‘మహాసముద్రం’ మొదలైంది

ABN , First Publish Date - 2020-12-08T07:03:21+05:30 IST

శర్వానంద్‌, సిద్థార్థ్‌ హీరోలుగా అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. సోమవారం హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో...

‘మహాసముద్రం’ మొదలైంది

శర్వానంద్‌, సిద్థార్థ్‌ హీరోలుగా అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. సోమవారం హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదటి షెడ్యూల్‌ మొదలైంది. ఈ విషయాన్ని దర్శకుడు అజయ్‌భూపతి ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. టైటిల్‌ పోస్టర్‌తో పాటు, సెట్స్‌ను పర్యవేక్షిస్తున్న ఫొటోను ఆయన షేర్‌ చేశారు. ‘‘ఈ ఉద్రేకభరిత లవ్‌ స్టోరీని, అసాధారణ క్యారెక్టరైజేషన్స్‌తో ఇంటెన్స్‌ డ్రామాను చూపించడానికి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను. తప్పకుండా మీరు ఈ చిత్రాన్ని ప్రేమిస్తారు’’ అని అజయ్‌ భూపతి పేర్కొన్నారు. ‘‘ఓ డిఫరెంట్‌ కథతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నా. పంచుకోవడానికి చాలా ఉన్నాయి. టచ్‌లో ఉంటే చెప్తా’’ అని సిద్ధార్థ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అదితి రావ్‌ హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.


మిస్టరీ థ్రిల్లర్‌..
సతీష్‌ మాలెంపాటి దర్శకత్వంలో తెలుగు, కన్నడ, తమిళ భాషలలో తెరకెక్కుతున్న చిత్రం ‘సమిధ’. కన్నడ శశికుమార్‌ తనయుడు అక్షిత్‌ శశికుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనువర్ణ, చాందిని నాయికలు. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ఆశిష్‌ క్లాప్‌ కొట్టగా రాజేంద్రప్రసాద్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. సతీష్‌ మాలెంపాటి మాట్లాడుతూ ‘‘రాజస్థాన్‌లో జరిగిన యధార్థ గాథని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సినిమా తీస్తున్నాం. రెండు గంటల పాటు ట్విస్ట్‌లు, టర్న్‌లు చేజింగులు, యాక్షన్‌ సీన్స్‌తో పక్కా కమిర్షియల్‌ సినిమాగా తెరకెక్కిస్తున్నాం’’ అని అన్నారు. ‘‘మంగళవారం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. హైదరాబాద్‌, చైన్నె, బెంగుళూరు ప్రాంతాల్లో షూటింగ్‌ జరపనున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు.

Updated Date - 2020-12-08T07:03:21+05:30 IST