ప్రసాద్‌ స్టూడియో-ఇళయరాజా వివాదానికి తెర

ABN , First Publish Date - 2020-12-24T17:05:23+05:30 IST

ప్రసాద్‌ స్టూడియో, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మధ్య

ప్రసాద్‌ స్టూడియో-ఇళయరాజా వివాదానికి తెర

చెన్నై : స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ స్టూడియో, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మధ్య జరిగిన కోర్టు వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఇళయరాజా ప్రసాద్‌ స్టూడియోలో ప్రవేశించడానికి, అక్కడ భద్రపరచిన సంగీత పరికరాలను తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి జారీ చేసింది. ప్రసాద్‌ స్టూడియోలోని ఓ గదిని ఇళయరాజా నాలుగు దశాబ్దాలకు పైగా రికార్డింగ్‌ థియేటర్‌గా ఉపయోగించుకున్నారు. ఆ గదిని ప్రసాద్‌ స్టూడియో నిర్వాహకులు వేరే పనుల నిమిత్తం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఆ మేరకు గదిని ఖాళీ చేయమంటూ ఇళయరాజాకు నోటీసు జారీ చేశారు. ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఇళయరాజా పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉండగానే ఆయన మరో పిటిషన్‌ వేశారు.


ప్రసాద్‌ స్టూడియోలో తన రికార్డింగ్‌ థియేటర్‌లో ఒక రోజు ధ్యానం చేసేందుకు, తన సంగీత పరికరాలను తెచ్చుకునేందుకు అనుమతి జారీ చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రసాద్‌ స్టూడియో నిర్వాహకులు ఓ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇళయరాజా ఉపయోగించిన సంగీత పరికరాలన్నీ స్టూడియోలో భద్రపరిచామని, వాటిని ఆయన ఏ సమయంలోనైనా తీసుకెళ్లవచ్చునని పేర్కొన్నారు. ఆ పరికరాలను ఇళయరాజా తీసుకెళ్లేందుకు అనుమతిస్తే ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉందని, కనుక ప్రతినిధులు ఎవరైనా వాటిని తీసుకెళితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్టూడియో నిర్వాహకులు హైకోర్టుకు తెలిపారు. ఆ పిటిషన్‌ మంగళవారం మళ్లీ విచారణకు వచ్చినప్పుడు కొన్ని నిబంధనలతో ఇళయరాజాను స్టూడియోలో ప్రవేశించడానికి అనుమతిస్తామంటూ ప్రసాద్‌ స్టూడియో నిర్వాహకులు తెలిపారు.


ఇళయరాజాతోపాటు ఓ సహాయకుడు, ఓ సంగీత కళాకారుడు, న్యాయవాదిని స్టూడియోలో ప్రవేశించడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రసాద్‌ స్టూడియోపై తాను దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ఇళయరాజా బుధవారం ప్రకటించారు. కాగా, ఇళయారాజా ప్రసాద్‌ స్టూడియోలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ గడిపేందుకు హైకోర్టు అనుమతించింది. అదే సమయంలో స్టూడియో నిర్వాహకులతో సంప్రదింపులు జరిపి సంగీత పరికరాలను తీసుకెళ్లే తేదీపై ఇళయరాజా తన నిర్ణయాన్ని తెలపాలని సూచించింది. దీనితో ఇళయరాజా, ప్రసాద్‌ స్టూడియో మధ్య గత కొంత కాలంగా సాగిన వివాదం సమసిపోయినట్లయింది.

Updated Date - 2020-12-24T17:05:23+05:30 IST