సాయితేజ్‌ 15వ చిత్రం ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-25T01:21:38+05:30 IST

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ హీరోగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రం డిసెంబర్‌ 25న విడుదల కాబోతోంది. డిసెంబర్‌ 24న సాయితేజ్‌ మరో చిత్రానికి పూజా కార్యక్రమాలు

సాయితేజ్‌ 15వ చిత్రం ప్రారంభం

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ హీరోగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రం డిసెంబర్‌ 25న విడుదల కాబోతోంది. డిసెంబర్‌ 24న సాయితేజ్‌ మరో చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషం ఏమిటంటే.. డిసెంబర్‌ 25న విడుదల కాబోతోన్న చిత్రాన్ని నిర్మించిన బ్యానరే.. ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం. వైవిధ్యమైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాయితేజ్‌ సంపాదించుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ... వైవిధ్యమైన సినిమాలను అందిస్తూ, క్రియేటివ్‌ థాట్స్‌ను ప్రోత్సహించడంలో ముందుండే సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై భారీ చిత్రాల అగ్రనిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వ శాఖలో పనిచేసిన కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. కాగా ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. 


'సాయితేజ్‌ 15'వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలలో దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి చిత్ర కథానాయకుడు సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ క్లాప్‌ నిచ్చారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతివేణి, కుమారుడు సుక్రాంత్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌.. దర్శకుడు కార్తీక్‌ దండుకు స్క్రిప్ట్‌ను అందజేశారు. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ప్రకటించింది.Updated Date - 2020-12-25T01:21:38+05:30 IST