ఆ పది రోజులూ ఒంటరిగానే ఉన్నా!
ABN , First Publish Date - 2020-04-16T10:03:26+05:30 IST
‘‘మన దేశంలో సమస్య ఉంది. అయుతే... ఇంటి దగ్గర ఉండి కూడా మనల్ని మనం ఫిట్‌గా, రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే... లాక్‌డౌన్ తొలగించిన తర్వాత షూటింగులకు పిలుస్తారు..

‘‘మన దేశంలో సమస్య ఉంది. అయుతే... ఇంటి దగ్గర ఉండి కూడా మనల్ని మనం ఫిట్‌గా, రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే... లాక్‌డౌన్ తొలగించిన తర్వాత షూటింగులకు పిలుస్తారు. వెళ్లాలి. అందుకని, నేను ఇంటి దగ్గరే వ్యాయమం చేస్తున్నా. ఇవి సెలవులు కాదు, కదా? లాక్‌డౌన్’’ అని కథానాయిక అమైరా దస్తూర్ అన్నారు. తెలుగులో ‘మనసుకు నచ్చింది’, ‘రాజుగాడు’ చిత్రాల్లో నటించారీమె. ప్రస్తుతం హిందీలో ఓ సినిమా, దక్షిణాదిలో రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో తాను ఏం చేస్తున్నదీ అమైరా దస్తూర్ వివరించారిలా...
నాన్న డాక్టర్. నేను ఆయనతో ఉండకూడదని కోరుకున్నారు. అందువల్ల, వందశాతం సురక్షితంగా ఉంటానని భావించారు. అందుకని, లాక్‌డౌన్ మొదలైన పది రోజులూ ఇంటిలో నేను ఒంటరిగానే ఉన్నాను. పదకొండో రోజున నా చిన్నతనంలో మేం ఉన్న ఇంటికి నాన్న నన్ను తీసుకువెళ్లారు. అక్కడికి ఐదేళ్లుగా నేను వెళ్లనే లేదు.
లాక్‌డౌన్ టైమ్‌లో ఫ్రస్ట్రేషన్ రాకుండా ఉండటానికి ప్రతిరోజూ వర్కవుట్స్ చేస్తున్నా. నా దగ్గర ఇంట్లో వెయిట్స్ ఫుల్ సెట్ ఉంది. కార్డియో కోసం స్కిప్పింగ్ చేస్తున్నా. మిగతా సమయాల్లో కుటుంబ సభ్యులతో బోర్డ్ గేమ్స్ ఆడుతున్నా. మేమంతా కలిసి టీవీ చూస్తున్నాం. నా తల్లిదండ్రులు కిందకు దిగడం లేదు. నేనే వెళ్లి కాయగూరలు కొంటున్నా.
నేను పని రాక్షసిని. ఒక్క రోజు విశ్రాంతి తీసుకోవడం కూడా ఇష్టం ఉండదు. సెట్‌లో ఉండడమంటే ఇష్టం. పని చేస్తేనే జీవితంలో ఏదో సాధించానన్న తృప్తి ఉంటుంది. ‘ఈ రోజు నువ్వు ఏం చేశావన్నది నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది’ అని చెబుతారు కదా! అందువల్ల, ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు. సెట్‌లో సహాయ దర్శకులతో ముచ్చట్లు చెప్పడం, నా కో-స్లార్లు, దర్శకులు... ప్రాక్టీస్ సెషన్స్, రిహార్సల్స్... అన్నీ మిస్ అవుతున్నా. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మళ్లీ షూటింగులతో బిజీ అవుతా.
లాక్‌డౌన్‌కి ముందు ‘డోంగ్రీ టు దుబాయ్’ వెబ్ సిరీస్, ‘కోయి జానే నా’ సినిమా షూటింగుల్లో పాల్గొన్నా. అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘తాండవ్’ చిత్రీకరణ పూర్తి చేశా. ‘డోంగ్రీ టు దుబాయ్’ క్రైమ్ డ్రామా. కెకె మీనన్, అవినాష్ తివారీ, అంగిరా ధర్ నటిస్తున్నారు. ‘కోయి జానే నా’ రొమాంటిక్ మర్డర్ మిస్టరీ. కునాల్ కపూర్ హీరో. జూన్‌లో విడుదల చేద్దామనుకున్నారు. ఇప్పుడు వాయిదా పడుతుందని అనుకుంటున్నా. నా షెడ్యూల్ ప్రకారం... మార్చి 14న ఒక సౌత్ సినిమా షూటింగ్ కోసం చెన్నై వెళ్లాల్సింది. అదృష్టవశాత్తూ... ఆ షూటింగ్ వాయిదా పడింది. లేదంటే అక్కడ నేను ఒంటరిగా ఉండాల్సి వచ్చేది.
ఖాళీ ఎక్కువ దొరకడంతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు బాగా చూస్తున్నా. నెట్‌ఫ్లిక్స్‌లో ‘షీ’ చూశా. విజయ్ వర్మ బాగా చేశాడు. అది ఫెంటాస్టిక్ షో. ‘టైగర్ కింగ్’ చూస్తూ ఎంజాయ్ చేశా. ప్రస్తుతం ‘ది వాకింగ్ డెడ్’ చూస్తున్నా. అందరూ నన్ను స్వీట్, క్యూట్ అమ్మాయి అనుకుంటారు. కానీ నాకు వయిలెంట్ థ్రిల్లర్స్, పొలిటికల్ డ్రామాలు చూడడం ఇష్టం. త్వరలో ‘అంగ్రేజీ మీడియమ్’ చూడాలనుకుంటున్నా. ఆ సినిమా థియేటర్లలో చూసే అవకాశం దక్కలేదు. మాది పార్శీ ఫ్యామిలీ. మా ఇంట్లో ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువ చూస్తారు. చిన్నతనం నుండి నేనూ ఇంగ్లిష్ చిత్రాలు చూస్తూ పెరిగా. ఇప్పుడు మా ఇంట్లోవాళ్లకు నేను హిందీ సినిమాలు అలవాటు చేస్తున్నా.
Read more