స్టార్ట్ కెమెరా యాక్షన్..?

ABN , First Publish Date - 2020-08-17T15:38:30+05:30 IST

స్టార్ట్ కెమెరా యాక్షన్..?

స్టార్ట్ కెమెరా యాక్షన్..?

చెన్నై, (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ కారణంగా సుమారు ఐదు నెలలుగా థియేటర్లు మూతపడి, షూటింగ్‌లు నిలిచిపోయి తమిళ చలనచిత్ర పరిశ్రమ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న వందకు పైగా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. వేలాదిమంది కార్మికులు, సాంకేతిక కళాకారులు ఉపాధి లేక పస్తులతో గడుపుతున్నారు. సినిమాలపై పెట్టిన కోట్లాది రూపాయల పెట్టుబడి తిరిగి వస్తుందో రాదో తెలియక నిర్మాతలంతా అమోమయంలో, ఆందోళన చెందుతున్నారు. సినిమా షూటింగ్‌లు ప్రారంభించేందుకు అనుమతించా లని దర్శకుడు భారతిరాజా, ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తదితర సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామిని కలుసుకుని వినతి పత్రాలు సమర్పించారు. గత రెండు నెలలుగా సినీ రంగ ప్రముఖులు షూటింగ్‌లు ప్రారంభించేందుకు అనుమతించాలని కోరుతున్నారు. థియే టర్లు తెరవాలని, షూటింగ్‌ లకు అనుమతించి తమిళ సినీ పరిశ్రమను కష్టాల నుంచి గట్టెక్కించాలని పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ నుంచి సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం అను మతిస్తుందని చెబుతున్నారు. అయితే సినిమా థియేటర్లను తెరిచేందుకు ఇప్పట్లో ప్రభుత్వం అనుమ తించదని మాత్రం తెలుస్తోంది. ఒక వేళ సెప్టెంబర్‌ నుంచి షూటింగ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తే గతంలో మాదిరిగా షూటింగ్‌లు చురు కుగా కొనసాగుతాయా? కొన సాగటం కష్టమనే పలు వురు సీనియర్‌ దర్శకులు అభిప్రాయపడుతు న్నారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, విజయ్‌, అజిత్‌ వంటి హీరో లు నటించ నున్న భారీ బడ్జెట్‌ సినిమాల షూటింగ్‌లు గతంలా జరిగే అవకాశం లేదనే చెబుతున్నారు.


‘అన్నాత్తే’ షూటింగ్‌ ?

శివా దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న ‘అన్నాత్తే’ చిత్రం షూటింగ్‌ సగంలో ఆగిపోయింది. మళ్ళీ ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించినా రజనీ, ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్‌, కమెడియన్లు, విలన్‌లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు వందల సంఖ్యలో జూనియర్‌ ఆర్టిస్టులను ఒకే చోట చేర్చి షూటింగ్‌ జరపటం చాలా కష్టం. వీరిలో ఎవ రికైనా  వైరస్‌ సోకితే షూటింగ్‌ ఆగిపోతుంది. అంతే కాదు షూటింగ్‌లో పాల్గొన్నవారందరికి కరోనా పరీక్షలు చేయాల్సి వుంటుంది. రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉంచాల్సి వస్తుంది. ఇవన్నీ నిర్మాతకు అదనపు వ్యయభారమవుతుంది. రజనీకాంత్‌ వయస్సు 70 యేళ్ళు కావడంతో కరోనా వైరస్‌ సోకితే కోలుకోవటం కష్టం. కనుక షూటింగ్‌ సమయంలో వైరస్‌ సోకకుండా రజనీ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయడం కూడా కష్టమే., ఈ పరిస్థితులలో ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా కట్టడికి వచ్చిన తరువాతే జరిగే అవకాశం ఉంది.


ఇండియన్‌-2 

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటిస్తున్న ‘ఇండియన్‌-2’ సినిమా షూటింగ్‌ కూడా గతంలా అట్టహాసంగా జరిగే అవకాశం లేదని ఆ సినీ యూనిట్‌ ప్రముఖులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌కు కొద్ది రోజులకు ముందే ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. కమల్‌హాసన్‌, కాజల్‌ అగర్వాల్‌. రకుల్‌ప్రీత్‌సింగ్‌, సిద్ధార్థ్‌ నటిస్తున్న ఆ చిత్రం షూటింగ్‌లో భారీ క్రేన్‌ కూలిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందటంతో షూటింగ్‌ నిలిపి వేశారు. ఇటీవల మృతుల కుటుంబాలకు కమల్‌, దర్శకుడు శంకర్‌ కలిసి తలా కోటి రూపాయల వంతున ఆర్థిక సాయం అందించారు. షూటింగ్‌ స్పాట్‌ ప్రమాదంతో ‘ఇండియన్‌-2’ యూనిట్‌ సభ్యులంతా ఇంకా శోకం నుంచి తేరుకోలేదు. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ సినిమా షూటింగ్‌ అనగానే వందల సంఖ్యలో జూనియర్‌ ఆర్టిస్టులుంటారని అందరికీ తెలిసిన విషయమే. మునుపటిలా వందల సంఖ్యల జనాన్ని ఒకే చోట చేర్చి షూటింగ్‌ జరపటానికి దర్శకుడు శంకర్‌ కూడా ఆలోచిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా తొలగిన మీదటే షూటింగ్‌ జరపాలని భావిస్తున్నారు. హీరో కమల్‌హాసన్‌కు ఇప్పుడు 65 యేళ్లు.  కరోనా బారిన పడకుండా ఆయనను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత సినీ యూనిట్‌పై ఉంటుంది. షూటింగ్‌ స్పాట్‌లో కమల్‌కు కరోనా సోకినా, తోటి కళాకారులకు సోకినా అంతే సంగతులు! ఈ అంశాలను పరిగణనలోకి  తీసుకునే దర్శకుడు శంకర్‌ షూటింగ్‌ ప్రారంభించడానికి తొందరపడటం లేదు.


అజిత్‌ ‘వలిమై’ 

ఇక అజిత్‌ నటిస్తున్న ‘వలిమై’ చిత్రం షూటింగ్‌ కూడా వెంటనే ప్రారంభించే అవకాశం లేదు. ఆ చిత్రంలో బైక్‌ రేసులు, సూపర్‌ఫైట్‌ సీన్లున్నాయి. కరోనా నిబంధనల ప్రకారం ఎవరినీ తాకకుండా ఫైట్‌ సీన్లు, బైక్‌ రేసులు వంటి దృశ్యాలను చిత్రీక రించడం సాధ్యం కాదు. ఈ ఫైట్‌ సీన్లు, బైక్‌ రేసుల సీన్లను విదేశా ల్లో చిత్రీకరిం చాలని దర్శకుడు వినోద్‌ భావిస్తు న్నారు. అయితే ప్రొడక్షన్‌ యూనిట్‌ సభ్యు లు సెప్టెం బర్‌లో రాష్ట్ర ప్రభుత్వం షూటింగ్‌లకు అను మతి ఇచ్చిన తర్వాత అప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రోసీడ్‌ అవ్వాలని అనుకుంటున్నారు.


‘మాస్టర్‌’ రిలీజ్‌ తర్వాతే 

ఇలయ దళపతి విజయ్‌ కూడా కరోనా వైరస్‌ కారణంగా కొత్త చిత్రాల్లో నటించేందుకు తటపటాయిస్తున్నారు. కొన్ని చిత్రాల్లో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా, కరోనా వైరస్‌ పూర్తిగా కట్టడిలోకి వచ్చిన తర్వాతే షూటింగ్‌ జరపాలని నిర్మాతలకు చెబుతున్నారు. విజయ్‌ నటిం చిన ‘మాస్టర్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మురుగదాస్‌ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రంలో నటించేందుకు విజయ్‌ సమ్మతించారు. వీరి ద్దరూ కూడా సెప్టెంబర్‌లో ప్రభుత్వం అనుమతి జారీ చేసిన వెంటనే షూటింగ్‌లు ప్రారంభించడానికి సిద్ధంగాలేరు. రాష్ట్రంలో సినిమా థియేటర్లన్నీ తెరచి, మాస్టర్‌ చిత్రం విడుదలైన తర్వాతే కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభిం చాలని మురుగదాస్‌, విజయ్‌ భావిస్తున్నారు.


సూర్య ‘వాడివాసల్‌’

 యువనటుడు సూర్య సతీమణి జ్యోతిక నటించిన ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంతో సూర్య నటించిన ‘సూరరై పోట్రు’ చిత్రాన్ని ఽథియేటర్లలో రిలీజ్‌ చేయడానికి అంగీకరించ బోమంటూ థియేటర్ల యజమానులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వివాదం పరిష్కారమయ్యేంత వరకు కొత్త చిత్రంపై సూర్య దృష్టి సారించ లేకపోతున్నారు. వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘వాడివాసల్‌’ చిత్రంలో సూర్యా నటించాల్సి వుంది. జల్లికట్టు నేపథ్యంతో కూడిన ఆ కథను చిత్రీకరించ డానికి కరోనా నిరబంధనలు ఆటంకంగా ఉన్నాయి. కార్తీ నటిస్తున్న ‘సుల్తాన్‌’ చిత్రానికి పలు సమస్యలు ఎదురవుతున్నాయి.


శింబు ‘మానాడు’...

శింబు హీరోగా నటిస్తున్న ‘మానాడు’ చిత్రం షూటింగ్‌ కూడా వందల సంఖ్యలో జూనియర్‌ ఆర్టిస్టులతో జరపాల్సి వుంది. మహా నాడు అనే పేరుకు తగ్గట్టుగా సభలు, జనాలు తెరపై కనిపించాల్సి ఉంటుంది. కరోనా కష్టకాలంలో ఇలాంటి దృశ్యాలు చిత్రీకరించడం కూడా ప్రమాదకరమే. ఒకరికి కరోనా సోకినా వందలాదిమందికి వైద్య పరీక్షలు జరపాల్సి ఉంటుంది. వారిలో చాలామందిని రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉంచాల్సి వుటుంది. ఇవన్నీ నిర్మాతకు అదనపు భారం.


ధనుష్‌ ‘కర్ణన్‌’ 

ధనుష్‌ హీరోగా నటిస్తున్న ‘కర్ణన్‌’ చిత్రం కోసం తిరున ల్వేలి మైదానం లో ఓ విలేజ్‌ సెట్టింగ్‌ షూటింగ్‌ కోసం సిద్ధం గా వుంది. అయితే కరోనా కాలంలో ఈ-పాస్‌లతో వందలాది మంది జూనియర్‌ ఆర్టిస్టులను ఆ చోటుకు తీసుకెళ్ళి షూటింగ్‌ జరపటం కష్టం. ఇక విక్రమ్‌ పలు గెటప్‌లలో నటిస్తున్న ‘కోబ్రా’ చిత్రం షూటింగ్‌ కూడా వెంటనే ప్రారంభించడానికి వీలులేదని ఆ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. శివ కార్తికేయన్‌ నటిస్తున్న ‘డాక్టర్‌, ’అయలాన్‌’ చిత్రాలు కూడా భారీ బడ్జెట్‌ చిత్రాలు కావడంతో ఈ సినిమాల షూటింగ్‌లు కూడా వెనువెంటనే ప్రారంభించే అవకాశాల్లేవు. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌సేతుపతి అరడజను చిత్రాల్లో నటించేం దుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ చిత్రాల నిర్మాతలు కూడా సెప్టెంబర్‌లో ప్రభుత్వం అనుమతించినా వెంటనే షూటింగ్‌ ప్రారంభించ డానికి తట పటాయిస్తున్నారు. కరోనా భయం తొలగి, పరిస్థితులు పూర్తిగా అనుకూలించినత తర్వాతే షూటింగ్‌ ప్రారంభిం చాలని నిర్ణయిం చుకున్నారు.


ఇండోర్‌ షూటింగ్‌లు?

రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతించాలంటూ ప్రముఖ దర్శకుడు భారతిరాజా ఇటీవల ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లకు అనుమతించినట్లే సినిమా షూటింగ్‌లకు అనుమతించాలని కోరిన ఆయన కనీసం ఇండోర్‌ షూటింగ్‌లకైనా అనుమ తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారతిరాజా చెబుతు న్నట్లు స్టూడియోలో షూటింగ్‌లు చేసినా కథకు తగ్గట్లు దృశ్యాలను చిత్రీకరించ లేమని సీనియర్‌ దర్శకులు చెబుతున్నారు. స్టూడియోలో ఇల్లూ, వాకిలి అంటూ సెట్టింగ్‌ వేసి షూటింగ్‌ చేస్తే తెరపై సినిమా చూస్తు న్నా మనే భావన ప్రేక్షకులకు కలుగదని, ఏదో స్టేజీపై నాటకాన్ని చూస్తున్న భావనే కలుగుతుందని తెలిపారు. డిజిటల్‌ కెమెరాలు వాడకంలోకి వచ్చాక వెండి తెరపై అద్భుత దృశ్యాలు తిలకిస్తున్న ప్రేక్షకులను నాటకాలవైపు మళ్ళిం చినట్లు స్టూడియోల్లో ఇండోర్‌ షూటింగ్‌ జరపటం వల్ల ఫలితం ఉండదని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో సినిమా షూటింగ్‌లకు అనుమతిచ్చినా మునుపటిలా ‘స్టార్ట్‌... కెమెరా... యాక్షన్‌’ అంటూ సందడిగా చురుకుగా అట్టహాసంగా షూటింగ్‌లు ఆరంభమయ్యే పరిస్థితులు లేవు. తమిళ సినీ రంగంలోని అందరి మాటా అదే! అదే వాస్తవం!

Updated Date - 2020-08-17T15:38:30+05:30 IST