కరెంట్‌ బిల్‌ వచ్చింది... గట్టిగా షాక్‌ కొట్టింది!

ABN , First Publish Date - 2020-06-29T09:52:46+05:30 IST

ముంబై మహానగరంలో నివసిస్తున్న హీరోయిన్లకు అదానీ కంపెనీ ఇస్తున్న కరెంట్‌ బిల్లులు షాకులు మీద షాకులు ఇస్తున్నాయి. సాధారణంగా స్విచ్‌ బోర్డులోని ఫ్లగ్‌లో వేలు పెడితేనో, తెగిపడిన కరెంట్‌ తీగ పట్టుకుంటేనో షాక్‌ కొడుతుంది...

కరెంట్‌ బిల్‌ వచ్చింది... గట్టిగా షాక్‌ కొట్టింది!

ముంబై మహానగరంలో నివసిస్తున్న హీరోయిన్లకు అదానీ కంపెనీ ఇస్తున్న కరెంట్‌ బిల్లులు షాకులు మీద షాకులు ఇస్తున్నాయి. సాధారణంగా స్విచ్‌ బోర్డులోని ఫ్లగ్‌లో వేలు పెడితేనో, తెగిపడిన కరెంట్‌ తీగ పట్టుకుంటేనో షాక్‌ కొడుతుంది. కానీ, అదానీ కంపెనీ దెబ్బకు కరెంట్‌ బిల్‌ చూస్తే షాక్‌ కొడుతోందని హీరోయిన్లు చెబుతున్నారు.

ఒకప్పటి కథానాయిక రాధ కుమార్తె, తెలుగులో ‘జోష్‌’, ‘దమ్ము’, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’ చిత్రాల్లో నటించిన కార్తీకా నాయర్‌ అమాంతం ఎక్కువ వచ్చిన కరెంట్‌ బిల్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘జూన్‌ నెలకు గాను ఎలక్ట్రిసిటీ బిల్‌ దగ్గర దగ్గర లక్ష రూపాయలు వచ్చింది. ముంబైలో అదానీ కంపెనీ ఎటువంటి కుంభకోణానికి పాల్పడుతోంది? ముంబై ప్రజలు నుంచి ఇటువంటి కంప్లయింట్స్‌ చాలా వింటున్నాను’’ అని కార్తీక అన్నారు. ‘మీకు హోటల్‌ ఉందా?’ అని నెటిజన్‌ ప్రశ్నిస్తే... ‘‘అది నా హోటల్‌ బిల్‌ అయితే బావుండేది. కానీ, నా ఇంటికి వచ్చిన కరెంట్‌ బిల్‌’’ అని ఆమె సమాధానం ఇచ్చారు. అల్లు అర్జున్‌ ‘ఆర్య 2’, ప్రభాస్‌ ‘డార్లింగ్‌’, గోపీచంద్‌ ‘మొగుడు’ చిత్రాల్లో రెండో కథానాయికగా నటించిన శ్రద్ధా దాస్‌ సైతం రూ. 34 వేలు కరెంట్‌ బిల్‌ వచ్చిందని నోరెళ్లబెట్టారు. ఆమె కూడా అదానీ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తాప్సీ ఈ జాబితాలో చేరారు.


మా ఇంట్లో ఎవరైనా ఉంటున్నారేమో? : తాప్సీ

‘‘ఏప్రిల్‌లో రూ. 4,390, మేలో రూ. 3,850 బిల్‌ వచ్చింది. జూన్‌కి రూ. 36,000 బిల్‌ పంపారు. గత నెల మా కరెంట్‌ బిల్‌ అంతలా పెరగడానికి మూడు నెలల లాక్‌డౌన్‌ కాలంలో నేను ఏమైనా కొత్త ఎలక్ట్రిక్‌ వస్తువులు కొన్నానా? ఎక్కువ వినియోగించానా? అని ఆశ్చర్యపోయా. అదానీ ఎలక్ట్రిసిటీ ఏ అధికారంతో ఇంత వసూలు చేస్తుంది?’’ అని తాప్సీ ట్వీట్‌ చేశారు. ఓ విధంగా ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టినట్టుందని పేర్కొన్నారామె. ఎవరూ లేని అపార్ట్‌మెంట్‌కి రూ. 8,640 బిల్‌ పంపించడంపై తాప్సీ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘శుభ్రం చేయడానికి వారానికి ఒకసారి వెళ్లడం తప్ప ఈ అపార్ట్‌మెంట్‌లో మేమెవరూ ఉండటం లేదు. మార్చిలో రూ. 570, ఏప్రిల్‌లో రూ. 730 రాగా... మే నెలకి గాను రూ. 8,640 బిల్‌ వచ్చింది. మాకు తెలియకుండా ఎవరైనా మా అపార్ట్‌మెంట్‌ ఉపయోగిస్తున్నారేమోనని ఆందోళన చెందుతున్నా. వాస్తవాలు తెలుసుకోవడంలో మాకు అదానీ కంపెనీ సహకరించింది’’ అని తాప్సీ పేర్కొన్నారు. అంత పవర్‌ బిల్‌ చూసి తన ముఖంలో చిరునవ్వు చెదురుతోందని ఆమె అన్నారు.

Updated Date - 2020-06-29T09:52:46+05:30 IST