పాత్ర ఏదైనా పండించడానికి రెడీ!

ABN , First Publish Date - 2020-10-12T07:32:15+05:30 IST

చిత్ర పరిశ్రమ ఎప్పుడూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు హీరోగా మెప్పించిన వారు ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తారా అన్న అనుమానం...

పాత్ర ఏదైనా పండించడానికి రెడీ!

చిత్ర పరిశ్రమ ఎప్పుడూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు హీరోగా మెప్పించిన వారు ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తారా అన్న అనుమానం మేకర్స్‌కి ఉండదు. పాత్రకు పర్ఫెక్ట్‌ అనుకుంటే వారిని ఎలాగైనా ఒప్పించి పాత్రకు తగ్గట్లు మలచుకుంటారు. వెండితెరకు కొన్నేళ్లు గ్యాప్‌ వచ్చినా యాక్టింగ్‌లో ఈజ్‌ తగ్గలేదని కొందరు నిరూపిస్తున్నారు. పాత్ర ఏదైనా పండించడానికి రెడీ... అంటున్నారు.



‘ఫిదా’తో రీఎంట్రీ

‘మా భూమి’, ‘రంగుల కల’, ‘అంకురం’ వంటి హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు సాయి చంద్‌. కెరీర్‌ బిగినింగ్‌లో ఆయన వైవిధ్యభరిత పాత్రలవైపే అడుగేసేవారు. ‘శివ’(1989) సినిమా తర్వాత వ్యక్తిగత పనులతో బిజీ అయిన ఆయన సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో ఎన్నో అవకాశాలు ఆయన తలుపు తట్టినా తిరస్కరించారు. దాదాపు 28 సంవత్సరాల తర్వాత ‘ఫిదా’ సినిమాతో సాయిచంద్‌ తెలుగుతెరకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఽఆ తర్వాత సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో సుబ్బయ్యగా కీలక పాత్ర పోషించారు. ‘మంచు పల్లకి’(1982) తర్వాత చిరంజీవితో ఆయన నటించిన చిత్రమిది. ‘సైరా’లో చిన్న పాత్రే అయినా చక్కని గుర్తింపు రావడంతో మళ్లీ ఆయనకు అవకాశాలు వరుస కట్టాయి. ‘సైరా’ ముందు సాయిచంద్‌ దాదాపు 30 కథలను రిజెక్ట్‌ చేశారట. ప్రస్తుతం ఆయన నితిన్‌ హీరోగా నటిస్తున్న ‘చెక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. 


మంచి పాత్ర అయితే చాలు...

జయరామ్‌కు మలయాళంలో సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ ఉంది. నటనలో ఆయనకు మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అనే పేరుంది. హీరోగా అవకాశాలు ఉన్నప్పటికీ ఎగ్జైట్‌ చేసే క్యారెక్టర్స్‌ వస్తే యాక్ట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు. ‘భాగమతి’తో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగుతెరకు పరిచయమైన ఆయన ఈ ఏడాది సంక్రాంతి బరిలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో హీరోకి తండ్రిగా నటించారు. ‘‘నటుడిగా ఇలాంటి పాత్రలే చేయాలి అన్న హద్దులేమీ నాకు లేవు. కళకు భాషతో పనిలేదు. ఏ భాషలోనైనా మంచి పాత్ర దక్కితే నటించడానికి సిద్ధంగా ఉన్నా. ఇకపై తెలుగులోనూ నటుడిగా కొనసాగుతా’’ అని జయరామ్‌ అంటున్నారు. 


డిప్యూటీ కలెక్టర్‌ టూ ఆర్టిస్ట్‌...

ప్రతిభ ఉన్నవారిని చిత్ర పరిశ్రమ అక్కున చేర్చుకుంటుంది. నాన్‌ రెవెన్యూ కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పని చేసిన డా.సత్యసాయి శ్రీనివాస్‌కు నటన అంటే ఆసక్తి. కానీ సినిమా నేపథ్యం, నటన మీద అవగాహన లేదు. నాన్‌ రెవెన్యూ నుంచి ఐఏఎస్‌కి ఆయన పేరు వెళ్లే తరుణంలో డేర్‌ స్టెప్‌ తీసుకుని సినిమాల్లోకి వచ్చారు. సన్నిహితుల సహకారంతో ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’లో అవకాశం అందుకున్నారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. ‘మహానుభావుడు’, ‘ప్రతిరోజూ పండగే’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘గీత గోవిందం’, ‘వి’ ఇలా రెండేళ్లలో పాతిక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వకీల్‌ సాబ్‌’, ‘ఉప్పెన’, ‘నాంది’ లాంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘‘రెండేళ్లలో 25 చిత్రాలు చేయడం, మరో పది సినిమాలు సెట్స్‌ మీద ఉండడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకో పదేళ్లు నటుడిగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలన్నది నా ఆశ’’ అని సత్యసాయి శ్రీనివాస్‌ అన్నారు. 


30 ఏళ్ల తర్వాత...

‘‘వాణిజ్య హంగులతో సంబంధం లేకుండా ప్రేక్షకుల హృదయాల్లో కలకాలం నిలిచే సినిమాలు, ప్రతిభకు కొలమానంగా నిలిచే చిత్రాలు కొన్ని ఉంటాయి. నటుడు ఆనంద చక్రపాణి కెరీర్‌కు ‘దాసి’ అలాంటి చిత్రమే! ఆ సినిమా వచ్చిన 30 ఏళ్ల తర్వాత ‘మల్లేశం’ సినిమాకు సైన్‌ చేసి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టారాయన. ఆసు యంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశం తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో విజయ్‌ దేవరకొండకు తండ్రిగా కనిపించారు. రానా హీరోగా తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’లోనూ ఆయన అవకాశం అందుకున్నారు. పాత్ర ఏదైనా పండించడానికి సిద్ధంగా ఉన్నానని  ఆనంద చక్రపాణి చెప్పారు. 


డైరెక్టర్‌ టూ ఆర్టిస్ట్‌...

‘ఆడుతూ పాడుతూ’, ‘లీలామహల్‌ సెంటర్‌’, ‘బ్లేడ్‌ బాబ్జీ’, ‘కెవ్వుకేక’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్నారు దేవి ప్రసాద్‌. అప్పుడప్పుడు ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో అతిథి పాత్రల్లో తళుక్కుమనడం ఆయనకు అలవాటు. ఇప్పుడాయన ఫుల్‌లెంగ్త్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారారు. ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రంలో గుమ్మడి పాత్ర పోషించిన ఆయన ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘రాజ్‌దూత్‌’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘విరాట పర్వం’తోపాటు పలు చిత్రాల్లోనూ భాగమయ్యారు.  


చెరగని ముద్ర కోసం...

హీరో రాంకీకి పరిచయం అవసరం లేదు. ‘సింధూర పువ్వు’ చిత్రంతో నటుడిగా చెరగని ముద్ర వేశారు. ఆయన నటించిన ఎన్నో తమిళ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. అప్పుడప్పుడూ తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రాల్లోనూ ఆయన నటించారు. ఈ మధ్యకాలంలో తెలుగుతెరపై అతిథి పాత్రల్లో మెరుస్తున్నారు రాంకీ. ‘డిస్కోరాజా’, ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘ఆకతాయి’ చిత్రాల్లో కీలక పాత్రలతో మెప్పించిన ఆయన తెలుగులో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అవకాశాలొస్తే వదులుకోనంటున్నారు. ‘‘సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలకే ప్రాధాన్యమిస్తున్నా. హీరోగా ఎలాగైతే గుర్తింపు పొందానో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా చెరగని ముద్ర వేయాలనుకుంటున్నా’’ అని రాంకీ అంటున్నారు.

Updated Date - 2020-10-12T07:32:15+05:30 IST