బాలు అన్నయ్యకి నా విన్నపం: సిరివెన్నెల

ABN , First Publish Date - 2020-08-19T02:03:39+05:30 IST

గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇటీవ‌ల‌ కరోనా వైర‌స్ సోక‌డంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయ‌న

బాలు అన్నయ్యకి నా విన్నపం: సిరివెన్నెల

గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇటీవ‌ల‌ కరోనా వైర‌స్ సోక‌డంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి కాస్త విష‌మించ‌డంతో ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకుంటున్నార‌ని ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.చ‌ర‌ణ్, అలాగే ఎంజీఎం హాస్పిటల్స్ వైద్య సిబ్బంది తెలుపుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నట్లుగా సోష‌ల్ మీడియాలో ప్రతి ఒక్కరు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంను అన్నయ్యా.. అంటూ ఆప్యాయంగా పిలిచే పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి.. ఇన్నిరోజులు నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకునే హక్కు, అక్కర నీకు లేవని.. తొందరగా కోలుకుని రావాలని కోరుతూ ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కోసం ఓ వీడియోను విడుదల చేశారు.


‘‘ఒక్క ప్రాణం కాస్త నలతగా ఉండి ఆయాస పడుతుంటే.. ఒకటి కాదు, వేలూ లక్షలు కాదు కోట్లాది ప్రాణాలు కలతపడి కొట్టుకులాడుతున్నాయి. ఒక్క శ్వాసలో సరిగమల అపశృతిని సరిచేసుకుంటుంటే.. నా దేశపు ఊపిరి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కొన్ని తరాలుగా గాలి.. బాలు పాటగా, మాటగా ఉనికిని చాటుకుంటూ వీస్తుంది.. విహరిస్తోంది. ఇప్పుడెందుకో.. ఒక చిన్న వెంటిలేటర్ ఇరుకులో చిక్కుకుని విలవిలలాడుతోంది. కొన్నాళ్లుగా ఆకాశపు మౌనం కంటికి, మింటికి ఏకధారగా రోధించి.. నిన్నటి నుంచే వెచ్చటి సూర్యకిరణాలతో చక్కిళ్ళు తుడుచుకుని కాస్త తెరిపిడిపడుతోంది. అన్నయ్యా.. ఇంక చాలు. ఇన్నిరోజులు నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకునే హక్కు, అక్కర నీకు లేవు. తొందరగా కోలుకో.. కొత్త పల్లవితో ప్రకృతిని ప్రాణహితిణిగా చిగురించనీ. మా అందరి గొంతులో కొట్టుకుంటున్న గుండెల సడిని సరిచెయ్. చినుకు చమ్మలో మసకబారిపోయిన దిశలకు నీ నవ్వు వెలుగుతో దారి చూపాలి. రా.. ఇది నా ప్రార్థన. శివుడాన కాలేదు. నిన్ను చీమైనా కుట్టదు. ఆ శివయ్య మీద ఆన.. నీ తమ్ముడు సీతారాముడు..’’ అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ వీడియోలో పేర్కొన్నారు.



Updated Date - 2020-08-19T02:03:39+05:30 IST