ఆ ఫీజు చెల్లించం!

ABN , First Publish Date - 2020-10-14T06:23:26+05:30 IST

డిజిటల్‌ ప్రొవైడర్స్‌కు ఇకపై విపీఎఫ్‌(వర్ట్యువల్‌ ప్రింట్‌ ఫీజ్‌)చెల్లించకూడదని తమిళనాడుకు చెందిన యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ ఇటీవల తీసుకొన్న నిర్ణయాన్ని ఇతర భాషలకు చెందిన పలువురు నిర్మాతలు...

ఆ ఫీజు చెల్లించం!

డిజిటల్‌ ప్రొవైడర్స్‌కు ఇకపై విపీఎఫ్‌(వర్ట్యువల్‌ ప్రింట్‌ ఫీజ్‌)చెల్లించకూడదని తమిళనాడుకు చెందిన  యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ ఇటీవల తీసుకొన్న నిర్ణయాన్ని ఇతర భాషలకు చెందిన పలువురు నిర్మాతలు, పంపిణీదారులు స్వాగతించారు. ఇది చాలా మంచి నిర్ణయమనీ పేర్కొంటూ అదే బాటను తామంతా నడుస్తామని ప్రకటించారు. కరోనా కారణంగా చిత్రనిర్మాణపరంగానే కాకుండా, పంపిణీ, ప్రదర్శనరంగాల్లో పలు కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయనీ, వ్యాపారపరంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వారు తెలిపారు. నిర్మాత త్యాగరాజన్‌ మాట్లాడుతూ ‘ప్రస్తుతం చిన్న, మధ్యతరగతి సినిమాల్లో అధిక శాతం నష్టాలను చవిచూస్తున్నాయి.


ముఖ్యంగా వీపీఎఫ్‌ వారికి పెనుభారంగా మారుతోంది. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే పోరాటం చెయ్యాలి. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినిమా పరిశ్రమలన్నీ వీపీఎఫ్‌ను వ్యతిరేకిస్తున్నాయి’ అని అన్నారు. జీ స్టూడియోస్‌ సంస్థ ఓ అడుగు ముందుకేసి తమ ‘ఖాలీ పీలీ’ చిత్రానికి వీపీఎఫ్‌ చెల్లించడం లేదని పేర్కొంటూ డిజిటల్‌ ప్రొవైడర్స్‌కు ఓ లేఖ రాసింది. వారి నుంచి ఇంకా సమాధానం రాలేదు. మరో పక్క దుర్గా నవరాత్రుల సందర్భంగా 10-12 చిత్రాలను విడుదల చేయడానికి బెంగాలీ నిర్మాతలు, పంపిణీదారులు సన్నాహాల్లో ఉన్నారు. వారు కూడా  వీపీఎఫ్‌ చెల్లించేది లేదని స్పష్టం చేశారు. అలాగే గుజరాతీ, పంజాబీ నిర్మాతలు, పంపిణీదారులు వీరికి మద్దతు ప్రకటించారు. 

Updated Date - 2020-10-14T06:23:26+05:30 IST