వైరస్ భయంతో సీరియల్స్ వదులుకుంటున్న తారలు
ABN , First Publish Date - 2020-08-08T12:13:48+05:30 IST
కరోనా ప్రభావంతో ప్రపంచంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. చిత్ర పరిశ్రమ, టీవీ రంగాల్లో షూటింగ్‌ల విషయంలో పలువురు నటులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ తారలు సైతం తాము...

కరోనా ప్రభావంతో ప్రపంచంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. చిత్ర పరిశ్రమ, టీవీ రంగాల్లో షూటింగ్‌ల విషయంలో పలువురు నటులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ తారలు సైతం తాము చేస్తున్న సీరియల్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కసౌటీ జిందగీ కీ- 2 నటుడు కునాల్ ఠాకూర్ షో నుంచి నిష్క్రమించారు. షూటింగ్ ప్రారంభమైన తరువాత కూడా అతను హాజరుకాలేదు. కునాల్ ఇటీవల దంత శస్త్రచికిత్స చేయించుకున్నారు. అటువంటి పరిస్థితిలో షూటింగ్‌కు వెళ్ళడం మంచిది కాదని, పరిస్థితులు చక్కబడే వరకు ఇంట్లోనే ఉండాలనుకుంటున్నట్లు కునాల్ తెలిపారు. ఇదేవిధంగా టీవీ షో యే రిష్తా హై ప్యార్ కే షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నటుడు రిత్విక్ అరోరా సెట్‌కు వెళ్లలేదు. కరోనా కారణంగా తాను షూటింగ్‌కు వెళ్లడంలేదని రిత్విక్ తెలిపారు. ఇప్పుడు షోలో రిత్విక్ స్థానంలో అవినాష్ మిశ్రా వచ్చారు. నటి అవనీత్ కౌర్ అల్లాదీన్ సీరియల్‌తో ప్రజాదరణ పొందారు. ఈ సీరియల్ కొత్త ఎపిసోడ్ షూటింగ్‌కు ఆమె హాజరుకాలేదు. ఇప్పుడు ఆమె స్థానాన్ని ఆషి సింగ్ భర్తీ చేశారు. జీటీవీ పాపులర్ షో కుంకుమ్ భాగ్యలో అలియా పాత్రలో నటించిన శిఖా సింగ్ కూడా షూటింగ్‌లకు వీడ్కోలు పలికారు. ఇటీవలే ఆమె తల్లిగా మారారు. కరోనా భయంతోనే ఆమె షూటింగ్‌కు హాజరు కావడం లేదని సమాచారం. శక్తి సీరియల్‌లో గౌరీ టోంక్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే తాను షూటింగ్‌లకు దూరంగా ఉంటున్నానని గౌరి తెలిపారు.