బాక్సాఫీస్‌ ఆటకు దిగనున్నారు. ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 24న ‘లాల్‌ సింగ్‌ చద్దా’ను విడుదల చేయనున్నారు ఆమిర్‌ ఖాన్‌. నిజానికి ఈ ఏడాది క్రిస్మస్‌కి చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా వల్ల వచ్చే ఏడాదికి వెళ్లింది.

Updated Date - 2020-10-01T06:39:32+05:30 IST