అభిమానులు గుడి కట్టేశారు!

ABN , First Publish Date - 2020-10-21T10:46:01+05:30 IST

అభిమానుల దృష్టిలో వాళ్ల అభిమాన హీరోలు దేవుళ్లే! గుండెలో గుడి కట్టుకొని ఆరాధిస్తుంటారు. వాళ్ల గురించి చెడుగా కామెంట్‌ చేసినా, తూలనాడినా ఫ్యాన్స్‌ సహించరు...

అభిమానులు గుడి కట్టేశారు!

అభిమానుల దృష్టిలో వాళ్ల అభిమాన హీరోలు దేవుళ్లే! గుండెలో గుడి కట్టుకొని ఆరాధిస్తుంటారు. వాళ్ల గురించి చెడుగా కామెంట్‌ చేసినా, తూలనాడినా ఫ్యాన్స్‌ సహించరు. తిట్టి ఊరుకోకుండా భౌతిక దాడి చేయడానికైనా వెనుకాడరు. ఇక తమ అభిమాన హీరో నటించిన సినిమా విడుదల రోజున ఫ్యాన్స్‌ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. భారీ కటౌట్లు పెట్టడం, పాలాభిషేకాలు చేయడం.. ఒకటనేమిటి చాలా చేస్తుంటారు. ఈ అభిమానం పీక్స్‌కు చేరితే ఏకంగా  గుడి కట్టి పూజలు నిర్వహిస్తుంటారు.  భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇలా కొంతమంది స్టార్స్‌కు  గుళ్లు కటి, భారీ విగ్రహాలు పెట్టి ఆరాధిస్తున్నారు. అభిమానుల్ని అంతగా ప్రభావితం చేసిన తారలెవరో చూద్దాం...


మహానటుడు ఎన్టీఆర్‌ను అభిమానించి, ఆరాధించే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. శ్రీకృష్ణుని పాత్ర పోషణలో ప్రపంచ రికార్డ్‌ నెలకొల్పిన ఎన్టీఆర్‌కు రాజమండ్రికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పడుమూరు గ్రామంలో ఒక గుడి ఉంది. శ్రీకృష్ణుడి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని 1980లో అక్కడ ప్రతిష్టించారు. ఇప్పటికీ ఆ గుడిలో ఈ వెండితెర వేల్పు పూజలు అందుకొంటున్నారు. 


బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. నటుడిగా ఆయన స్టార్‌డమ్‌ అలాంటిది. దేశ వ్యాప్తంగా బిగ్‌బీకు అభిమాన సంఘాలున్నాయి. అయితే కోల్‌కత్తాలో మాత్రం ఆయనకు అభిమానులకంటే భక్తులే ఎక్కువగా ఉన్నారనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే అక్కడ ఆయన కోసం ప్రత్యేకంగా ఓ గుడి కట్టేశారు. రెండు గదులుగా నిర్మించిన ఆ గుడిలోని  మొదటి గదిలో బచ్చన్‌ నటించిన చిత్రాల్లోని ఫొటోలను ఉంచి ఓ మ్యూజియంలాగా తీర్చిదిద్దారు. గర్భాలయంలో పచ్చని ఆకు నమూనాలో ఉన్న సింహానంతో బిగ్‌బీ విగ్రహాన్ని, ఆ పక్కనే ‘అగ్నిపథ్‌’ చిత్రంలో ఆయన ఽధరించిన తెల్లని బూట్లను ఉంచారు. బచ్చన్‌ నటించిన సినిమాల విడుదల సమయంలో, ఆయన పుట్టినరోజున  అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఇలా చేయడం తనకు  ఏమాత్రం ఇష్టం లేదని ఓ సందర్భంలో అమితాబ్‌  తెలిపారు. 


రజనీకాంత్‌ తిరస్కరించారు..

బస్సు కండక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి తమిళనాట సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్‌కు దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు.  ఆయన పేరిట  ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. . తమిళనాడు, కర్ణాటకలో ఆయనకు ఓ గుడి కట్టించాలని అభిమాన సంఘాలు నిర్ణయించుకున్నాయి. అది ఆయన దృష్టికి వెళ్లడంతో సున్నితంగా తిరస్కరించారనీ, అందుకే వెనుకంజ వేశామనీ  రజనీ అభిమానులు చెబుతుంటారు. తమ ఆరాధ్యదైవానికి ఇష్టంలేని పనిచేయడం ఎందుకని తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు అభిమానులు. కాకపోతే కర్నాటకకు చెందిన కొంతమంది అభిమానులు   కోలార్‌ జిల్లాలోని కోటి లింగేశ్వర దేవాలయంలో రజనీ పేరుతో సహస్ర లింగాలను ప్రతిష్టించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నటుడు, దర్శకుడు లారెన్స్‌  రాఘవ తన తల్లి మీద ప్రేమతో తమిళనాడులో 2016లో ఓ గుడి కట్టించారు. రాజస్థాన్‌లో తన తల్లి విగ్రహాన్ని తయారు చేయించి, ఆ గుడిలో ప్రతిష్టించారు.  ‘‘అమ్మ వల్లే నేను ఈ భూమ్మీదకు వచ్చాను. నా తల్లి పేరుతో కట్టిన గుడిని మాతృమూర్తులందరికీ అంకితమిస్తున్నా’’ అని లారెన్స్‌ చెప్పారు. 


విగ్రహం ధ్వంసం చేశారు...

‘కలియుగ పాండవులు’ చిత్రంతో  తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత తమిళంలో కూడా అగ్ర కథానాయికగా వెలిగారు. ముఖ్యంగా తమిళంలో ఆమెకు అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ. ఆరాధ్య దేవతగా ఆమెను అభిమానించేవారు, ఆరాధించేవారు. తిరుచునాపల్లిలోని ఖుష్బూ అభిమానులు ఏకంగా ఆమె పేరు మీద ఓ గుడి కట్టేశారు. దక్షిణాదిన ఓ హీరోయిన్‌కు గుడి కట్టడం అన్నది ఖుష్బుతో నే మొదలైంది. అయితే ఓ సందర్భంలో  ఎయిడ్స్‌ అవగాహనా సదస్సులో ఖుష్భూ చేసిన  వ్యాఖ్యలు ఆమె అభిమానులకూ ఆగ్రహం తెప్పించాయి. కోపం పట్టలేక ఆమె గుడినీ, అందులోని విగ్రహాన్నీ ధ్వంసం చేశారు.  


తమిళనాట క్రేజ్‌ ఉన్న కథానాయికల్లో నమిత ఒకరు. ఆమె గుజరాత్‌ అమ్మాయి అయినా నటిగా తెలుగు, తమిళ భాషా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తమ అభిమాన తార కోసం తమిళనాడు తిరునల్వేలి  జిల్లాలో నమితకు ఓ గుడి కట్టించి తమ అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు. ఖుష్భూ తర్వాత అటువంటి గౌరవం  పొందిన  కథానాయిక నమితే! బబ్లీ బేబీగా గుర్తింపు పొందిన హన్సిక మొత్వానీ తెలుగు, తమిళ సినిమాలతో పాపులర్‌ అయ్యారు.  తమిళనాట ఆమెకు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆ కారణంతోనే అభిమానులు మధురైలో ఆమెకు ఓ గుడి కట్టించి  అంకితం ఇచ్చారు.  

Updated Date - 2020-10-21T10:46:01+05:30 IST