టాలీవుడ్‌ తారలు.. బాలీవుడ్‌ భామలు

ABN , First Publish Date - 2020-12-21T07:16:32+05:30 IST

మంచి జోరుమీదున్నారు తెలుగు హీరోయిన్లు టాలీవుడ్‌ పునాదులతో బాలీవుడ్‌లో ఎదుగుతున్నారు తెలుగులో హీరోయిన్‌గా చేస్తూనే...

టాలీవుడ్‌ తారలు.. బాలీవుడ్‌ భామలు

మంచి జోరుమీదున్నారు తెలుగు హీరోయిన్లు టాలీవుడ్‌ పునాదులతో బాలీవుడ్‌లో ఎదుగుతున్నారు తెలుగులో హీరోయిన్‌గా చేస్తూనే, హిందీలోనూ కథానాయికలుగా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అటూ, ఇటూ బిజీగా గడుపుతున్న అందాల భామలపై ఓ లుక్కేద్దాం...


ఒక తెలుగుచిత్ర ం, ఒక బాలీవుడ్‌ చిత్రం అన్నట్టుగా సాగుతోంది పూజా హెగ్డే సినీ కెరీర్‌. ప్రస్తుతం తెలుగులో అఖిల్‌ సరసన ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రం చేస్తున్నారు. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారామె! ‘ఖబీ ఈద్‌ ఖబీ దివాలీ’ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా ఎంపికయ్యారు పూజ. ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ కూడా ఆమె ఖాతాలో ఉంది. 


రకుల్‌ రాక్స్‌ 

తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో రాకింగ్‌ అంటూ బిజీగా ఉన్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. తెలుగులో పంజా వైష్ణవ్‌తేజ్‌తో ఓ సినిమా, ‘చెక్‌’ సినిమాలో నితిన్‌ సరసనా నటిస్తున్నారు. తమిళంలోనూ ఆమె బిజీగా ఉన్నారు. అక్కడ ఆమె చేతిలో ‘అయలాన్‌’, ‘ఇండియన్‌ 2’ చిత్రాలున్నాయి. హిందీలో అర్జున్‌ కపూర్‌ సరసన ‘సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌సన్‌’, అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో అజయ్‌ దేవ్‌గణ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘మేడే’, జాన్‌ అబ్రహం కథానాయకుడుగా తెరకెక్కుతోన్న ‘ఎటాక్‌’ చిత్రాల్లోనూ రకుల్‌ నటిస్తున్నారు. 


స్టార్‌హీరోతో షాలిని 

‘అర్జున్‌రెడ్డి’తో తెలుగు ప్రేక్షకులను అలరించారు షాలినీపాండే. తాజాగా ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో రణ్‌వీర్‌సింగ్‌ సరసన ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఆమిర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ బాలీవుడ్‌ అరంగేట్ర చిత్రంలోనూ షాలీనిపాండేను కథానాయికగా తీసుకున్నారని సమాచారం.  


హిందీలోనూ తమన్న మెరుపు

మిల్కీబ్యూటీ తమన్నా తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతున్నారు. ఓ పక్క వెబ్‌ సిరీస్‌లతోనూ బిజీగా ఉన్నారామె. తెలుగులో ‘ఎఫ్‌ 3’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘అంధాధున్‌’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్‌లో నవాజుద్దీన్‌ సిద్దిఖీ సరసన ఆమె నటించిన ‘బోలె చూడియా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. జాన్‌ అబ్రహంతో చేసిన ‘చోర్‌ నికల్‌ కే భాగా’ వచ్చే ఏడాది అక్టోబర్‌లో విడుదలవుతోందని సమాచారం. 


ఓటీటీలోకి సమంత

2011లో ‘ఏం మాయ చేశావే’ హిందీ రీమేక్‌ ‘ఏక్‌ దీవానా థా’ చిత్రంలో అతిథి పాత్రతో సమంత బాలీవుడ్‌ అరంగేట్రం చేశారు. అ తర్వాత సమంత దక్షిణాదిన ఫుల్‌ బిజీ అయ్యారు. ఇప్పుడు ఆమె చూపు బాలీవుడ్‌ వైపు మళ్లిందని సమాచారం. అయితే ఈసారి ఆమె అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ హిట్‌ సిరీస్‌ ‘ఫ్యామిలీమ్యాన్‌’ సీజన్‌ 2లో వెబ్‌ సిరీస్‌లో నెగెటివ్‌ రోల్‌తో అడుగుపెట్టారు. మున్ముందు బాలీవుడ్‌ మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా చేసే అవకాశం కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 


కీర్తీ సురేశ్‌కు కలిసి రాలేదు

బాలీవుడ్‌ అరంగేట్రానికి సిద్ధమయ్యారు మహానటి ఫేం కీర్తీ సురేశ్‌. అజయ్‌ దేవ్‌గణ్‌ సరసన ‘మైదాన్‌’ చిత్రంలో కీర్తిసురేష్‌ నటించాల్సి ఉంది. అయితే అజయ్‌ సరసన 28 ఏళ్ల కీర్తిసురేశ్‌ చిన్న పిల్లలా కన్పిస్తుందని భావించి దర్శక నిర్మాతలు అమిత్‌ శర్మ, బోనీకపూర్‌ ఆమె స్థానంలో ప్రియమణిని తీసుకున్నారు. కీర్తికి బాలీవుడ్‌ ప్రయత్నాలు కలిసి రాలేదని అంటున్నారు.


కాజల్‌, త్రిష, శ్రియలకు కలిసొచ్చింది

త్రిష డైరెక్ట్‌గా హిందీ చిత్రం చేయడం లేదు. కానీ ఆ లోటును మణిరత్నం దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రం తీరుస్తోంది. హిందీలోనూ విడుదలవుతోన్న ఈ చిత్రంలో త్రిష కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే తమిళ దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తోన్న ‘భారతీయుడు2’లో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. శంకర్‌ చిత్రాలకు హిందీలోనూ మంచి ఆదరణ ఉంటుంది. కాబట్టి కాజల్‌ అగర్వాల్‌ ఖాతాలో ఓ బాలీవుడ్‌ చిత్రం పడినట్టే. దీంతో పాటు ఆమె జాన్‌ అబ్రహంతో ‘ముంబై సాగా’ చిత్రం చేస్తున్నారు. తెలుగులో ‘గమనం’, ‘ఆటానాదే వేటానాదే’, ‘నరకాసురుడు’ చిత్రాలు చేస్తున్నారు శ్రియ. బాలీవుడ్‌లో ప్రకాశ్‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తడ్కా’ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. 


శ్రుతి చేస్తున్నారు

శ్రుతీహాసన్‌ తెలుగులో రవితేజ సరసన క్రాక్‌, పవన్‌కల్యాణ్‌తో ‘వకీల్‌సాబ్‌’’ చిత్రాలు చేస్తున్నారు. వీటితో పాటు ఓ బాలీవుడ్‌ చిత్రం అంగీకరించినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రుతి చెప్పారు. 


బాలీవుడ్‌కు షిఫ్టయ్యారు

ఒకప్పుడు తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగిన ఇలియానా ఇప్పుడు హిందీ చిత్రాలే చేస్తున్నారు. 2018లో రవితేజ సరసన చేసిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ తర్వాత తెలుగు చిత్రం చేయలేదు. ప్రస్తుతం ఆమె అభిషేక్‌ బచ్చన్‌ సరసన నటించిన ‘బిగ్‌ బుల్‌’, రణ్‌దీప్‌ హుడాతో చేసిన ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకప్పుడు వరుసపెట్టి తెలుగు చిత్రాలు చేసిన తాప్సీ ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. బాలీవుడ్‌లో వచ్చిన ఏ అవకాశాన్ని ఆమె వదులుకోవడం లేదు. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు ఇప్పుడామె కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. తాప్సీ ప్రస్తుతం హిందీలో ‘రష్మీరాకెట్‌’, ‘లూప్‌ లపేటా’, ‘శభాష్‌ మిథూ’, ‘హసీన్‌ దిల్‌రుబా’ చిత్రాలు చేస్తున్నారు.

Updated Date - 2020-12-21T07:16:32+05:30 IST