సిగ్గుపడుతున్నా: విజయ్‌కి సారీ చెప్పిన నెటిజన్!

ABN , First Publish Date - 2020-10-27T21:42:24+05:30 IST

తన అద్భుత నటనతో విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ సేతుపతి

సిగ్గుపడుతున్నా: విజయ్‌కి సారీ చెప్పిన నెటిజన్!

తన అద్భుత నటనతో విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ సేతుపతి ఇటీవల మురళీధరన్ బయోపిక్ `800` కారణంగా వివాదాల పాలయ్యాడు. మురళీధరన్ బయోపిక్‌లో నటిస్తున్నందుకు ఎంతో మంది తమిళులు విజయ్‌పై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ హద్దులు దాటి విజయ్ సేతుపతిని బెదిరించాడు. 


`800` ఈ మూవీ నుంచి తప్పుకోకపోతే విజయ్ కూతురిపై అత్యాచారానికి పాల్పడతానని హెచ్చరించాడు. ఈ బెదిరింపు తీవ్ర విమర్శల పాలైంది. దీంతో సదరు నెటిజన్ తాజాగా విజయ్ సేతుపతికి క్షమాపణ చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. `విజయ్ సేతుపతి సర్, అతని కూతురి గురించి అవమానకర కామెంట్ చేసింది నేనే. నా కామెంట్ పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. నేను చేసింది చిన్న తప్పు కాదని తెలుసు. కానీ, గతంలో నేనెవరినీ అలా అనలేదు. కరోనా మహమ్మారి కారణంగా నా జాబ్ పోయింది. ఆ సమయంలో `800` బయోపిక్ వివాదం రాజుకుంది. ఆ చిరాకులో అలాంటి కామెంట్ చేశాను. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయను. నేను కఠినమైన శిక్షకు అర్హుణ్నే. విజయ్ సేతుపతి సర్‌కు, ఆయన కూతురికి, భార్యకు, కుటుంబం మొత్తానికి క్షమాపణలు చెబుతున్నా. నన్ను మీ సోదరుడిలా భావించి క్షమించండి. నా వల్ల కుటుంబం, పిల్లలు ఎలాంటి ఇబ్బందులూ పడకూడదనే ఈ వీడియోలో నా మొహన్ని బ్లర్ చేశాను. నన్ను చూసి కాకపోయినా, నా కుటుంబాన్ని చూసైనా క్షమించండ`ని సదరు నెటిజన్ విజ్ఞప్తి చేశాడు. 

Updated Date - 2020-10-27T21:42:24+05:30 IST