అసలుకు ఎసరు!

ABN , First Publish Date - 2020-11-04T07:18:26+05:30 IST

సినిమా చిన్నదైనా, పెద్దదైనా హీరో క్లాస్‌ అయినా మాస్‌ అయినా...

అసలుకు ఎసరు!

సినిమా చిన్నదైనా, పెద్దదైనా 

హీరో క్లాస్‌ అయినా మాస్‌ అయినా...

కథ లోకల్‌ అయినా నాన్‌లోకల్‌ అయినా...

ప్రేక్షకుడిని థియేటర్‌కు  తీసుకురావడంలో టైటిల్‌ కీలకపాత్ర పోషిస్తుంది.


అందుకే క్యాచీ టైటిల్‌ కోసం దర్శకనిర్మాతలు తంటాలు పడుతుంటారు. ఏరికోరి ఎంచుకొన్న టైటిల్‌ను మార్చడానికి సాధారణంగా  ఏ నిర్మాత ఇష్టపడడు.  టైటిల్‌ విషయంలో పట్టు విడవకుండా కొందరు  నిర్మాతలు కోర్టులకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం జనాభిప్రాయానికి తలొగ్గి పేరు మార్చుకొన్న సంఘటనలు లేకపోలేదు. 

ఈ దశాబ్దంలో అలా  టైటిల్‌ మార్చుకున్న  బాలీవుడ్‌ చిత్రాలు ఓ పది ఉన్నాయి. అవేమిటో చూద్దాం


 ‘బిల్లు’ (2009)

షారూఖ్‌ ఖాన్‌, ఇర్ఫాన్‌ఖాన్‌, లారాదత్తా నటించిన ‘బిల్లు’ చిత్రానికి మొదట అనుకొన్న  టైటిల్‌ ‘బిల్లు బార్బర్‌’. అయితే  టైటిల్‌లోని బార్బర్‌ అనే పదం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ హెయిర్‌స్టైలిస్ట్‌ అసోసియేషన్లు నిరసన వ్యక్తం చేశాయి. టైటిల్‌ నుంచి బార్బర్‌ అనే పదం తొలగించాలి లేదా దాని బదులు హెయిర్‌డ్రెస్సర్‌ అనే పదం వాడాలని డిమాండ్‌ చేశాయి. చివరికి నిర్మాతలు చిత్రం పేరులో బార్బర్‌ పదం తొలగించి  ‘బిల్లు’గా మార్చారు. 


‘గోలియోంకీ రాస్‌లీలా రామ్‌-లీలా’  (2013)

సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌వీర్‌సింగ్‌, దీపికా పడుకోన్‌ జంటగా తెరకెక్కిన ‘గోలియోంకీ రాస్‌లీలా రామ్‌-లీలా’ చిత్రం టైటిల్‌ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  మూడుసార్లు మారింది. మొదట ఈ చిత్రానికి ‘రామ్‌లీలా’ అనే పేరు పెట్టారు. టైటిల్‌ చూసి‘ ఇది శ్రీరాముడి కథగా ప్రజలు పొరబడే అవకాశం ఉంది,  దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి’ అంటూ  నిర్మాతలపైన కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దాంతో టైటిల్‌ను ‘రామ్‌-లీలా’ అని మార్చారు. తీరా సినిమా విడుదలకు ముందు మరోసారి వివాదం తలెత్తడంతో  ‘గోలియోంకీ రాస్‌లీలా రామ్‌-లీలా’ అని  మార్చి విడుదల చేశారు. 


‘సింగ్‌సాబ్‌ ద గ్రేట్‌’ (2013)

సిక్కు ధార్మిక సంస్థ అకాల్‌ తక్త్‌ అభ్యంతరం చెప్పడంతో సన్నీడియోల్‌ నటించిన ‘సింగ్‌ సాహిబ్‌ ద గ్రేట్‌’ సినిమా టైటిల్‌ కాస్తా ‘సింగ్‌ సాబ్‌ ద గ్రేట్‌’గా మారింది. ప్రముఖ సిక్కు మఠాధిపతుల గౌరవార్థం వారి పేరు ముందు మాత్రమే సాహిబ్‌ అనే పదం వాడాలి. సినిమా టైటిల్‌లో సాహిబ్‌ అనే పదం వాడడం సిక్కు సంప్రదాయాలను ఉల్లంఘించడమేనని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో  టైటిల్‌లో చిన్న మార్పు చేసి సినిమాను విడుదల చేశారు. 


‘ఆర్‌... రాజ్‌కుమార్‌’  (2013)

షాహిద్‌ కపూర్‌ నటించిన ‘ఆర్‌...రాజ్‌కుమార్‌’ చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్‌ ‘రాంబో రాజ్‌కుమార్‌’. అయితే తమ పాపులర్‌ బ్రాండ్‌ నేమ్‌ను వాడుకుంటున్నారు అంటూ హాలీవుడ్‌ ‘రాంబో’ చిత్ర నిర్మాతల నుంచి అభ్యంతరాలు రావడంతో చిత్రం టైటిల్‌ను ‘ఆర్‌...రాజ్‌కుమార్‌’గా మార్చారు. సినిమాలో  హీరో షాహిద్‌కపూర్‌ పాత్ర పేరులో  రాంబోను తొలగించి రాజ్‌కుమార్‌ మాత్రమే ఉంచారు. 


‘టోటల్‌ సియపా’  (2014)

అలీ జాఫర్‌, యామీ గౌతమ్‌ జంటగా నటించిన చిత్రం ‘టోటల్‌ సియపా’. కానీ  ఈ సినిమాకు ముందు అనుకున్న టైటిల్‌ ‘అమన్‌ కీ ఆశా’. అయితే రెండు ప్రచురణ సంస్థలు ఈ టైటిల్‌ మీద అభ్యంతరం చెప్పాయి. ఇండియా, పాకిస్థాన్‌ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంచేందుకు ‘అమన్‌ కి ఆశా’ పేరుతో  ప్రారంభించిన సామాజిక కార్యక్రమ నిర్వాహకులు ఆ టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో  టైటిల్‌ను ‘టోటల్‌ సియపా’గా మార్చారు. 


‘మద్రాస్‌ కేఫ్‌’  (2014)

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో జాన్‌అబ్రహం కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం ‘మద్రాస్‌ కేఫ్‌’. చిత్ర కథాంశంపైన తమిళ సంఘాల అభ్యంతరాల నేపథ్యంలో ముందుగా అనుకున్న ‘జాఫ్నా’ టైటిల్‌ను ‘మద్రాస్‌ కేఫ్‌’గా మార్చారు. అయినా ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల కాకుండా నిషేధించారు. 


‘లవ్‌ యాత్రీ’ (2018)

సల్మాన్‌ఖాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ భర్త ఆయుష్‌శర్మ బాలీవుడ్‌ అరంగేట్ర చిత్రం ‘లవ్‌ యాత్రీ’. ఈ చిత్రానికి ముందు నిర్ణయించిన  టైటిల్‌ ‘లవ్‌రాత్రి’. హిందువులు నిర్వహించే  నవరాత్రులను వేలాకోళం చేసేలా ఈ సినిమా టైటిల్‌ ఉదంటూ  ఓ లాయరు పిటిషన్‌ వేశారు. కోర్టు కూడా నిర్మాతల మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశించడంతో సల్మాన్‌ఖాన్‌ రంగంలోకి దిగి సినిమా పేరును ‘లవ్‌యాత్రీ’గా మార్చినట్టు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. 


‘పద్మావత్‌’  (2018)

దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పద్మావత్‌’. రణ్‌వీర్‌సింగ్‌, షాహిద్‌ కపూర్‌, దీపికా పదుకోన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. పద్మావత్‌ పేరును టైటిల్‌గా పెట్టి తమ ఆడపడుచుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారంటూ రాజ్‌పుత్‌ సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తంచేసింది. పెద్దఎత్తున వివాదం చెలరేగింది. కర్ణిసేన కార్యకర్తలు సినిమా సెట్స్‌లోకి చొరబడి భౌతిక దాడులకు దిగారు. సినిమాలో వాడిన దుస్తులు, పాటలపైన కూడా అభ్యంతరాలు చెప్పారు. చాలా కాలం వివాదం కొనసాగిన తర్వాత సినిమా విడుదలకు ముందు  ‘పద్మావతి’ పేరును  ‘పద్మావత్‌’గా మార్చారు.


‘జడ్జిమెంటల్‌ హై క్యా’ (2019)

కంగనా రనౌత్‌, రాజ్‌కుమార్‌ రావు జంటగా నటించిన ‘జడ్డిమెంటల్‌ హై క్యా’ చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్‌ ‘మెంటల్‌ హై క్యా’. మానసిక అనారోగ్యంతో బాధపడేవారిని అవమానించేలా,  వారిపట్ల వివక్షను పెంచేలా ఈ టైటిల్‌ ఉందంటూ ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ సెన్సార్‌బోర్డుకు ఫిర్యాదు చేయడంతో నిర్మాతలు టైటిల్‌ మార్చారు.  


‘లక్ష్మి (2020)

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌, కియారా అడ్వాణీ జంటగా నటించిన చిత్రం ‘లక్ష్మి’. కరోనా-లాక్‌డౌన్‌ తర్వాత ఎంతో ఉత్సాహంతో సినిమాను విడుదల చేయడానికి సిద్ధమైన చిత్ర బృంధానికి  అనుకోని షాక్‌ ఇచ్చాయి హిందూ సంఘాలు, కర్ణిసేన. ‘‘లక్ష్మీబాంబ్‌’ టైటిల్‌ హిందువుల ఆరాధ్య దేవత లక్ష్మీదేవిని అవమానించేలా ఉంది, దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి’’ అని అభ్యంతరం చెప్పాయి. ‘లక్ష్మీబాంబ్‌’ చిత్రంతో పాటు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీ వేదికను కూడా బహిష్కరించాలని నెటిజన్లు సోషల్‌ మీడియాలో పిలుపునిచ్చారు. నిర్మాతలు వేగంగా స్పందించి వివాదాన్ని పెద్దది చేయకుండా ‘లక్ష్మీబాంబ్‌’ టైటిల్‌ను ‘లక్ష్మి’గా మార్చారు. నిరసనలు చల్లారాయి. ముందు ప్రకటించినట్టే ఈ నెల తొమ్మిదిన చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2020-11-04T07:18:26+05:30 IST