ఓటీటీ అడ్డాలో తెలుగు బిడ్డ!

ABN , First Publish Date - 2020-09-20T05:17:16+05:30 IST

ఓటీటీకి ఎల్లలు లేవు. నటీనటులకూ అంతే..! కళాకారులకు భాషతో సంబంధం లేదు. భావం పలికించగలిగితే చాలు! ప్రతిభావంతులకు ప్రతి భాషల్లోనూ అవకాశాలు వస్తాయి....

ఓటీటీ అడ్డాలో తెలుగు బిడ్డ!

ఓటీటీకి ఎల్లలు లేవు. నటీనటులకూ అంతే..! కళాకారులకు భాషతో సంబంధం లేదు. భావం పలికించగలిగితే చాలు! ప్రతిభావంతులకు ప్రతి భాషల్లోనూ అవకాశాలు వస్తాయి. అందులోనూ ఓటీటీలో యువ నటీనటులకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్‌ ఓటీటీ అడ్డాలో తెలుగు గడ్డపై పుట్టిన బిడ్డలు సత్తా చాటుతున్నారు.


శోభితా ధూళిపాళ అచ్చమైన తెలుగమ్మాయి. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి బాలీవుడ్‌లో నటిగా అవకాశాలు అందుకున్నారు. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో ‘రమన్‌ రాఘవ్‌ 2.0’తో హిందీలో నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మాతృభాష తెలుగులో అవకాశాలు అందుకున్నారు. ‘గూఢచారి’ సినిమాలో కథానాయికగా ఆకట్టుకున్నారు. అంతేకాదు ఓటీటీ వేదికగా విడుదలయ్యే హిందీ వెబ్‌ సిరీస్‌ల విషయంలోనూ శోభిత పేరు మార్మోగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ కోసం యాంథాలజీగా తెరకెక్కిన ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’తో శోభిత మరో మెట్టెక్కారు. ఆ తర్వాత హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో తెరకెక్కిన ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ సిరీస్‌ శోభిత కెరీర్‌ని మలుపు తిప్పింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన మరో వెబ్‌ సిరీస్‌ ‘బార్డ్‌ ఆఫ్‌ బ్లడ్‌’తోనూ ఆమె అలరించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కథానాయికగా బిజీగా ఉంటూనే హిందీలో వెబ్‌ సిరీస్‌లతోనూ శోభితా ధూళిపాళ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఆమె ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించారు. ప్రతిభ ఉన్న రచయితలు, దర్శకులకు ఆమె అవకాశాలు ఇవ్వబోతున్నారు. హిందీ ఇండస్ట్రీలో గుర్తింపు పొంది... తెలుగులో కథానాయికగా కొనసాగుతూ నిర్మాణ సంస్థ ప్రారంభించడం గర్వంగా ఉందని శోభిత చెబుతున్నారు. 


నటిగా.. నిర్మాతగా...

మరో హైదరాబాదీ నాయిక శ్రేయా ధన్వంతరీ కూడా హిందీ వెబ్‌ సిరీస్‌ల్లో సత్తా చాటుతున్నారు. తెలుగులో ‘జోష్‌’, ‘స్నేహగీతం’ సినిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్‌ బాట పట్టారు. హిందీలో పలు లఘు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2016లోనే వెబ్‌ సిరీస్‌లపై దృష్టిపెట్టారు. ‘లేడీస్‌ రూమ్‌’, ‘ద రీ యూనియన్‌’ సిరీస్‌లతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఓటీటీ మాధ్యమంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ట్రెండింగ్‌లో ఉన్న ‘ద ఫ్యామిలీమ్యాన్‌’ సిరీస్‌లో శ్రేయా ధన్వంతరీ కీలక పాత్ర పోషించారు. వెబ్‌సిరీస్‌ల నిర్మాణంలోనూ శ్రేయా భాగమయ్యారు. ఈ ఏడాది మేలో ఈరోస్‌ ఓటీటీలో విడుదలైన ‘ఎ వైరల్‌ వెడ్డింగ్‌’ సిరీస్‌కు ఆమె కథ అందించడమే కాకుండా, దర్శక నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నారు. కథానాయికగానూ నటించారు. ప్రస్తుతం ఆమె మరో సిరీస్‌ తీసే పనిలో ఉన్నారు. 


హైదరాబాదీ గల్లీబాయ్‌ విజయ్‌వర్మ..

హైదరాబాద్‌లోని బేగంబజార్‌, హిమాయత్‌నగర్‌కు చెందిన ‘గల్లీబాయ్‌’ విజయ్‌ వర్మ బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్నారు. చిన్నప్పుడు హైదరబాద్‌లో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కొనసాగి ఆ తర్వాత పుణె ఎఫ్‌టీఐఐలో ఫిల్మ్‌కోర్స్‌ పూర్తిచేసి బాలీవుడ్‌లో స్థిరపడ్డారు. హిందీలో రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘షోర్‌’ లఘు చిత్రంలో విజయ్‌ ఓ పాత్ర పోషించారు. తర్వాత ‘పింక్‌’, ‘మాన్‌సూన్‌ షూట్‌ అవుట్‌’, ‘గల్లీబాయ్‌’, ‘సూపర్‌30’, ‘భాగి 3’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘ఎంసీఎ’ సినిమాలో విలన్‌గా మెప్పించారు. అంతేకాకుండా బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ల్లోనూ విజయ్‌ వర్మకు మంచి క్రేజ్‌ ఉంది. ‘ఎ సూటబుల్‌ బాయ్‌’, ‘షి’, ‘చీర్స్‌ ఫ్రెండ్స్‌’, ‘రీ యూనియన్‌’ వెబ్‌ సిరీస్‌లు నెట్టింట్లో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన ‘మిర్జాపూర్‌ 2’ విజయ్‌వర్మకు చక్కని గుర్తింపు తెచ్చింది. హైదరాబాద్‌ నుంచి వచ్చి బాలీవుడ్‌లో స్థిరపడడం ఆనందంగా ఉందని చెబుతుంటారు విజయ్‌. 


మొదటి హిందీ సిరీస్‌లో...

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్‌ చేసిన తెలుగు కుర్రాడు అలీ రెజా ప్రస్తుతం టీవీ సీరియళ్లు, సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా జీ5 ఓటీటీ కోసం హిందీలో ‘ఎక్స్‌పైరీ డేట్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించారు. దీనితో కథానాయిక స్నేహా ఉల్లాల్‌ ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. జీ5 సంస్థ ఈ సిరీస్‌ను తెలుగులో కూడా విడుదల చేయనుంది.  Updated Date - 2020-09-20T05:17:16+05:30 IST