మెగాస్టార్ ప్రశంసను ఎప్పటికీ మర్చిపోలేను: రచయిత శ్రీధర్ సీపాన
ABN , First Publish Date - 2020-07-30T01:25:12+05:30 IST
కమర్షియల్ కథలకు కత్తిలాంటి మాటలు రాసి, కామెడీతో ప్రేక్షకులను మెప్పించగల రచయితగా శ్రీధర్ సీపాన గుర్తింపు సంపాదించుకున్నారు
కమర్షియల్ కథలకు కత్తిలాంటి మాటలు రాసి, కామెడీతో ప్రేక్షకులను మెప్పించగల రచయితగా శ్రీధర్ సీపాన గుర్తింపు సంపాదించుకున్నారు. `లౌక్యం`, `పూలరంగడు`, `ఆహ నా పెళ్ళంట` తదితర విజయవంతమైన చిత్రాలకు శ్రీధర్ రచయితగా పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న `ఆచార్య` స్క్రిప్ట్ వర్క్‌లో పాలు పంచుకుంటున్నారు. త్వరలో మెగా ఫోన్ కూడా పట్టబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా గురించి తాజాగా శ్రీధర్ మాట్లాడారు. `దర్శకుడిగా నా మొదటి సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశా. చిరంజీవిగారి అల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా ఆ సినిమా ఉంటుంది. కంప్లీట్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులను పూర్తిగా నవ్విస్తుంది. అలాగే మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. చిరంజీవిగారు కథ విన్నారు. కథంతా విన్నాక `సుదీర్ఘంగా కథ వింటున్నప్పుడు మధ్యలో రెప్పలు పడతాయి. నువ్వు కథ చెబుతుంటే రెప్ప వేయకుండా విన్నాను. ఆద్యంతం నవ్వుతూ విన్నాను` అని అన్నారు. ఆ మాట ఆస్కార్ అవార్డు వచ్చినంత సంతృప్తినిచ్చింది. అలాగే, రాఘవేంద్రరావుగారు, కొరటాల శివగారు కూడా కథను మెచ్చుకున్నార`ని శ్రీధర్ తెలిపారు.