స్టార్‌ స్టేటస్‌ వారసత్వం కాదు!

ABN , First Publish Date - 2020-10-23T06:55:37+05:30 IST

‘హీరో కొడుకులు హీరో కావడం సులభం’ అంటూ బాలీవుడ్‌పై బంధుప్రీతి విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్న రోజులివి...

స్టార్‌ స్టేటస్‌ వారసత్వం కాదు!

‘హీరో కొడుకులు హీరో కావడం సులభం’ అంటూ బాలీవుడ్‌పై బంధుప్రీతి విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్న రోజులివి. అందుకే తన తనయుడు విషయంలో ఇలాంటి విమర్శలు రాకుండా ఆమిర్‌ఖాన్‌ జాగ్రత్త పడుతున్నారు. వారసుల విషయంలో హీరోలందరూ ఒకేలా ఆలోచించరని ఆయన నిరూపించారు. అసలు విషయం ఏమిటంటే.. ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ప్రస్తుతం నాటకాల్లో నటిస్తూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. మలయాళ చిత్రం ‘ఇష్క్‌’ హిందీ రీమేక్‌తో జునైద్‌ బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ చిత్రం నటుల ఎంపిక కోసం జరిగిన ఆడిషన్స్‌లో పాల్గొన్న జునైద్‌ షార్ట్‌లి్‌స్టలో చోటు సంపాదించుకోగలిగాడు కానీ ఎంపిక కాలేకపోయాడట. ఆమిర్‌ఖాన్‌ ఓ ఫోన్‌ కాల్‌ చేస్తే జునైద్‌ పని చాలా సులువుగా అయ్యేది. కానీ ఆ విషయంలో ఆమిర్‌ఖాన్‌ మాత్రం కలగజేసుకోలేదు. తన వారసులు కూడా తమలాగా ప్రతిభను నమ్ముకొని పైకి రావాలని కోరుకునే వ్యక్తి కావడంతో తనయుడు జునైద్‌ కెరీర్‌ విషయంలో ఆయన జోక్యం చేసుకోలేదు. జునైద్‌ గురించి ఆయన్ను అడిగితే ‘‘అది అతని కెరీర్‌కు సంబంధించిన విషయం. తన సొంత నిర్ణయాలతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అతనికి నచ్చింది చేసే స్వేచ్ఛను ఇచ్చాను. అంతవరకే నా బాధ్యత’’ అని ఒక్కమాటలో తేల్చిచెప్పారట ఆమిర్‌ఖాన్‌.

Updated Date - 2020-10-23T06:55:37+05:30 IST