ఓటీటీలో క‌ల‌ర్ ఫొటో.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2020-09-16T00:39:46+05:30 IST

కమెడియన్‌ సుహాస్‌ 'కలర్‌ ఫొటో' సినిమాతో హీరోగా మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్

ఓటీటీలో క‌ల‌ర్ ఫొటో.. ఎప్పుడంటే?

కమెడియన్‌ సుహాస్‌ 'కలర్‌ ఫొటో' సినిమాతో హీరోగా మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, సాంగ్స్ మంచి ఆదరణను పొందాయి. హృద‌య‌ కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట చిత్రాల‌తో సినిమా ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బ న‌వ్వించిన అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై..  శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ 'క‌ల‌ర్ ఫొటో' రూపొందింది. సుహాస్ సరసన తెలుగమ్మాయ్‌ చాందీని చౌద‌రి హీరోయిన్‌గా నటించింది. ప్ర‌ముఖ న‌టుడు సునీల్, వైవా హ‌ర్ష మ‌రో కీల‌క పాత్ర‌లలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.


ఈ చిత్రం అక్టోబ‌ర్ 23న విజ‌య‌ద‌శ‌మి కానుకగా విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ముహుర్తం ఖ‌రారు చేశారు. టీజర్‌, సాంగ్స్‌తో ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం థియేటర్లలోనే ఓపెన్‌ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా నిర్మాతలు ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకే మొగ్గుచూపారు. ఇక ఈ చిత్రం ఓటీటీలో విడుదల సందర్భంగా దర్శకుడు సందీప్‌ మాట్లాడుతూ.. ''ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇంటికొచ్చి ఇస్తాం. మీ మొబైల్స్‌, టీవీ, లాప్‌టాప్‌లను మా కోసం ఆన్ చేయండి చాలు. ఇంటికి వ‌చ్చి న‌వ్వించ‌డం మాకు కొత్త కాదు.." అని అంటున్నాడు. మరి ఆయన చెబుతున్నట్లుగా ఈ చిత్రం ఎంతలా మెప్పిస్తుందో అక్టోబర్‌ 23న చూద్దాం.

Updated Date - 2020-09-16T00:39:46+05:30 IST