రాముడికి.. రావణుడికి మధ్య ఉండే పాత్ర

ABN , First Publish Date - 2020-12-15T10:32:33+05:30 IST

‘డర్టీహరి’ బోల్డ్‌ సినిమా కాదు. ఇందులో రొమాన్స్‌ కథలో అంతర్భాగమే తప్ప కావాలని చేర్చలేదు. సినిమాలో హీనో పాత్రను రాముడిలానో, రావణుడిగానో చూపించాలనుకోలేదు...

రాముడికి.. రావణుడికి మధ్య ఉండే పాత్ర

‘డర్టీహరి’ బోల్డ్‌ సినిమా కాదు. ఇందులో రొమాన్స్‌ కథలో అంతర్భాగమే తప్ప కావాలని చేర్చలేదు. సినిమాలో హీరో పాత్రను రాముడిలానో, రావణుడిగానో చూపించాలనుకోలేదు. మామూలుగా మనుషుల్లో రాముడిలా, రావణుడిలా ఎవరూ ఉండరు. ఆ ఇద్దరి తత్వాలకు మధ్యలో ఎక్కడో ఉంటాం. అదే ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అని శ్రవణ్‌రెడ్డి అన్నారు. ఆయన కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘డర్టీహరి’. ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో గూడూరు సతీష్‌బాబు, సాయిపునీత్‌, కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న ఫ్రైడే మూవీస్‌ ఏటీటీ ద్వారా విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో శ్రవణ్‌రెడ్డి సోమవారం విలేకర్లతో ముచ్చటించారు. ‘‘నేను హైదరాబాద్‌లో పుట్టాను. బాలీవుడ్‌లో మూడు సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేశా. హిందీలో నేను నటించిన ‘థింకిస్థాన్‌’ వెబ్‌ సిరీస్‌ చూసి ఎం.ఎస్‌ రాజుగారు రాసుకున్న ‘డర్టీహరి’లో హీరో పాత్రకు నేను సూటవుతానని నమ్మి నన్ను సంప్రదించారు. ఇందులో హీరో పాత్ర గ్రే షేడ్‌లో ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో చేయాలంటే ధైర్యం కావాలి. రాజుగారి వల్ల నేను చేయగలననే నమ్మకం కలిగింది. ఆయన నాలో ‘డర్టీ హరి’ని చూసుకున్నారు. మనలో నిజమైన తత్వం ఎలా ఉంటుందో దాన్ని అలాగే తెరపై చూపించాలనుకున్నారాయన.. కథలో అంతర్లీనంగా వచ్చే విమెన్‌ సెంటిమెంట్‌ ఆకట్టుకుంటుంది. ఎంఎస్‌ రాజుగారి ప్యాషన్‌ చూసి చాలా ఇన్స్‌పైర్‌ అయ్యా. ఈ ఏజ్‌లో కూడా ఆయన ఎంతో ఎనర్జీతో సినిమాని తెరకెక్కించారు. ట్రైలర్‌ చూసి చాలామంది ‘అర్జున్‌రెడ్డి’తో పోలుస్తున్నారు. అసలు ఆ సినిమాకు దీనికి సంబంధమే లేదు. థియేటర్‌ విడుదల కోసం ఎదురుచూశాం. కానీ కుదరలేదు. ఏటీటీలో కూడా సినిమా మంచి స్పందన తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. హీరోగానే కాకుండా నటుడిగా గుర్తింపు తెచ్చే ఏ పాత్ర అయినా చేస్తా.

Updated Date - 2020-12-15T10:32:33+05:30 IST