ఆమె నా భార్య కావడం నా అదృష్టం: కృష్ణ

ABN , First Publish Date - 2020-02-21T04:39:01+05:30 IST

ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్‌ రికార్డ్ గ్ర‌హీత, క‌ళావాహిని శ్రీమ‌తి విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా

ఆమె నా భార్య కావడం నా అదృష్టం: కృష్ణ

ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్‌ రికార్డ్ గ్ర‌హీత, క‌ళావాహిని శ్రీమ‌తి విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా నానక్ రామ్ గూడాలోని సూప‌ర్ స్టార్‌ కృష్ణ విజయ నిర్మల నివాసంలో ఏర్పాటు చేసిన విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని సూప‌ర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు.  తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయ నిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని డైరెక్టర్ నందినిరెడ్డికి కృష్ణంరాజు, మహేష్ బాబు అందచేశారు. 


ఈ సంద‌ర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘విజయనిర్మల ఐదారు సినిమాలలో నటించినప్పుడే నేను డైరెక్ట్ చేస్తాను అంది. నేను ఒక సలహా ఇచ్చాను. ఇప్పుడే తొందరపడి డైరెక్ట్ చేయనవసరం లేదు ఒక వంద సినిమాలలో నటించి ఆ తర్వాత నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అన్నాను. అలాగే వంద సినిమాలు అయిపోయిన తరువాత డైరెక్ట్ చేసింది. మొట్టమొదటి సినిమా బడ్జెట్ తక్కువలో అవుతుందని మలయాళంలో ‘కవిత’ అనే సినిమా చేసింది. అది అద్భుతమైన విజయం సాధించింది. దాని విజయోత్సాహంతో తెలుగులో ‘మీనా’ సినిమా తీసింది. అది వందరోజులు ఆడి సూపర్ హిట్ అయింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడకుండా 46 సినిమాలు తను తీస్తే అందులో 95 శాతం హిట్ సినిమాలే తీసింది. అంత గొప్ప దర్శకురాలు నా భార్య కావడం నా అదృష్టం. ఈరోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. విజయ నిర్మల మీద ఉన్న అభిమానంతో ఈ సభకి విచ్చేసిన అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అన్నారు.

Updated Date - 2020-02-21T04:39:01+05:30 IST