నిర్మాతల మండలిలో చీలిక వద్దు: కలైపులి థాను
ABN , First Publish Date - 2020-08-08T15:31:16+05:30 IST
చెన్నై అన్నాసాలైలోని ఫిలింఛాంబర్ కార్యాలయంలో ప్రముఖ నిర్మాతలు ఎస్.థాను, మురళి, రాధాకృష్ణన్, కే రాజన్, కళైపులి శేఖరన్, కమీలా నాజర్, అళగన్ తమిళ్‌మణి, చోళా పొన్నురంగం, తిరుమలై, నళినీ సుబ్బయ్య, కేజే ఆర్ మురుగన్ సమావేశమై సంఘంలో చీలికను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్రం గా చర్చించారు.

తమిళ సినీ నిర్మాతల సంఘం త్వరలో రెండు ముక్కలయ్యేలా కనిపిస్తోంది. ప్రముఖ సినీ దర్శకుడు భారతిరాజా పోటీ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో నిర్మాతలందరూ ఆందోళన చెందుతున్నారు. ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన సంఘాన్ని రెండుగా చీల్చవద్దంటూ నిర్మాతలు అతడిని వేడుకుంటున్నారు. నిర్మాతల సంఘం కీలకమైన నిర్ణయాలను తీసుకోలేకపోతున్నదని, ప్రస్తుతం చిత్రాలను నిర్మిస్తున్నవారి బాగోగులను పట్టించుకోకుండా ఎప్పుడో సినిమాలు నిర్మించి ప్రస్తుతం ఏ చిత్రాల నిర్మించకుండా ఉన్నవారికే ఆ సంఘం సాయపడుతోందని ఆరోపిస్తూ భారతిరాజా ఈ నెల మూడున ‘నిర్మాతల కార్యాచరణ సంఘం’ పేరిట కొత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సంఘాన్ని రిజిస్టర్ చేయడానికి సన్నాహాలు కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చెన్నై అన్నాసాలైలోని ఫిలింఛాంబర్ కార్యాలయంలో ప్రముఖ నిర్మాతలు ఎస్.థాను, మురళి, రాధాకృష్ణన్, కే రాజన్, కళైపులి శేఖరన్, కమీలా నాజర్, అళగన్ తమిళ్‌మణి, చోళా పొన్నురంగం, తిరుమలై, నళినీ సుబ్బయ్య, కేజే ఆర్ మురుగన్ సమావేశమై సంఘంలో చీలికను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్రం గా చర్చించారు.
ఈ సమావేశం అనంతరం కళైపులి ఎస్.థాను మాట్లాడుతూ నిర్మాతలంతా గౌరవించే దర్శకుడు భారతిరాజా అని, ఐదు దశాబ్దాలుగా నిర్మాతలకు సేవలందిస్తున్న సంఘాన్ని విభజించటానికి పోటీ సంఘాన్ని ఏర్పాటు చేశారంటే నమ్మలేక పోతున్నామని చెప్పారు. నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా భారతిరాజాను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కూడా సభ్యులంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. సంఘంలో చీలిక తేవద్దంటూ భారతిరాజాను చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నానని తెలిపారు. ఇదిలా వుండగా నిర్మాతల సంఘంలోని కొందరు సభ్యులు భారతి రాజాను, ఆయనకు మద్దతునిస్తున్న నిర్మాతలను ఆ సంఘం నుంచి తొలగించేందుకు రహస్యంగా సంతకాల సేకరణ ప్రారంభించినట్లు తెలిసింది.
Read more