నాకుండే గౌరవాన్ని నా అక్షరం నిలబెట్టేలా ఉండాలి: సిరివెన్నెల

ABN , First Publish Date - 2020-09-20T01:19:15+05:30 IST

తెలుగు సినిమా గేయ రచయిత, పద్మశ్రీ పురస్కార గ్రహీత సిరివెన్నెల సీతారామశాస్త్రి.. క్వోరా తెలుగులో 'జీవితమూ జీవించడమూ, నా సాహిత్యం' అనే అంశాలపై

నాకుండే గౌరవాన్ని నా అక్షరం నిలబెట్టేలా ఉండాలి: సిరివెన్నెల

తెలుగు సినిమా గేయ రచయిత, పద్మశ్రీ పురస్కార గ్రహీత సిరివెన్నెల సీతారామశాస్త్రి.. క్వోరా తెలుగులో 'జీవితమూ జీవించడమూ, నా సాహిత్యం' అనే అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయనే స్వయంగా సమాధానాలు ఇస్తున్నారు. క్వోరాలో ప్రశ్నలు అడిగిన వారికి ఆయన ఇచ్చిన సమాధానాలు.. నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.  తాజాగా ఆయనను 'ఒక సినీ గేయ రచయితకు సామాజిక బాధ్యత ఎందుకు, ఏ మేరకు ఉండాలి?' అని ఒకరు ప్రశ్నించారు. 


దీనికి ఆయన ఇచ్చిన సమాధానం:

''సినిమా పాటల రచయితకి ఎందుకు ఉండాలి సామాజిక బాధ్యత? నిజానికి, అందరికీ సమాజం పట్ల బాధ్యత ఉండాలి. సామాజిక బాధ్యత లాంటి పెద్ద పదాలు వాడటం వల్ల అలా ఉండటం ఏదో గొప్పతనంగా భావించడం, అసలు ఉండాలా వద్దా అని చర్చోపచర్చలు చేయడం ఎక్కువైపోతోంది. రోడ్డు మీద ఎడమ వైపు వెళ్ళమంటే, "కాదు, కుడి వైపుకే పోతాననడం" వల్ల ఏమవుతుంది? అయితే, నువ్వు వెళ్ళి డివైడర్‌కి గుద్దుకుని హాస్పటల్లో పడతావు. లేదంటే, ఎదుటివాడిని గుద్దేసి జైల్లో పడతావు. హాస్పటల్‌కో, జైలుకో పోతావు తప్ప తిన్నగా అయితే బతకవు. అందుకే, ఎడమ వైపే వెళ్ళాలి అన్నది ఈ సమాజం చేసిన అతి చిన్న కట్టుబాటు. నిజానికి, దాన్ని పాటించడం నీకే మంచిది. మనం సరిగ్గా నడవకపోతే? పడిపోతాం. మనం తిండి తినకపోతే? రోగం వస్తుంది. ఇదీ అంతే! సమాజంలో ఉండాల్సిన విధంగా ఉండకపోతే? అది మనకే నష్టం. దాని తాలూకు అసౌకర్యం మనమే అనుభవించాల్సి వస్తుంది. అంత సింపుల్ విషయం సామాజిక బాధ్యత అంటే. మనం సింపుల్ విషయాలను బాగా కాంప్లికేట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాం.


నువ్వు తినే ప్రతి ఒక మెతుకూ ఈ సంఘం పండించిందే. గర్వించే నీ ఈ బ్రతుకు ఈ సమాజం మలిచింది. నువ్వు ఈ భూమి మీద మొదటి ఊపిరి తీసుకున్నాకా, నీ తల్లి నుండి తీసుకున్న మొదటి పాల చుక్క కూడా ఈ సమాజపు సగటు ఉత్పత్తియే. ఎందుకంటే- నీ తల్లి ఈ సమాజంలో పుట్టింది. అందరిలాగానే సమాజం ఉత్పత్తి చేస్తున్న ఆహారం తిన్నది. ఇక్కడే పెరిగి, ఒక సామాజికుడైన నీ తండ్రిని పెళ్ళి చేసుకుని నిన్ను కన్నది. కాబట్టి, నీ తల్లిదండ్రులకు నువ్వు ఎలా అయితే రుణపడి ఉన్నావో, సమాజానికి కూడా అలాగే రుణపడి ఉన్నావు. అందుకే సమాజం పట్ల అందరికీ బాధ్యత ఉండాలనేది.


ఇప్పుడు, సినీ గేయ రచయితకి సామాజిక బాధ్యత అని అడిగారు కాబట్టి ఈ విషయానికి వద్దాం. ఇదీ అన్నిటిలానే ఒక వృత్తి. రాసేటప్పుడు అది ఎందుకు రాస్తున్నామో తెలుసుకుని రాయాలి. డబ్బులు వస్తాయి కరెక్టే. కానీ డబ్బు సంపాదించడానికి ఇదొక్కటే మార్గం కాదు కదా! నా విద్యను నేను ఈ రూపంలో ప్రదర్శిస్తున్నాను అంటే, కవిత్వం రాస్తున్నాను అంటే, కొన్ని కారణాలు ఉంటాయి. ఎవరో ఆస్వాదించాలన్నది - ఒకటి. అంతకన్నా ముఖ్యంగా - నా భావనలతో, అవి చెప్పే నా విధానంతో ఏకీభవించడానికి ఎంతమంది ఉన్నారని వెతుక్కోవడం - మరొకటి. అలా, ఈ రూపంలో నాలాగే ఈ భావాలని కలిగి ఉన్నవారిని వెతుక్కుంటున్నాను.


ఈ కవిత్వం బయటకు ఎలా వెళ్తోందీ? సినిమా పాట రూపంలో. ఇక్కడ నేను రాసే అక్షరం ధ్వని ముద్రితమవుతుంది, కోట్లాది మందికి చేరుతుంది. వాళ్ళు ఈ పాట వినడానికి వేర్వేరు కారణాలు ఉండవచ్చు. హీరో కోసమనో, సంగీతం కోసమనో, ఊరికే కాలక్షేపం కోసమనో- ఇంకా రకరకాల ప్రాధాన్యతలు ఉండవచ్చు. వాటన్నిటి మధ్యలో నా అక్షరం బ్రతకగలిగేలా, నా భావాన్ని వినిపించి, ఆ భావాలతో ఏకీభవించగలిగేవారిని వెతికగలిగేలా రాసేంత ఆత్మగౌరవం నాకుండాలి. పాట వినడంలో రకరకాల ప్రేక్షకులకు ఉండే ఏవేవో ఉద్దేశాల మధ్య, వాటన్నిటినీ దాటి, నా మాట వారి చెవిన పడాలనీ, దానికి వారు ప్రతిస్పందించి, తిరిగి నా వరకూ వారి ప్రతిస్పందన వినిపించగలిగేలా చేయాలనీ - అనేటువంటి ఒకానొక ఆత్మగౌరవం ఉండాలి కవికి. అలాంటి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం సమాజం పట్ల అతనికి ఉండే బాధ్యత.


ఒకరు మెచ్చుకుంటారనో, ఒకరు తిడతారనో కాదు - సమాజంలో ఒక వ్యక్తిగా నాకుండే గౌరవాన్ని నా అక్షరం నిలబెట్టేలా ఉండాలి. సామాజిక బాధ్యత అని, అదేదో బరువులా, దూరంగా ఉండే భావనలా ఆలోచించకుండా, ఇది నా స్వంత గర్వం, అభిమానం - వీటిని ఈ వృత్తిలో నేను నిలబెట్టుకోవాలి అని ఆలోచించుకుంటే బాగా పాటించవచ్చు.

-(క్వోరా తెలుగు సౌజన్యంతో)

Updated Date - 2020-09-20T01:19:15+05:30 IST