ఈ విజయం చాలామందికి జవాబు

ABN , First Publish Date - 2020-02-26T05:37:07+05:30 IST

‘‘నితిన్‌ నవ్వించాడనీ, బాగా చేశాడని చెబుతుంటే సంతోషంగా ఉంది. నేను చేసిందల్లా వెంకీని కాపీ కొట్టడమే. దర్శకుడు చెప్పింది చేశాను కాబట్టే నా నటన బావుందంటున్నారు...

ఈ విజయం చాలామందికి జవాబు

‘‘నితిన్‌ నవ్వించాడనీ, బాగా చేశాడని చెబుతుంటే సంతోషంగా ఉంది. నేను చేసిందల్లా వెంకీని కాపీ కొట్టడమే. దర్శకుడు చెప్పింది చేశాను కాబట్టే నా నటన బావుందంటున్నారు. మా చిత్రబృందమంతా ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న విజయమిది. నాకు నాలుగేళ్ల తర్వాత విజయం వచ్చింది. ‘భీష్మ’ కోసం వెంకీ చాలా కష్టపడ్డాడు. ఈ విజయంతో చాలామందికి అతను జవాబు చెప్పాడు’’ అని నితిన్‌ అన్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌, రష్మిక జంటగా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీష్మ’ ఈ నెల 21న విడుదలైంది. హైదరాబాద్‌లో మంగళవారం విజయోత్సవం నిర్వహించారు. చిత్రాన్ని పంపిణీ చేసిన ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ ‘‘నితిన్‌తో ‘శ్రీనివాస కల్యాణం’ చేశాం. విజయం అందుకోవాలనుకున్నాం. కానీ, కుదరలేదు. చిత్రంలో మంచి వినోదం, బలమైన కథాంశం ఉంటే ప్రేక్షకులు విజయం అందిస్తారని ‘ప్రతిరోజూ పండగే’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల... వైకుంఠపురములో’, ఇప్పుడు ‘భీష్మ’ నిరూపించాయి. ‘ఛలో’, ‘భీష్మ’ విజయాలతో వెంకీ కుడుముల హ్యాట్రిక్‌కి సిద్ధమవుతున్నాడు. హీరోలతో పోటీ పడుతూ రష్మిక డ్యాన్స్‌ చేస్తోంది. చక్కగా నటిస్తోంది. యువత చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు’’ అన్నారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘‘మా నిర్మాతలు చినబాబు, వంశీ, హీరో నితిన్‌ నా కథను నమ్మి ఈ చిత్రం చేసే అవకాశం ఇచ్చారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో చిత్రాన్ని అనుకున్నట్టు తీయగలిగా’’ అన్నారు. నితిన్‌ మాట్లాడుతూ ‘‘మహతీ స్వరసాగర్‌ నేపథ్య సంగీతం చిత్రానికి పెద్ద బలం. కాసర్ల శ్యామ్‌, శ్రీమణి మంచి పాటలిచ్చారు. ‘ఛలో’తో వెంకీకి, ఈ చిత్రంతో నాకు రష్మిక బ్రేక్‌ ఇచ్చింది. తనతో కంటే సంపత్‌ రాజ్‌తో నా కెమిస్ట్రీ బావుందని చాలామంది చెప్పారు. ‘అ ఆ’తో నాకు భారీ విజయం అందించిన సంస్థలో మరో విజయం వచ్చింది. ఈ నిర్మాతలతో మరెన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మహతీ స్వరసాగర్‌, నటులు ‘శుభలేఖ’ సుధాకర్‌, సంపత్‌రాజ్‌, ఛాయాగ్రాహకుడు సాయిశ్రీరామ్‌, కళా దర్శకుడు సాహి సురేశ్‌, గేయ రచయితలు కాసర్ల శ్యామ్‌, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-26T05:37:07+05:30 IST