అందుకే ఆ పాత్రకు బాలుని ఎంపిక చేశాం

ABN , First Publish Date - 2020-10-01T06:42:20+05:30 IST

‘‘బాలుగారు గొప్ప గాయకుడే కాదు... గొప్ప వ్యక్తి. వేల పాటలు పాడిన ఆయన తన ముందు పిల్లలు పాడుతుంటే... చిన్న పిల్లాడిలా మారి మురిసిపోయేవారు...

అందుకే ఆ పాత్రకు బాలుని ఎంపిక చేశాం

‘‘బాలుగారు గొప్ప గాయకుడే కాదు... గొప్ప వ్యక్తి. వేల పాటలు పాడిన ఆయన తన ముందు పిల్లలు పాడుతుంటే... చిన్న పిల్లాడిలా మారి మురిసిపోయేవారు. ‘పవిత్ర బంధం’, ‘పర్వతాలు పానకాలు’, ‘పెళ్లంటే నూరేళ్ల పంట’... ఆయనతో మూడు చిత్రాలు చేశా. మూడింటిలోనూ మంచి పాత్రలు చేశారు. దర్శకుడికి అమితమైన గౌరవం ఇస్తారు. గాయకుడిగా బిజీగా ఉన్నప్పటికీ పాత్ర నచ్చితే సినిమా అంగీకరించేవారు. ‘పవిత్ర బంధం’లో పాత్ర ఆయనకెంతో నచ్చింది.  ఆమధ్య ఓ కార్యక్రమంలో కలసిప్పుడు ‘పవిత్రబంధం’లో వెంకటేశ్‌ తండ్రి పాత్రకు నన్ను ఎందుకు ఎంపిక చేశావు?’ అని అడిగారు బాలు. నిజం చెప్పాలంటే తండ్రి పాత్రలు పోషించే నటులు చాలా మంది ఉన్నారు. కానీ బాలుగారితో ప్రత్యేకత ఏమిటంటే.. ఆయన ఎంత లావుగా ఉన్నా ముఖంలో ఓ విధమైన కొంటెతనం కనిపిస్తుంది. పైగా కొడుకుతో చాలా ఫ్రెండ్లీగా మెలిగే తండ్రి పాత్ర అది. ఆయనకు నంది అవార్డ్‌ వచ్చింది కూడా. మరో విషయం ఏమిటంటే బాలుగారు నాకంటే వయసులో కొంచెం పెద్దయినా నన్ను ‘సుబ్బన్నా’ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆయనకు హెల్త్‌ కేర్‌ ఎక్కువ. బెరియాట్రిక్‌ సర్జరీ ఆయన చేయించుకొన్నాడు. అప్పట్లో నేను వంద  కేజీల పైనే  బరువు ఉండేవాడిని. నడవడానికి కొంచెం ఇబ్బంది పడేవాడిని. అది గమనించి ‘సుబ్బన్నా.. నువ్వు ఎందుకిలా ఇబ్బంది పడతావు. నా మాట విని బేరియాట్రిక్‌ చేయించుకో. గ్లోబల్‌ హాస్పిటల్‌ వాళ్లకు నేను చెబుతాను’ అనేవాడు. ఒకసారి కాదు ఎన్నో సార్లు చెప్పాడు. అయితే నా భయం ఏమిటంటే.. అప్పటికే నాకు బైపాస్‌ సర్జరీ జరిగింది. దాని వల్ల ఏమన్నా ఎఫెక్ట్‌ అవుతుందేమోనని సందేహించేవాడిని. అందుకే బెరియాట్రిక్‌ మాట ఎత్తితే ఏదో చెప్పి తప్పించుకొనేవాణ్ణి. నా ఆరోగ్యం గురించి ఆయన కంగారు పడేవాడు. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత దేవుడికి దణ్ణం పెట్టుకుని భక్తి గీతాలు వినడం నాకు అలవాటు. నేను ఆయన గొంతు వినని రోజు ఉండదు. దేవుళ్లందరి భక్తి గీతాలు ఆయన పాడారు. బాలుగారిని డైరెక్ట్‌ చేయకముందు నుంచీ ఆయన పాటలు వినేవాణ్ణి. వ్యక్తిగతంగానూ గొప్ప మనిషి. చీమకి కూడా హాని చేయని మనిషి.’’

ముత్యాల సుబ్బయ్య

Updated Date - 2020-10-01T06:42:20+05:30 IST