ఓ అమ్మాయి ఛాలెంజింగ్‌ జర్నీ ఇది

ABN , First Publish Date - 2020-11-03T10:24:21+05:30 IST

‘‘మహానటి’ సక్సెస్‌తో నటిగా నేను ఎంతో సాధించానని చాలామంది అనుకుంటారు. అయితే నేను చేయాల్సిన పాత్రలు, నిరూపించుకోవాలసింది...

ఓ అమ్మాయి ఛాలెంజింగ్‌ జర్నీ ఇది

‘‘మహానటి’ సక్సెస్‌తో నటిగా నేను ఎంతో సాధించానని చాలామంది అనుకుంటారు. అయితే నేను చేయాల్సిన పాత్రలు, నిరూపించుకోవాలసింది ఇంకా చాలా ఉంది’’ అని కీర్తీ సురేశ్‌ అన్నారు. తాజాగా ఆమె నటించిన ‘మిస్‌ ఇండియా’ చిత్రం ఈ నెల నాలుగో తేదిన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా కీర్తీ సురేశ్‌ జూమ్‌ కాల్‌లో సినిమా విశేషాల గురించి ముచ్చటించారు. 


‘మహానటి’ సక్సెస్‌ తర్వాత నటిగా నా బాధ్యత మరింత పెరిగింది. కమర్షియల్‌ సినిమాల వైపు అడుగేయాలని నిర్ణయించుకున్న సమయంలో లేడీ ఓరియెంటెడ్‌ సినిమా అవకాశాలే ఎక్కువగా వచ్చాయి. ఆ క్రమంలోనే ‘మిస్‌ ఇండియా’ సినిమా అంగీకరించా. 


ఎలా ఎదిగింది...

వ్యాపారరంగంలో రాణించాలనే కలలు కనే ఓ మధ్య తరగతి అమ్మాయి విదేశాలకు వెళ్లి అక్కడ టీ బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తుంది. ఆ జర్నీలో ఎదురైన సవాళ్లను అధిగమించి వ్యాపార రంగంలో ఎలా ఎదిగింది అన్నది ఈ సినిమా ఇతివృత్తం. దర్శకుడు నరేంద్రనాథ్‌కి తొలి చిత్రమిది. అతని నెరేషన్‌, విజన్‌ నచ్చింది. అందుకే ఈ సినిమా చేశా. నేను ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయిని. అక్కడ నేర్చుకున్న ఎన్నో అంశాలు ఇప్పుడు నాకు ఉపయోగపడుతున్నాయి. 


స్లిమ్‌ అవ్వడం ప్లస్‌..

‘మహానటి’కి తర్వాత వర్కవుట్స్‌ మొదలుపెట్టా. అయితే స్లిమ్‌గా కావడానికి ‘మిస్‌ ఇండియా’ కూడా ఓ కారణం.  ఈ కథకు తగ్గట్టు ఏ డ్రెస్‌ వేసిన ఫిట్‌గా ఉండాలని దర్శకుడు చెప్పడంతో స్లిమ్‌ అయ్యా. ఈ కథకు నేను న్యాయం చేస్తానని నమ్మి మహేశ్‌ కోనేరు నాకీ అవకాశం ఇచ్చారు. 


వెబ్‌ సిరీస్‌లకూ సిద్ధమే..

నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని తపన పడుతుంటా. అయితే చాలామంది నేనేదో సాధించేశానని అనుకుంటున్నారు. కానీ నేను చేయాల్సిన పాత్రలు, నిరూపించుకోవలసింది. చాలా ఉంది. ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నా. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ పెరుగుతున్న తరుణంలో వెబ్‌ సిరీస్‌లు చేయడానికి అయినా నేను సిద్థమే. అయితే మంచి కథ ఉండాలి. మహేశ్‌తో నటించబోతున్న ‘సర్కారువారిపాట’ సినిమా సెట్‌లో జనవరిలో అడుగుపెడతా. ‘గుడ్‌ లక్‌ సఖి’ కూడా త్వరలోనే విడుదల కానుంది.  తమిళ చిత్రం ‘అణ్ణాత్తే’తోపాటు రెండు తెలుగు చిత్రాలు చర్చల్లో ఉన్నాయి.

Updated Date - 2020-11-03T10:24:21+05:30 IST